నంద్యాలలో అర్థరాత్రి హడావుడి- చంద్రబాబును అరెస్టు చేస్తారంటూ పుకార్లు
చంద్రబాబును అరెస్టు చేసేందుకు పోలీసులు బయల్దేరారు అనే ప్రచారంతో టీడీపీ శ్రేణులు అలెర్ట్ అయ్యారు. ఆయనకు రక్షణగా నిలిచేందుకు నంద్యాల జిల్లావ్యాప్తంగా ఉన్న కేడర్ తరలి వస్తున్నారు.
నంద్యాలో అర్థరాత్రి కలకలం రేగింది. చంద్రబాబు బస చేసిన ప్రాంతంలో టీడీపీ నాయకుల హడావుడి మామూలుగా లేదు. నంద్యాలలో ప్రసంగం తర్వాత నేరుగా ఆర్కే ఫంక్షన్ హాల్‌కు చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయన బస చేసిన ప్రాంతానికి దాదాపు కిలోమీటర్ మేర టీడీపీ శ్రేణులు, నాయకులు మోహరించి రక్షణగా నిలుస్తున్నారని ప్రచారం నడుస్తోంది.
ఏ క్షణమైనా టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్టు చేస్తారంటూ ప్రచారం నడుస్తోంది. అయితే చంద్రబాబు మాత్రం తన షెడ్యూల్ ప్రకారమే సభల్లో పాల్గొని ప్రజలతో మాట్లాడి బస చేసే ప్రాంతానికి వెళ్లిపోయారు. అయితే ఆయన అరెస్టు కోసం అనంతపురం, కర్నూలు జిల్లా పోలీసు బెటాలియన్‌లు బయల్దేరారనే వార్త వైరల్‌గా మారింది.
చంద్రబాబును అరెస్టు చేసేందుకు పోలీసులు బయల్దేరారు అనే ప్రచారంతో టీడీపీ శ్రేణులు అలెర్ట్ అయ్యారు. ఆయనకు రక్షణగా నిలిచేందుకు నంద్యాల జిల్లావ్యాప్తంగా ఉన్న కేడర్ తరలి వస్తున్నారు. ఆయన బస చేసే ప్రాంతానికి సమీపంలో ఉన్న నాయకులంతా తమ వాహనాల్లో అక్కడకు చేరుకున్నారు.
ఒక్కసారిగా టీడీపీ కేడర్ నాయకులు ఇలా చంద్రబాబు బస చేసిన ఫంక్షన్ హాల్ చుట్టూ మోహరించడంతో చాలా మందిలో అరెస్టు అనుమానాలు మరింత ఎక్కువ అయ్యాయి. అలాంటిది ఏమీ లేదని పోలీసులు, ఓ వర్గం టీడీపీ లీడర్లు చెబుతున్నప్పటికీ, వేకువ జాములోపు అరెస్టు ఖాయమంటున్నారు నంద్యాల, అనంతపురంలో ఉన్న టీడీపీ లీడర్లు.
శుక్రవారం ‘బాబు ష్యూరిటీ.. భవిష్యత్తుకు గ్యారెంటీ’ కార్యక్రమంలో భాగంగా నంద్యాల రాజ్ థియేటర్ సెంటర్‌లో బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ తరఫున సర్వే నిర్వహించిన తర్వాతే సీట్ల అంశాన్ని తేలుస్తామని ముందే ప్రకటించే ఛాన్స్ మాత్రం లేదన్నారు. అందరితో చర్చించిన తర్వాత అభ్యర్థులను ఖరారు చేస్తామని తెలిపారు. తన స్థానంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని సీట్లకు ఇది వర్తిస్తుందని వివరించారు.
తాము అధికారంలో ఉన్నప్పుడు తీసుకొచ్చిన కంపెనీలకు జగన్ పేరు పెట్టుకుంటున్నారని తాము ప్రారంభించిన వాటినే మళ్లీ మళ్లీ ప్రారంభిస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఇప్పుడు విద్యుత్ కోతలతో ప్రజలకు అల్లాడిపోతున్నారని.... చార్జీలు పెంచినా విద్యుత్ ఇవ్వలేకపోతున్నారని ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచే ప్రసక్తి లేదున్నారు చంద్రబాబు.
బహిరంగ సభకు ముందు చంద్రబాబు.. మహిళా శక్తి హామీలపై మహిళలతో మాట్లాడారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ తీసుకొచ్చింది ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. పురుషులతో సమానంగా ఆస్తిలో వాటా ఇప్పించిన ఘనత కూడా ఆయనకే దక్కుతుందని వివరించారు. తిరుపతిలో మహిళా యూనివర్శిటీకి ఆధ్యుడు కూడా ఆయనేనన్నారు. మహిళలు పురుషులతో పోటీ పడి ఆర్థికంగా ఎదగాలనే డ్వాక్రా సంఘాలకు ప్రాధాన్యత ఇచ్చామని పేర్కొన్నారు. తర్వాత దీపం పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్‌లు ఇచ్చామని తెలిపారు.
వైఎస్ఆర్‌సీపీలో మాత్రం మహిళలకు వేధింపులు ఎక్కువ అయ్యాయని... లేని దిశా చట్టం చూపించి రాజకీయం చేస్తున్నారని విమర్శించారు చంద్రాబుబ. సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పి ఇప్పుడు ఆ డబ్బులతోనే పథకాలు ఇస్తున్నారని ఆరోపించారు. నాసిరకం మద్యంతో ఆరోగ్యాలు పాడుచేస్తున్నారని ధ్వజమెత్తారు. గంజాయి వ్యాపారంతో సామాన్యుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.