Mantralayam Politics: వైసీపీ కోవర్టులకు చంద్రబాబు టికెట్! కొన్ని సీట్లు అమ్ముకున్నారు: తిక్కారెడ్డి సంచలనం
Mantralayam TDP News: వైసీపీ ఎమ్మెల్యే కోవర్టుకు మంత్రాలయం టికెట్ ఇచ్చారని, చంద్రబాబు మరోసారి ఆలోచించి టికెట్ తనకు ఇవ్వాలని తిక్కారెడ్డి కోరారు.
TDP Leader Tikka Reddy: కర్నూలు: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu) రెండవ జాబితాను విడుదల చేసిన తరువాత పార్టీలో అసంతృప్తి జ్వాల రగులుతోంది. కర్నూలు జిల్లా మంత్రాలయం టికెట్‌ను ఆశించిన తిక్కారెడ్డికి నిరాశే ఎదురైంది. మంత్రాలయం టికెట్ ను టిడిపి నేత తిక్కారెడ్డి (Tikka Reddy)కి కాకుండా రాఘవేంద్ర రెడ్డికి కేటాయించారు. దీంతో మంత్రాలయం టిడిపిలో తిక్కా రెడ్డి వర్సెస్ రాఘవేంద్ర వర్గం అన్నట్లు పరిస్థితి తయారైంది. తనకు టికెట్ దక్కకపోవడంపై తిక్కారెడ్డి మాట్లాడుతూ.. వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి కోవర్టుకు టికెట్ కేటాయించారని ఆరోపించారు. పార్టీ బ్రోకర్లు బాలనాగిరెడ్డికి అమ్ముడుపోయి, వేరే వ్యక్తికి టికెట్ ఇప్పించారంటూ మండిపడ్డారు.
టికెట్లు అమ్ముకున్నారని ఆరోపణలు..
కర్నూలు జిల్లాలోనే టీడీపీ 3 సీట్లు అమ్మిందని, రాష్ట్రం మొత్తం ఇంకా ఎన్ని సీట్లు అమ్ముకుందోనని తిక్కారెడ్డి పార్టీ అధిష్టానంపై ఆరోపణలు చేశారు. ఇంకా చాలా టైం ఉందని, చంద్రబాబు నాయుడు పున:పరిశీలించి పార్టీ కోసం నిజాయితీగా పనిచేసే తనకు మంత్రాలయం టికెట్ ఇవ్వాలని కోరారు. తాను ఏమైనా పార్టీ కార్యక్రమాలు చేయలేదా, పార్టీకి వ్యతిరేకంగా ఏమైనా చేశానా చెప్పాలని ప్రశ్నించారు. కార్యకర్తల్ని ప్రాణాలకు తెగించి, కంటికి రెప్పలా కాపాడుకుని, రాష్ట్రంలోనే మంత్రాలయాన్ని మెరుగైన స్థానంలో నిలిపామన్నారు. కనీసం పిలిపించి మాట్లాడి ఉంటే అసలు విషయం తెలిసేదని, కానీ కొంతమంది బ్రోకర్లు చెప్పే విషయాన్ని నమ్మి వేరే వ్యక్తికి టికెట్లు ఇచ్చారని ఆరోపించారు. మీకు ఈ విషయం ఇప్పుడు తెలిసింది, కానీ రాఘవేంద్ర రెడ్డికి టికెట్ వస్తుందని, వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి 3 నెలల కిందట చెప్పారు. అందుకు సంబంధించి తమ వద్ద వీడియో ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు. కొంతమంది బ్రోకర్లు మాటలు నమ్మి చంద్రబాబు మోసపోయారని, మంత్రాలయం టికెట్ విషయంలో మరోసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని టికెట్ ఆశిస్తున్న నేత తిక్కారెడ్డి కోరారు.
‘చంద్రబాబు ప్రకటించిన టీడీపీ రెండో జాబితాలో తన పేరు కచ్చితంగా వస్తుందని స్థానిక నేతలు అంతా ఊహించారు. కానీ అందుకు భిన్నంగా వేరే నేతకు అవకాశం లభించింది. రమాకాంత్ రెడ్డి ప్రతిసారి చంద్రబాబు, లోకేష్ ను కలిసి బల ప్రదర్శన చూపించాలని చెప్పారు. అది నిజమేనని ఇప్పుడు నాకు అర్థమవుతోంది. జనంలో ఉంటే చాలు టికెట్లు, బీ ఫారాలు వస్తాయని నమ్మాం. కానీ వైసీపీ నేత బాలనాగిరెడ్డి కోవర్టు రాఘవేంద్రకు టికెట్ రావడం నమ్మశక్యంగా లేదు. మీరు పున:పరిశీలించి మాకు టికెట్ ఖరారు చేయాలి. లేకపోతే ఇక్కడ టీడీపికి మనుగడ ఉండదు’ అని మంత్రాలయం టికెట్ ఆశించిన టీడీపీ నేత తిక్కారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.