Prabhakar Chowdary: ముగిసిన ప్రభాకర్ చౌదరి బలనిరూపణ యాత్ర - ఇరువర్గాలకు చెక్ పెట్టారా ?
Anantapur Politics: ప్రభాకర్ చౌదరి పాదయాత్ర సొంతపార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది.తన సొంత పార్టీలో ఉన్న అసమ్మతిని కప్పిపుంచుకొనేందుకు ప్రబాకర్ చౌదరి పాదయాత్ర చేపట్టాడంటూ అధికార పార్టీ ఆరోపిస్తోంది.
అనంతపురంలో సమస్యలపై అధికార పార్టీ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ప్రభాకర్ చౌదరి చేపట్టిన నాలుగురోజుల పాదయాత్ర పూర్తయింది. అయితే ఈ పాదయాత్రలో అటు అధికార పార్టీ వైఎస్సార్‌సీపీతో పాటు, ఇటు సొంతపార్టీ టీడీపీ నేతలకు చెక్ పెట్టేందుకు ప్రభాకర్ చౌదరి తన పాదయాత్రను విజయవంతంగా ఉపయోగించుకున్నారు. అధికార పార్టీకి మూడేళ్ల పాటు సమయం ఇచ్చామని, కానీ అభివృద్ది ఎక్కడా జరగడం లేదని, గతంలో తాము శాంక్షన్ చేయించిన పనులనే ప్రస్తుతం చేపడుతూ కలరింగ్ ఇస్తున్నారంటూ ప్రజల దృష్టికి తీసుకెళ్లడానికి పాదయాత్రను ఆయుధంగా చేసుకున్నారు.
సొంత పార్టీలోనే విభేదాల నేపథ్యంలో నేతలకు చెక్ పెట్టేందుకు కూడా తన పాదయాత్రను ఉపయోగించుకున్నారు ప్రభాకర్ చౌదరి. అనంతపురం పట్టణంలో ప్రభాకర్ చౌదరి హవా తగ్గిందంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తన పట్టు ఏమాత్రం తగ్గలేదని అటు అసమ్మతి నేతలకు, ఇటు పార్టీ అదిష్ఠానానికి పాదయాత్ర ద్వారా సంకేతాలు ఇచ్చాడు. నాలుగురోజులు పాదయాత్రలో అధికార పార్టీ తప్పిదాలను ఎత్తి చూపుతూ పట్ణణ నలుమూలల తిరుగతూ సమస్యలపై ప్రశ్నిస్తూ ప్రభాకర్ చౌదరి పాదయాత్ర సాగింది. వీటికి అనుగుణంగానే చివరి రోజు జిల్లాలో తనను గట్టిగా బలపరిచే నేతలతో కలిసి బహిరంగసభ నిర్వహించారు. చివరి రోజు యాత్రలో మాజీ మంత్రులు కాలువ శ్రీనివాసులు, పల్లె రఘునాథ్ రెడ్డి, ఎన్ఎండి ఫరూక్ తో పాటు, మాజీ ఎమ్మెల్యేలు జితేంద్ర గౌడ్, హనమంతరాయ చౌదరి తదితరులు అంతా హాజరవ్వడం ద్వారా జేసీ వర్గానికి చెక్ పెట్టేందుకు తాను ఏస్థాయిలో చక్రం తిప్పగలనో అన్న సంకేతాలను అదిష్ఠానానికి పంపారు. అయితే వీరంతా గతంలో కూడా ప్రభాకర్ చౌదరితో ఉన్నవారేనని, ప్రస్తుతం ఎవరైతే అసమ్మతి నేతలు ఉన్నారో వారంతా కూడా ప్రభాకర్ చౌదరిని వ్యతిరేకిస్తూ ఇటీవలే విందు రాజకీయం ద్వారా వారి బలం కూడా చూపించారంటున్నారు జేసీ వర్గం నేతలు.
ఎన్ని పాదయాత్రలు చేసినా, ఈ సారి ప్రభాకర్ చౌదరి ప్రభావం ఏమీ ఉండదని, కచ్చితంగా జెసి వర్గం చెప్పిందే నడుస్తుందని అంటున్నారు ఆయన వర్గీయులు. ఇప్పటికే పెద్ద ఎత్తున ఇరు వర్గాలు విందు, పాదయాత్ర రాజకీయాలు చేస్తున్న నేపథ్యంలో అటు అదిష్ఠానం కూడా అన్నిటిని గమనిస్తుందని, త్వరలోనే నియోజకవర్గాల ఇంఛార్జ్‌లను మార్చే అవకాశం కూడా ఉంది. అయితే వాటికి ముందే ప్రభాకర్ చౌదరి నియోజకవర్గంలో తన బలం ఏంటో చూపించేందుకు తన పాదయాత్ర ద్వారా ప్రయత్నించాడు. వీటన్నిటిని నేపథ్యంలో అటు జెసి వర్గం కూడా ఎలా పావులు కదుపుతుందో చూడాలి మరి. ఇప్పటికే అధికార పార్టీ నేతలకు కూడా ఇరువర్గాల మధ్య ఉన్న అసమ్మతి నేపథ్యంలోనే పాదయాత్ర చేపట్టాడని, అనంతపురంలో అభివృద్ది అంశం కాదని, ఎందుకంటే గతం కంటే ఎక్కువ స్థాయిలో అభివృద్ది పనులు జరగుతున్నాయంటూ వ్యాఖ్యలు చేశారు. అనంతపురంలో ప్రభాకర్ చౌదరి పాదయాత్ర ప్రభావం పార్టీలో ఏమరకు ఉంటుందో చూడాలి.