రైల్వే విద్యుదీకరణపై స్పెషల్ ఫోకస్, గద్వాల్ - కర్నూలు మధ్య పనులను పూర్తి
విద్యుదీకరణ పనులపై రైల్వే శాఖ అధికారులు ప్రత్యేక చొరవ చూపిస్తున్నారు. దీంతో ఏడాది చివర్లో గద్వాల్ - కర్నూలు సిటీ మధ్య విద్యుదీకరణ పనులను రైల్వే శాఖ పూర్తి చేసింది.
రైల్వే విద్యుదీకరణ పనులపై రైల్వే శాఖ అధికారులు ప్రత్యేక చొరవ చూపిస్తున్నారు. దీంతో ఏడాది చివర్లో గద్వాల్ - కర్నూలు సిటీ మధ్య విద్యుదీకరణ పనులను రైల్వే శాఖ పూర్తి చేసింది.
ఆర్థిక సంవత్సరంలో టార్గెట్ ...
దక్షిణ మధ్య రైల్వే 2022-2023 ఆర్థిక సంవత్సరం చివరి అంకంలో విద్యుదీకరణకు అధిక ప్రాధాన్యమిస్తూ పనులను వేగవంతం చేసింది. దీంతో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మరిన్ని విభాగాలను విద్యుదీకరించిన మార్గాల జాబితాలో చేర్చింది. ఈ క్రమంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని గద్వాల్ - కర్నూలు సిటీ మధ్య 54 రూట్ కిమీ దూరం వరకు విద్యుదీకరణ పనులను పూర్తి చేసింది. జోన్ పరిధిలో సికింద్రాబాద్ - ధర్మవరం మధ్య పూర్తిస్థాయిలో విద్యుదీకరించిన రైలు మార్గంలో ఇప్పుడు విద్యుత్ ట్రాక్షన్ ద్వారా రైళ్లను నడిపే వీలు కలిగిందని రైల్వే శాఖ ప్రకటించింది.
విద్యుదీకరణ ప్రాజెక్ట్ లో స్టేషన్లు...
గద్వాల్ - కర్నూలు సిటీ స్టేషన్ల మధ్య విద్యుదీకరణ, డోన్ - కర్నూలు సిటీ - మహబూబ్‌నగర్.. సికింద్రాబాద్ - ముద్ఖేడ్ - మన్మాడ్ విద్యుదీకరణ ప్రాజెక్ట్ లో భాగంగా పూర్తి చేశారు. ఈ ప్రాజెక్ట్ 2018 -19 సంవత్సరంలో రూ. 916.07 కోట్ల సవరించిన అంచనా వ్యయంతో పనులు చేపట్టడం జరిగిందని రైల్వే అదికారులు వెల్లడించారు. సికింద్రాబాద్ - మహబూబ్‌నగర్ మధ్య విభాగాన్ని వేరే ప్రాజెక్టులో భాగంగా మంజూరు చేయటం ద్వారా ఇప్పటికే విద్యుదీకరించామని ప్రకటించారు. ఈ ప్రాజెక్టు కింద మహబూబ్‌నగర్ - గద్వాల్ & కర్నూలు సిటీ -డోన్ ల విభాగాల మధ్య పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. దక్షిణ మధ్య రైల్వే పరిధి లోని డోన్ - గుత్తి - ధర్మవరం మరియు నైరుతి రైల్వే పరిధిలోని ధర్మవరం - బెంగళూరు సిటీ విభాగాల మధ్య విద్యుదీకరణ కూడా పూర్తయింది. అందువల్ల, ప్యాసింజర్ రైళ్లు, గూడ్స్ రైళ్లు రెండూ, ఇప్పుడు హైదరాబాద్ - ధర్మవరం తో పాటుగా, బెంగుళూరు వరకు సజావుగా ప్రయాణించేందుకు వీలుంటుందని రైల్వే అధికారులు భావిస్తున్నారు. రైలు ప్రారంభమయిన స్టేషన్ నుంచి చివరి స్టేషన్ వరకు రైళ్లను ఎలక్ట్రిక్ ట్రాక్షన్‌త నడిపేందుకు వీలుపడుతుందని అంటున్నారు.
కార్బన్ వినియోగానికి చెక్....
ఎలక్ట్రిక్ ట్రాక్షన్‌తో రైళ్ల రాకపోకల నిర్వహణ వల్ల కార్బన్ వినియోగం తగ్గుతుందని, దీని వలన పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని రైల్వే అదికారులు అంటున్నారు. ఇంజిన్ మార్పిడిని నివారించడం ద్వారా రైళ్ల నిర్వహణలో రైలు ప్రయాణీకులకు ఎలాంటి అంతరాయం లేని రాకపోకలు సాగించేందుకు సహాయపడుతుందని చెబుతున్నారు. ప్రయాణికులు, సరకు రవాణా చేసే రైళ్ల మార్గ మధ్య నిలుపుదలను తగ్గిస్తుందని, రైళ్ల సగటు వేగాన్ని కూడా మెరుగుపరచేందుకు వీలుంటుందని తెలిపారు. విభాగాల మధ్య సామర్థ్యం పెంపుదల కారణంగా ఈ విభాగంలో మరిన్ని రైళ్లను ప్రవేశపెట్టే అవకాశం ఉందని వెల్లడించారు. విద్యుదీకరణ వల్ల రైల్వేలకు ఇంధన ఖర్చులు పెద్ద ఎత్తున ఆదా అవుతుందని, దీంతో పాటుగా కార్యాచరణ సామర్థ్యాన్ని పెంపొందించడానికి సహాయపడతాయని తెలిపారు.
సిబ్బందికి జీఎం అభినందనలు..
దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ మాట్లాడుతూ.. విద్యుద్దీకరణ పనులను పూర్తి చేయడంలో అద్భుతమైన పని తీరును కనబరిచటంతో పాటుగా, అంకితభావంతో పనిచేసినందుకు ఎలక్ట్రికల్ విభాగం, అధికారులు, సిబ్బందిని అభినందించారు. గద్వాల్- కర్నూల్ స్టేషన్ల మధ్య ఈ మార్గంలో విద్యుదీకరణ పూర్తవడంతో, సికింద్రాబాద్ - బెంగళూరు మధ్య మొత్తం సెక్షన్‌లో ఎలక్ట్రిక్ రైళ్లను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు జనరల్ మేనేజర్ తెలిపారు. జోన్ పరిధిలో ఇప్పటికే ఉన్న బ్రాడ్ గేజ్ మార్గాలను 100% విద్యుదీకరణ దిశగా వడివడిగా అడుగులు వేస్తోందని కూడా ఆయన పేర్కొన్నారు.