Nandyala: నంద్యాలలో నకిలీ వంటనూనె, దేనితో తయారు చేస్తున్నారో తెలిస్తే షాక్! దీనికే అధిక డిమాండ్
Nandyala News: కల్తీ నూనె తయారీకి నంద్యాల కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. స్థానిక నందమూరి నగర్ లోని రేకుల షెడ్డులో ఓ ముఠా కొంతకాలంగా జంతువుల కొవ్వు, మాంసంతో వంట నూనెను అత్యంత రహస్యంగా తయారు చేస్తున్నారు.
ప్రస్తుతం అంతర్జాతీయ పరిణామాల వల్ల వంట నూనెల ధరలు ఏ స్థాయిలో ఎగబాకుతున్నాయో తెలిసిందే. ఈ ఎండాకాలంలో ఎండల తరహాలో నూనెల ధరలు కూడా మండుతున్నాయి. పెరుగుతున్న ధరల వల్ల సామాన్య ప్రజలు నూనె కొనుక్కోవాలంటేనే జంకుతున్నారు. ఈ పరిస్థితిని సొమ్ము చేసుకొనేందుకు కొంత మంది ముఠా జంతువుల కొవ్వు, మాంసంతో నకిలీ వంట నూనెను తయారు చేసి వ్యాపారులకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు.
కల్తీ నూనె తయారీకి నంద్యాల కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. స్థానిక నందమూరి నగర్ లోని రేకుల షెడ్డులో ఓ ముఠా కొంతకాలంగా జంతువుల కొవ్వు, మాంసంతో వంట నూనెను అత్యంత రహస్యంగా తయారు చేస్తున్నారు. పగలు కూలీలతో మాంసం వ్యర్థాలను ఇక్కడికి తీసుకొచ్చి యంత్రంతో ముక్కలు చేసి వంట నూనె తయారీకి కావలసిన ముడి సరకును సిద్ధం చేస్తున్నారు. ఎవరు చూడరని అర్ధరాత్రి అగ్ని మంటల్లో కొవ్వును కరిగిస్తారు. వేడికి కొవ్వు నూనె మారుతుంది. దానిని ప్లాస్టిక్ టిన్నులు, సిల్వర్ డబ్బాలలో నిల్వ చేస్తారు. వారానికి దాదాపుగా 200 కేజీల కల్తీ ఆయిల్‌ను తయారు చేస్తారు. జంతువుల వ్యర్థాల నుంచి తయారు చేసిన కల్తీ ఆయిల్ డబ్బాలను రాత్రికి రాత్రే వ్యాపారుల చెంతకు చేరుస్తారు.
ముఖ్యంగా బిర్యానీ తయారీ దారులకు, చికెన్ పకోడా బండ్లకు రోడ్లపై చిరుతిండ్లు తయారుచేసే వ్యాపారులకు ఈ కల్తీ ఆయిల్‌ను అమ్ముతున్నారు. మార్కెట్లో ఆయిల్ ధరలు రోజురోజుకూ పెరుగుతూ ఉండడం వల్ల ఈ కల్తీ ఆయిల్ తక్కువ ధరకే వస్తుండడంతో వ్యాపారులు సైతం దీనినే కొనుగోలు చేసి ఆహార పదార్థాల తయారీకి వినియోగిస్తున్నారు. జంతువుల వ్యర్థాలతో తయారు చేసిన ఈ ఆయిల్ తో తయారు చేసే ఆహార పదార్థాలు చాలా రుచికరంగా ఉంటాయి. ప్రజలు కూడా ఈ ఆయిల్ తో తయారుచేసిన పదార్థాలను తినడానికి బాగా ఇష్టపడతారు. దీంతో బిజినెస్ ను మరింత పెంచుకోవడానికి వ్యాపారులు ఈ కల్తీ ఆయిల్ పైనే ఆసక్తి చూపుతున్నారు.
గత కొంతకాలం నుంచి కొంతమంది మాంసం దుకాణదారులు, గ్రూపులుగా ఏర్పడి జంతువుల వ్యర్థాలతో కల్తీ ఆయిల్‌ను తయారు చేయడం వల్ల నివాస ప్రాంతాల్లో విపరీతమైన దుర్వాసన వస్తోంది. దీంతో స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు విజిలెన్స్ అధికారులు కల్తీ ఆయిల్ తయారుచేసే కేంద్రంపై ఆకస్మిక దాడులు చేశారు. అధికారులు దాడులు చేస్తారనే ముందుగానే పసిగట్టి కల్తీ ఆయిల్ ముఠా తయారీ కేంద్రంలో ఏమీ లేకుండా చేసి అక్కడి నుంచి పరారయ్యారు. విజిలెన్స్ రెవెన్యూ ఫుడ్ సేఫ్టీ అధికారులు కల్తీ ఆయిల్ తయారీ కేంద్రాన్ని పరిశీలించి జంతువులతో నకిలీ ఆయిల్ తయారీపై స్థానికులతో ఆరా తీసి షాక్ కు గురయ్యారు.
జంతువుల వ్యర్థాలతో తయారైన కల్తీ ఆయిల్ తో తయారు చేసిన ఆహార పదార్థాలను తింటే రోగాల పాలు కావడం ఖాయం అంటున్నారు.. వైద్యులు. ఇలాంటి నూనెతో తయారు చేసిన ఆహారం తింటే లివర్ సంబంధమైన క్యాన్సర్, ఊపిరితిత్తుల వ్యాధులు, మరికొన్ని ఇతర రోగాలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. కాబట్టి ప్రజలు బయట ఫుడ్ తినేటప్పుడు ఆలోచించాలని వైద్యులు సూచిస్తున్నారు.