Kurnool: ‘కోట్ల’ చూపులు ఎటు? మూడో సారైనా గెలుస్తారా? తెలుగు తమ్ముళ్ల వ్యూహం ఫలిస్తుందా?
1991లో కర్నూల్ పార్లమెంటుకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున జిల్లా ఎంపీగా పోటీ చేసి మొదటిసారి పార్లమెంటులో అడుగు పెట్టారు.. కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి.
కర్నూల్ జిల్లాలో దశాబ్దాల రాజకీయ చరిత్ర వారిది. తన తండ్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండుసార్లు పని చేశారు. కర్నూలు జిల్లాలో వారికొక బ్రాండ్ ఇమేజ్ ఉన్నపటికీ గత ఎన్నికల ఓటమి చెందారు. అప్పటి నుంచి ప్రజలలోకి రాకుండా ఇళ్లకే పరిమితం కావడం, రెండుసార్లు పార్లమెంట్ స్థానం ఓటమిపాలై మూడోసారి పోటీ చేస్తే గెలుస్తారా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఆయనే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి.
రాజకీయ ప్రస్థానం
1991లో కర్నూల్ పార్లమెంటుకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున జిల్లా ఎంపీగా పోటీ చేసి మొదటిసారి పార్లమెంటులో అడుగు పెట్టారు. ఆ తరువాత 2004, 2009లో వరుసగా పార్లమెంటుకు ఎన్నికయ్యారు. 2012లో కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రిగా కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి పదవి బాధ్యతలు చేపట్టారు. 2014 సంవత్సరంలో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలుగా విడిపోవడంతో కాంగ్రెస్ పార్టీకి ఆంధ్ర రాష్ట్రంలో భూస్థాపితం అయ్యేవిధంగా వ్యతిరేకత రావడంతో అటు తెలంగాణలోనూ ఇటు ఆంధ్రప్రదేశ్ లోనూ కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని చాటుకోలేకపోయింది. ఉమ్మడి ఏపీలో ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు నేపథ్యంలో 2014లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి వైసీపీ అభ్యర్థి బుట్టా రేణుక చేతిలో ఓటమి పాలయ్యారు.
తెలుగు తమ్ముళ్ల ఆలోచన ఇలా
గత మూడేళ్లుగా జిల్లాలో అభివృద్ధి పనులంటూ జరగకపోగా ప్రజలలో వైసీపీ పట్ల ఉన్న వ్యతిరేకతను టీడీపీ ప్రజల దృష్టికి తీసుకెళ్లే పనిలో పడింది ఇదే సమయంలో పార్టీని బలోపేతం చేయాలని టీడీపీ అధిష్ఠానం నేతలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రజల ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది.
కర్నూలు జిల్లాలో రాజకీయాల సిద్ధాంతాలకు కట్టుబడిన కుటుంబం ఏదంటే కోట్ల కుటుంబమని అంతా చెబుతుంటారు. కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఉమ్మడి ఏపీలో కేంద్రమంత్రి పదవితో పాటు ఉమ్మడి రాష్ట్రంలో వివిధ హోదాల్లో పనిచేశారు. ప్రతిపాదన ప్రకారం తుంగభద్ర దిగువ కాలువ పైపు లైన్ల నిర్మాణం వేదవతి గుండెల ప్రాజెక్టులను పాలనపరంగా అనుమతించి జీవో జారీ చేసిన తరువాతే కోట్ల కృతజ్ఞతగా టీడీపీలో చేరారు.
అధికార పార్టీ వైఫల్యాలపై ఆందోళనలు!
రాష్ట్రంలో వైసీపీ పాలనపై కొంతకాలం వేచి చూసిన కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి ఇసుక దందాలు, ప్రాజెక్టు పనుల నిలిపివేత తదితర వైసీపీ ప్రజావ్యతిరేక చర్యలపై ఎండగడుతూ వస్తున్నారు. టీడీపీ పాలనలో అనుమతించిన వేదావతి గుండెల ప్రాజెక్టులపై కోట్ల దృష్ట్యారించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రాజెక్టు పనులను నిలిపివేయడంతో ప్రభుత్వం చర్యలపై ఆందోళన చేపట్టి ప్రజలను అప్రమత్తం చేస్తూ వస్తున్నారు. వైసీపీ పాలనలో రెండు ప్రాజెక్టుల్లో కేవలం వేదవతి మాత్రమే అనుమతించగా గుండ్రేవులపై వైసీపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు. దీంతో వేదావతి ప్రాజెక్ట్ సాధన కోసం అడపాదడపా ఆందోళన చేపడుతూ టీడీపీ కార్యకర్తలను కాపాడుకుంటూ వస్తున్నారు.
జిల్లాలో టీడీపీ బలోపేతం దిశగా అడుగులు
మరో ఏడాదిన్నర కాలంలో జరగనున్న ఎన్నికల్లో మరోసారి కర్నూలు పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు.. కోట్ల. జిల్లా కేంద్రంలో పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉండటంతో పాటు ఎమ్మిగనూరులో కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుని, నియోజకవర్గ నేతలకు కార్యకర్తలకు వారంలో రెండు రోజులపాటు అక్కడే ఉంటూ పార్టీని బలోపేతం దిశగా ముందుకు తీసుకుపోతున్నారు. ఎంపీగా కొనసాగిన సమయంలో కర్నూల్ లో 36 కోట్లతో రైల్వే లైన్ పై ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం, కృష్ణానగర్ అండర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణం పంచలింగాల సమీపంలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రైల్వే స్టేషన్ ఆధునికరణ తదితర పనులు నగర ప్రజలలో చెరగని ముద్రవేశాయి. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో తన అనుచర వర్గాన్ని కాపాడుకొంటూ వస్తున్న టీడీపీని బలోపేతం చేసే దిశగా ముందుకు వెళ్తున్నారు.
ప్రస్తుతం అధికార పార్టీ గడప గడపకు కార్యక్రమం ద్వారా.. ప్రజలకు రానున్న ఎన్నికల్లో విజయ అవకాశాల కోసం ప్రభుత్వం చేస్తున్న సేవ, ప్రభుత్వ పథకాలు ఎంతవరకు ప్రజలకు అందుతున్నాయి అనే అంశాలను ప్రజల్లోకి తీసుకు వెళ్తోంది. చాలా చోట్ల ప్రభుత్వంపై వ్యతిరేకత నేతలకు ఎదురవుతోంది. తెలుగు తమ్ముళ్లు కూడా ఇదే అదనుగా భావించి రాబోయే ఎన్నికల్లో గెలుపు వ్యూహాల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమానికి వ్యతిరేకంగా బాదుడే బాదుడు అనే కార్యక్రమం ద్వారా జనాల్లోకి వెళ్తున్న సంగతి తెలిసిందే.