ఆలయంలో ప్రొటోకాల్ దర్శనం, డౌట్ వచ్చి చెక్ చేసి కంగుతిన్న పోలీసులు
Telugu Crime News : తాను పోలీసు ఆఫీసర్ అని నమ్మించి శ్రీశైలం ఆలయంలో వీఐపీ దర్శనానికి సైతం వెళ్లాడు. కానీ కొండచరియలు విరిగిపడటంతో ఓ నకిలీ పోలీసు బండారం బయట పడింది.
Fake Police arrested in Srisailam | శ్రీశైలం: నేను పోలీస్ ఆఫీసర్ ను అంటూ పోలీసులను బురిడీ కొట్టించాడు ఓ వ్యక్తి. ఈ ఘటన నంద్యాల జిల్లా శ్రీశైలంలో చోటుచేసుకుంది. శ్రీశైలంలో తెలంగాణకు చెందిన ప్రశాంత్ అనే ఫేక్ పోలీస్ ఆఫీసర్ తను హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఆర్ఎస్ఐ అంటూ శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవాలయంలో నకిలీ పోలీస్ హల్ చల్ చేశాడు. అతను నిజంగానే ఆర్ ఎస్ ఐ అని నమ్మిన శ్రీశైలం ఒకటవ పట్టణ పోలీసులు తనకు ప్రోటోకాల్ రూమ్ ఇప్పించి వీఐపీ కోటాలో సెప్టెంబర్ 1వ తేదీన ప్రోటోకాల్ దర్శనం కూడా చేయించారు.
ప్రోటోకాల్ దర్శనం చేసుకొని తిరిగి వెళుతుండగా మొన్న కురిసిన భారీ వర్షాలకు బండ రాళ్లు పడడంతో ఈగలపెంట వద్ద తెలంగాణ అటవీశాఖ, పోలీసులు వాహనాలను నిలిపివేశారు. దీంతో ఫేక్ పోలీస్ ప్రశాంత్ తిరిగి సున్నిపెంటకు రావడంతో అతని ప్రవర్తనపై అనుమానం వచ్చింది. శ్రీశైలం సిఐ ప్రసాదరావు తనదైన స్టైల్ లో ప్రశాంత్‌ను విచారించారు. ప్రశాంత్ ఆర్ఎస్ఐ కాదని నకిలీ పోలీస్ అని గుర్తించారు. దీంతో కంగుతున్న సీఐ హైదరాబాద్ కమిషనరేట్ పోలీసులకు సమాచారాన్ని అందించాడు.
హైదరాబాదులో విచారణ చేయగా గతంలోనూ ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులతో పనులు చేయిస్తానని 40 వేలు వసూలు చేసినట్లు కేసులు కూడా నమోదు అయిందని తెలుసుకున్నారు. ఇతను పోలీసు అధికారులతో పరిచయాలు పెంచుకొని ఇలా ఐడీ కార్డులు, ఫొటోలు తీసుకుంటూ ఫేక్ పోలీస్ అవతారమెత్తినట్లు సీఐ ప్రసాదరావు తెలిపారు. నకిలీ పోలీస్ ప్రశాంత్ పై కేసు నమోదు చేసి అతడి వద్ద నుంచి నకిలీ పోలీస్ ఐడి, కారును స్వాధీనం చేసుకున్నారు. అతని వద్ద నగదు సీజ్ చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు శ్రీశైలం సిఐ ప్రసాదరావు తెలిపారు. ఎవరైనా ఇక మీదట ఇటువంటి మోసపూరిత వ్యవహారాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ ప్రసాదరావు వెల్లడించారు.