పిట్టకథల మంత్రి అంటూ బుగ్గన నియోజకవర్గంలో ఫ్లెక్సీ- మాట తప్పారని విమర్శలు
డోన్‌లో 2007లో వైఎస్ హయాంలో ప్రజలకి ఇళ్ల పట్టాల కోసం స్థలాన్ని కేటాయించారు. స్థలం మాత్రమే కేటాయించారు కానీ ఇప్పటి వరకు పట్టాల మాత్రం ఇవ్వలేదు.
నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో వెలసిన ఫ్లెక్సీలు కలకలం రేపాయి. ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌కు వ్యతిరేకంగా కొందరు బాధితులు వీటిని ఏర్పాటు చేశారని తెలుస్తోంది. ఇళ్ల పట్టాలకు సంబంధించిన విషయంలో ఆయనకు వ్యతిరేకంగా ఫ్లెక్లీలు పెట్టినట్టు టాక్
డోన్‌లోని రుద్రాక్ష గుట్టలో వైఎస్ హయాంలో ప్రజలకి ఇళ్ల కోసం స్థలాన్ని కేటాయించారు. స్థలం మాత్రమే కేటాయించారు కానీ ఇప్పటి వరకు పట్టాల మాత్రం ఇవ్వలేదు. వచ్చిన ప్రతి ఒక్కరూ ఇదిగో ఇస్తున్నాం అదిగో ఇస్తున్నామంటూ కాలయాపన చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్న వాళ్లు పట్టాలు ఇస్తామంటూ మాట ఇవ్వడం... తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి సంగతి పట్టించుకోకపోవడం ఎప్పటి నుంచో జరుగుతున్న తంతే.
బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్లకు మాట ఇచ్చారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పట్టాలు ఇస్తామన్నారు. ఇన్ని ఏళ్లు గడుస్తున్నా ఆ విషయం పట్టించుకోవడం లేదని లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. మంత్రికి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు పెట్టారు.
అసెంబ్లీలో పిట్టకథలు చెబుతున్న మంత్రి డోన్ పట్టణ ప్రజలకు రుద్రాక్ష గుట్టలో ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా మాట దాట వేస్తున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు. వాళ్లకు సిపిఐ నాయకులు మద్దతుగా నిలిచారు. ప్రధాన కూడలిలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వేశారు.
ఫ్లెక్సీలు ఏర్పాటుపై వైసీపీ లీడర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటివి సరికాదుంటూ మండిపడుతున్నారు. బాధితులు, సీపీఐ నాయకులు మాత్రం తమ చర్యను సమర్థించుకుంటున్నారు. పేదలకు పట్టాలు ఇవ్వకుంటే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
తమకు కేటాయించిన స్థలంపై కొందరు కబ్జాదారులు కన్నేశారని అందుకే పంపిణీలో జాప్యం జరుగుతుందని వాపోతున్నారు లబ్ధిదారులు. అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులను గమనించిన సిపిఐ నాయకులు ఆ ప్రాంతంలో జెండాలను పాతి పెట్టారు. ఆ స్థలాలను పేదలకే ఇవ్వాలని గతంలో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇచ్చిన హామీని గుర్తు చేస్తూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.
స్థలాల ధరలు పెరిగిపోవడంతో పేదలకు ఇచ్చినటువంటి స్థలాలను నాయకులు కాజేయాలని చూస్తున్నారని.. అలాంటి ఆలోచన మానుకోవాలని సీపీఐ నాయకులు, ప్రజలు హితువు పలుకుతున్నారు. లేని పక్షంలో రానున్న రోజుల్లో రాజకీయ నాయకులకు పేద ప్రజలు తగిన బుద్ధి చెబుతారంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. పిట్ట కథలు చెబుతూ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నట్లుగా డోను ప్రజలను కూడా అదే విధంగా మోసం చేస్తున్నటువంటి మంత్రిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు బాధితులు.
డోన్ పట్టణంలోని రుద్రాక్షగుట్టలో నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించకుండా దౌర్జన్యంగా కూల్చివేసిన రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యాన్ని ఖండిస్తూ గతంలో ఆందోళన చేపట్టారు. ఇప్పుడు ఏకంగా రాష్ట్ర మంత్రిగా మాట ఇచ్చి పేద ప్రజలను మోసం చేసిన బుగ్గన తీరును గమనించండి అని ఫ్లెక్సీ వెలియటం డోన్ పట్టణంలో కలకలం రేపుతోంది.
ఫ్లెక్సీలను తొలగించేందుకు మున్సిపల్ సిబ్బంది అక్కడికి చేరుకోవడంతో.. ఈ విషయం తెలుసుకున్న సీపీఐ నాయకులు కూడా పెద్దఎత్తున అక్కడికి చేరుకొని ఆందోళనలు చేపట్టారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన ప్రాంతానికి పోలీసులు చేరుకొని బందోబస్తు నిర్వహించారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.