Jagan Speech: చంద్రబాబు, కరవు కవల పిల్లలు - బాబును సీఎం చేసేందుకు అంతా కలిసి కుట్ర: సీఎం జగన్
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో వరుసగా నాలుగో ఏడాది సీఎం జగన్ వైఎస్సార్ రైతు భరోసా - పీఎం కిసాన్ పథకం కింద రెండో విడత ఆర్థిక సాయాన్ని రైతుల ఖాతాల్లో బటన్ నొక్కి ట్రాన్స్‌ఫర్ చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, ఒక్క కరవు మండలం కూడా ప్రకటించే అవసరం రాలేదని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ప్రతిసారి లాగానే ఈ యేడు కూడా సాధారణం కంటే ఎక్కువే వర్షపాతం నమోదైందని అన్నారు. కరవు మండలాలు ప్రకటించాల్సిన అవసరం రాకపోవడం దేవుడి దయ అని అన్నారు. కానీ చంద్రబాబు నాయుడు, కరువు రెండూ కవల పిల్లల లాంటి వారని సీఎం జగన్ ఎద్దేవా చేశారు. ఆయన హాయాంలో కరవు రాజ్యమేలేదని అన్నారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో వరుసగా నాలుగో ఏడాది సీఎం జగన్ వైఎస్సార్ రైతు భరోసా - పీఎం కిసాన్ పథకం కింద రెండో విడత ఆర్థిక సాయాన్ని రైతుల ఖాతాల్లో బటన్ నొక్కి ట్రాన్స్‌ఫర్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ప్రతి అడుగులోనూ రైతులకు అండగా ఉంటున్నామని అన్నారు.
‘‘అక్టోబర్ 12 వరకు సాధారణం కంటే 4 శాతం అధిక వర్షపాతం నమోదైంది. గతంలో సగటున 1.54 లక్షల టన్నుల ఉత్పత్తి అయితే.. ఇప్పుడు ఆహార ధాన్యాల ఉత్పత్తి సగటున 167. 24 లక్షల టన్నులకు చేరింది. 13.92 లక్షల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగింది. భూగర్భ జలాలు కూడా రికార్డు స్థాయిలో పెరిగాయి. రైతులకు రుణాలు మాఫీ చేస్తామని చంద్రబాబు మోసం చేశారు. ఈ ప్రభుత్వంలో రైతులు కోలుకుని మళ్లీ రుణాలు తీసుకుంటున్నారు’’
‘‘క్రమం తప్పకుండా ప్రతి పథకాన్ని అమలు చేస్తున్నాం. క్యాలెండర్ ప్రకారం సంక్షేమ పథకాలు పక్కాగా ఇస్తున్నాం. రాష్ట్రంలో 68 శాతం మంది రైతులకు 1.25 ఎకరాల లోపు భూమి ఉంది. 82 శాతం మంది రైతులకు 2.5 ఎకరాల లోపు భూమి ఉంది. రూ.13,500 సాయం రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎక్కడా లంచాలు, అక్రమాలకు తావు లేకుండా నేరుగా బటన్ నొక్కి ఆర్థిక సాయం చేస్తున్నాం.’’
రైతు భరోసా పథకం కింద ఇప్పటికే మే నెలలో రూ.7,500 ఇచ్చాం. ఇప్పుడు రూ.4 వేలు ఇస్తున్నాం. మూడున్నర సంవత్సరాల్లో రైతు భరోసా కింద రూ.25,971 కోట్ల మేర లబ్ధి కలిగింది. మొత్తం 50 లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బు జమ చేశాం. ఒక్కో కుటుంబానికి ఇప్పటి దాకా రూ.51 వేలు అందించాం. పట్టాలు ఉన్న రైతులకే కాకుండా కౌలు రైతులకు, దేవాదాయ భూములు సాగుచేసుకుంటున్న రైతులకు ఆర్థిక సాయం అందించాం. మూడున్నరేళ్లలో కేవలం రైతన్నల కోసం రూ.1.33 లక్షల కోట్లు ఖర్చు పెట్టాం. ఒక మండలాన్ని కూడా కరవు మండలంగా ప్రకటించాల్సిన అవసరం రాలేదు.’’ అని సీఎం జగన్ అన్నారు.
బాబు హాయాంలో డీపీటీ పథకం - జగన్
రాష్ట్రంలో మంచి పనులు చేస్తుంటే ఎల్లో మీడియాకు సహించడం లేదని సీఎం జగన్ ఎప్పటిలాగానే విమర్శించారు. ఒక వ్యక్తికి అధికారం రావాలని కుట్రలు చేస్తున్నారని, పాలనలో అప్పటికీ, ఇప్పటికీ తేడా ఉందో లేదో మీరే చెప్పాలని అన్నారు. చంద్రబాబు, దత్తపుత్రుడు సహా ఆ మీడియా సంస్థలకే అప్పట్లో లబ్ధి జరిగేదని, గతంలో డీపీటీ.. దోచుకో - పంచుకో - తినుకో అమలయ్యేదని ఎద్దేవా చేశారు. ఇప్పుడు డీబీటీ.. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ అమలవుతోందని సీఎం జగన్ అన్నారు. ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టే పార్టీలు, మీడియా సంస్థలు కూలిపోవాలని సీఎం జగన్ ఆకాంక్షించారు.