Jawan Viral Video: ఆర్మీ జవాను భూ సమస్యను పరిష్కరించిన మంత్రి నారా లోకేష్, కృతజ్ఞతలు తెలిపిన ఫ్యామిలీ
Andhra Pradesh News | ఆర్మీ జవాను భూ సమస్యను 24 గంటల్లోనే మంత్రి నారా లోకేష్ పరిష్కరించారు. తమ సమస్య పరిష్కరించినందుకు కూటమి ప్రభుత్వానికి, మంత్రి లోకేష్‌కు జవాను నరసింహమూర్తి వీడియో విడుదల చేశారు.

అమరావతి: దేశం కోసం సరిహద్దుల్లో పోరాడే ఆర్మీ జవాన్ కు మంత్రి నారా లోకేష్ అండగా నిలిచారు. శ్రీ సత్యసాయి జిల్లాలో తమకు చెందిన రెండెకరాల భూమిని కబ్జా చేశారంటూ రాష్ట్రానికి చెందిన బీఎస్ఎఫ్ జవాన్ డి.నరసింహమూర్తి జమ్మూకశ్మీర్ నుంచి సెల్ఫీ వీడియో విడుదల చేయడం తెలిసిందే. ఈ సమస్యను మంత్రి నారా లోకేష్ పరిష్కరించారు. తమ సమస్యను పరిష్కరించిన మంత్రి లోకేష్ కు జవాన్, ఆయన కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
అమరాపురం మండలం కె.శివరంలో తన భార్య, తల్లిదండ్రులకు చెందిన 2 ఎకరాల భూమిని కబ్జా చేశారని ఏపీకి చెందిన బీఎస్ఎఫ్ జవాన్ డి.నరసింహమూర్తి జమ్మూకశ్మీర్ నుంచి సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. నరసింహమూర్తి దేశ సరిహద్దుల్లో జవాన్ గా విధులు నిర్వహిస్తున్నారు. వైసీపీ హయాంలో ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేసిన నాగరాజు తమ భూమిని కబ్జా చేశారని ఆరోపించారు. ఈ విషయాన్ని విచారించి తమకు తగిన న్యాయం చేయాలంటూ సెల్ఫీ వీడియో ద్వారా మంత్రి నారా లోకేష్ ను జవాన్ నరసింహమూర్తి విజ్ఞప్తి చేశారు.
ఆర్మీ జవాను భూ సమస్యను 24 గంటల్లోనే పరిష్కరించడం జరిగింది. శ్రీ సత్యసాయి జిల్లా అమరాపురం మండలం కె.శివరంలో తన భార్య తల్లిదండ్రులకు చెందిన రెండెకరాల భూమిని వైసీపీ హయాంలో ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేసిన నాగరాజు కబ్జా చేశారని, న్యాయం చేయాలంటూ రాష్ట్రానికి చెందిన బీఎస్ఎఫ్ జవాన్… pic.twitter.com/iUjC56a676
— Lokesh Nara (@naralokesh) June 3, 2025
లోకేష్ ఆదేశాలతో సమస్య పరిష్కరించిన అధికారులు
జవాను వీడియోపై మంత్రి నారా లోకేష్ తక్షణమే స్పందించారు. జవాను భూ సమస్యను పరిష్కరించాలని అధికారులను లోకేష్ ఆదేశించారు. దీంతో అధికారులు సర్వే జరిపి పోలీసుల సమక్షంలో హద్దులు నిర్ణయించడంతో ఆ జవాను భూమి సమస్య మంగళవారం నాడు పరిష్కారమైంది. చొరవ తీసుకుని తమకు అండగా నిలవడంతో మంత్రి నారా లోకేష్‌కు జవాన్ నరసింహమూర్తితో పాటు ఆయన కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన జవాను
రెండు రోజుల కిందట సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశా. ఆ వీడియోపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. కుటుంబసభ్యులతో, నాతో స్వయంగా ఫోన్లో మాట్లాడిన ఆయన సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మాట ఇచ్చినట్లుగానే 24 గంటల్లోనే మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించి నా సమస్యను పరిష్కరించారు. మా భూమిని మాకు ఇప్పించి న్యాయం చేశారని మరో వీడియో విడుదల చేశారు జవాను నరసింహమూర్తి. కూటమి ప్రభుత్వానికి, సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మడకశిర నియోజకవర్గ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, ఎమ్మెల్సీతో పాటు పోలీసులు, మీడియా వారికి, సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. జై జవాన్ అంటూ ఆయన చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.






















