Gummanuru Jayaram: మంత్రి గుమ్మనూరు ఆడియో టేప్ వైరల్! వైసీపీ నేతకు బెదిరింపు కాల్!
Kurnool News: గుమ్మనూరు జయరాం ఆలూరు నియోజకవర్గంలోని అరికెర గ్రామానికి చెందిన వైసీపీ నేత వీరేష్ ను దుర్భాషలాడడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.
Gummanuru Jayaram Audio Tape Viral: రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం వైసీపీ కార్యకర్తను బెదిరించిన ఫోన్ కాల్ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గుమ్మనూరు జయరాం తమ్ముడు నారాయణస్వామి ఆలూరు నియోజకవర్గంలోని ఆస్పరి జడ్పీటీసీ దొరబాబును ఫోన్ కాల్ లో బెదిరించిన ఘటన మరువకముందే ఈ రోజు (ఫిబ్రవరి 8) గుమ్మనూరు జయరాం ఆలూరు నియోజకవర్గంలోని అరికెర గ్రామానికి చెందిన వైసీపీ నేత వీరేష్ ను దుర్భాషలాడడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. మంత్రి గుమ్మనూరు జయరాం అరికర గ్రామానికి చెందిన వీరేష్ కు కాల్ చేసి నువ్వు దూకుడు తగ్గించుకోకపోతే చాలా ఇబ్బందుల్లో పడతావని ఘాటుగా బెదిరించారు.
మేము వైసీపీ కార్యక్రమాల్లో మాత్రమే పాల్గొంటున్నామని.. జగన్ కోసమే పని చేస్తున్నామని అరికెరకు చెందిన వైసీపీ కార్యకర్త వీరేష్ ఫోన్ కాల్ లో చెప్పారు. దీంతో తాము కూడా జగన్ కోసమే పనిచేస్తున్నామని గుమ్మనూరు జయరాం వారించారు. నీ దూకుడు తగ్గించుకోకపోతే నువ్వు ఏమైపోతావో అంటూ కూడా మంత్రి జయరాం అసభ్య పదజాలంతో రాయలేని భాషలో వీరేష్ ను తీవ్రమైన పదజాలంతో బెదిరించడం ఆడియో టేపులో ఉంది.
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మంత్రి గుమ్మనూరు జయరాంకు ఈసారి ఆలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇవ్వనందుకు అసహనంలో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఆ అసమ్మతితోనే మంత్రి గుమ్మనూరు బ్రదర్స్ అసహనంతో ఉన్నారని అంటున్నారు. ఆలూరు నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్తగా చిప్పగిరి మండలం జడ్పీటీసీ అయిన బూసినేని విరుపాక్షకు బాధ్యతలు అప్పగించారు. బూసినేని విరుపాక్ష సమన్వయకర్తగా ప్రకటించిన తర్వాత నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృతంగా పర్యటన చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో గ్రామంలో విరుపాక్ష చేస్తున్న కార్యక్రమాల్లో వైసీపీ నేతలు చురుగ్గా పాల్గొంటున్నారని అసహనంతోనే మంత్రి గుమ్మనూరు జయరాం ఆయన సోదరుడు నారాయణస్వామి ఇలా వైసీపీ నేతలను టార్గెట్ చేస్తూ ఫోన్ కాల్స్ లో నోటికి వచ్చినట్లు దుర్భాషలాడుతున్నారని తీవ్రమైన విమర్శలు వెలువెత్తుతున్నాయి.
దీనిపైన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో పాటు వైసీపీ ప్రభుత్వ పెద్దలు వెంటనే చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ సీపీ ఆలూరు నియోజకవర్గం నేతలు కార్యకర్తలు కోరుతున్నారు.