(Source: ECI/ABP News/ABP Majha)
ఏ మొహం పెట్టుకొని ప్రధాని మోడీ రాష్ట్రానికి వస్తున్నారు : శైలజానాథ్
ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పీఎం నరేంద్ర మోడీ ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు ఏపీ పీసీసీ చీఫ్ శైలజానాథ్.
ప్రధాని మోడీ ఏ మొహం పెట్టుకొని రాష్ర్టానికి వస్తున్నారని ప్రశ్నించారు కాంగ్రెస్ నేతలు. ప్రధాని నరేంద్ర మోడీకి అడుగడుగున నిరసన తగిలేలా రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసన తెలిపారన్నారు. ఇప్పటికైనా రాష్ట్రానికి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పీఎం నరేంద్ర మోడీ ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు ఏపీ పీసీసీ చీఫ్ శైలజానాథ్. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు ఇస్తామని సాక్షాత్తు తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా ప్రమాణం చేశారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు అమలు చేయలేక మాట తప్పారని విమర్శించారు. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని రాష్ట్రానికి వస్తున్నారని శైలజనాథ్ నిలదీశారు. కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆవరణలో నిరసన దీక్ష శిబిరానికి నాయకత్వం వహించిన ఆయన.. మోడీ, బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు.
ప్రధాని నరేంద్ర మోడీ ఏకపక్ష నిర్ణయాలతో దేశాన్ని దేశ ప్రజలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని శైలజానాథ్ ఆరోపించారు. ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ పరం చేస్తూ దేశాన్ని తిరోగమనం వైపు తీసుకు వెళ్తున్నారని విమర్శించారు. ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన ప్రధాని మోదీ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని రాష్ట్రానికి వస్తున్నారో ప్రజలకు చెప్పాలన్నారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆగమేఘాల మీద ప్రధాని పర్యటనకు ఏర్పాట్లు చేశారని... ఈ లొంగుబాటు తనమేంటో అర్థం కావడం లేదన్నారు శైలజానాథ్. చొక్కా గుండీలు నలుపుకుంటూ మాట్లాడే జగన్... రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఏమైందని అడగలేరా అని ప్రశ్నించారు. ప్రశ్నిస్తానని చెప్పే పవన్ కల్యాణ్ ప్రధానిని ప్రశ్నించ లేరా అని నిలదీశారు. జగన్, పవన్, చంద్రబాబు అంతా మోడీ ముందు మాట్లాడటానికి భయపడుతున్నారని రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడటం నేర్చుకోవాలని సూచించారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే యువతకు ఉద్యోగ అవకాశాలు రాష్ట్రానికి పెట్టుబడులు పన్నుల్లో రాయితీలు వంటి ప్రయోజనాలు ఉంటాయని ఇవన్నీ తుంగలో తొక్కిన మోడీని రాష్ర్టానికి ఎలా ఆహ్వానిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు శైలజానాథ్. ఈ లొంగుబాటు బానిసత్వం తప్ప మరొకటి కాదని శైలజనాద్ విమర్శించారు. మోడీకి బహిరంగ లేఖ రాస్తున్నామని ఆయనకు పంపుతున్నామని... బాబు, జగన్, పవన్ నరేంద్ర మోడీతో ప్రజలకు హామీ ఇప్పించగలరా అని శైలజానాథ్ ప్రశ్నించారు.
నరేంద్ర మోడీ "గో బ్యాక్" అంటూ జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేతలు. ఢిల్లీని మించిన రాజధాని ఎక్కడా అనీ, పోలవరం ప్రాజెక్టు ఎక్కడా అని అడుగాలన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తెలుగు ప్రజల గౌరవాన్ని హక్కుని ఎందుకు అమ్ముతున్నారో నిలదీయలన్నారు. ప్రత్యేక హోదా ఎక్కడా అని, వెనుకబడిన ప్రాంతాలకు ఇచ్చే నిధులు ఏవి అని చెప్పి నిలబెట్టాలన్నారు. వీటన్నిటినీ ఓపెన్ మీటింగ్‌లో నిలదీయకపోతే మీరిద్దరూ తోడుదొంగలుగా ప్రజలకు తెలియజేస్తామన్నారు. అందుకే "గో బ్యాక్ నరేంద్ర మోడీ"అని రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నల్లజెండాలతో నిరసన కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు.