Andhra Pradesh CM Chandra Babu: జులై 10న హంద్రీనీవా నీరు విడుదల- అనంత పర్యటనలో చంద్రబాబు భావోద్వేగం
Andhra Pradesh CM Chandra Babu: జూలై 10న హంద్రీనీవా నీరు విడుదల చేస్తామని ఉరవకొండలో చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో గతంలో చేసిన పనులు గుర్తు చేసుకొని సీఎం భావోద్వేగానికి గురయ్యారు.

Andhra Pradesh CM Chandra Babu: ఎట్టి పరిస్థితుల్లోనూ జులై 10న హంద్రీనీవా సుజల స్రవంతి ద్వారా నీటిని విడుదల చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రాజెక్టులో ఫేజ్ - 1, 2 కింద 554 కి.మీ. మేర కాలువ లైనింగ్, వెడల్పు పనులకు రూ.3,873 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. గత పాలకుల నిర్లక్ష్యంతో ఐదేళ్లు హంద్రీనీవా పనులు ఆగిపోయాయని, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పనులను శరవేగంగా పూర్తి చేస్తోందని అన్నారు. పోలవరం-బనకచర్ల పూర్తయితే సీమలో కరవు అనే మాట వినబడదని, రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీరు అందుతుందని అన్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం చాయాపురంలో హంద్రీనీవా సుజల స్రవంతి పనులను క్షేత్రస్థాయిలో సీఎం పరిశీలించారు. అనంతరం చాయాపురంలో నిర్వహించిన ప్రజావేదికలో పాల్గొన్నారు. దేశ రక్షణలో ప్రాణాలు కోల్పోయిన మురళీ నాయక్ ఆత్మకు శాంతి చేకూరాలని సీఎం చంద్రబాబు రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి సీఎం మాట్లాడారు.
సీమను రతనాలసీమ చేస్తానని ఆరోజే చెప్పా: సీఎం చంద్రబాబు
హంద్రీనీవా ప్రాజెక్టు పనులను పర్యవేక్షించిన చంద్రబాబు ప్రజలతో ఇలా మాట్లాడారు " 1996, మార్చి 11వ తేదీన నేను ఉరవకొండ నియోజకవర్గంలో హంద్రినీవాకు శంకుస్థాపన చేశా. మనందరి ప్రియతమ నేత ఎన్టీఆర్ కల హంద్రినీవా. ఆనాడు రాయలసీమకు నీరు లేదు. ఎడారిగా మారిపోతుందని అందరూ చేతులెత్తేశారు. అలాంటి పరిస్థితుల్లో నమ్మకం కల్పించిన వ్యక్తి ఎన్టీఆర్. కృష్ణా జలాలను బచావత్ అవార్డు ప్రకారం కేటాయించేవారు. మిగులు జలాలు వాడుకునే అవకాశం ఏపీకి ఉందని భావించిన ఎన్టీఆర్ హంద్రినీవా, గాలేరు, నగరి, తెలుగుగంగ వంటి ప్రాజెక్టులు తెచ్చి సీమ దశదిశా మార్చే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత నేను ముఖ్యమంత్రి అయ్యాక సీమకు ఏం చేయాలో అన్నీ చేశాను.
ఈ జిల్లాకు నేను ఎప్పుడు వచ్చినా ప్రత్యేకంగా ఈల సౌండ్ వస్తుంది. ప్రజలు పరుగెత్తుకొచ్చి జిందాబాద్ కొడతారు. ఈ జిల్లా రూపురేఖలు మార్చాలని నిర్ణయించాను. ఒకప్పుడు ఇక్కడ వేరుశనగ పంటే వేసేవారు. పదేళ్లలో రెండేళ్లు మాత్రమే పంట వచ్చేది. నాయకులు నా దృష్టికి తెస్తే రైతులకు నష్ట పరిహారం ఇచ్చాం. నాకింకా గుర్తుంది. ఒకసారి కరువు వచ్చి మనుషులకు, పశువులకు నీరు లేదు. పశువుల కోసం చెరువుల దగ్గర క్యాంపులు పెట్టాం. కోస్తా నుంచి గడ్డి తెచ్చి పశువులను కాపాడాం. రాయలసీమ రాళ్ల సీమ అని చాలామంది అన్నారు. రతనాలసీమ చేస్తానని ఆరోజు చెప్పాను. మొన్నటి ఎన్నికల్లో కూటమికి జిల్లా వాసులు పట్టం కట్టారు.
నీరు ఉంటేనే ఏదైనా సాధ్యం. నీటి వనరుల కోసం హంద్రినీవాను వెడల్పు చేస్తానని చెప్పిన గంటలో జీవో ఇచ్చాను. అదే సమయంలో 37 శాతం పనులు పూర్తి చేశాను. 2014లో మేం గెలిచాక సీమ ప్రాజెకక్టులపై దృష్టి పెట్టాం. కియా పరిశ్రమను ఏపీకి రమ్మంటే నీళ్లు ఎక్కడున్నాయో చెప్పమన్నారు. ఆరు నెలల సమయం తీసుకుని గొల్లపల్లి ప్రాజెక్టు పూర్తిచేసి ఐదేళ్లలోనే కరువు జిల్లాకు కియా వచ్చేలా చేశాం. గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో ఒక్క రూపాయి ఖర్చు పెట్టారా, ఒక్క రోడ్డుకైనా మట్టి వేశారా, గుంటలు పూడ్చారా, కాల్వల్లో గంప మట్టి తీశారా ... అలాంటి ప్రభుత్వాల వల్ల ప్రజలకు ఒరిగేది ఏమీ ఉండదు. " అని ముఖ్య మంత్రి అన్నారు.
మీలో ఆనందానికి హంద్రినీవానే కారణం: సీఎం
" 2014-19 మధ్యకాలంలో ఇక్కడ ఇరిగేషన్ కోసమే రూ. 70 వేల కోట్లు ఖర్చు చేశాం. ఒక్క రాయలసీమలోనే రూ. 12, 441 కోట్లు ఖర్చు చేశాం. హంద్రినీవాలో రూ. 4,200 కోట్లు ఖర్చు చేశాం. 10 మీటర్ల నుంచి 16. 5 మీటర్ల వెడల్పు చేశాం. 40 టీఎంసీ నీరు తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ సీజన్‌లోనే పనులు పూర్తి చేస్తాం. 23 నుంచి 34 ప్యాకేజీలు పనులు పూర్తయ్యాయి. గొల్లపల్లి, మడకశిర బ్రాంచ్ కెనాల్ పూర్తిచేశాం. చెర్లోపల్లి, జీడిపల్లి ప్రాజెక్టులు పూర్తిచేశాం. హంద్రీనీవా ప్రాజెక్టు కోసం 512 ఏజెన్సీలు పనిచేస్తున్నాయి. మొత్తంగా 1040 మిషన్లు పనిచేస్తున్నాయి.
మొన్నటి వరకూ పుట్టపర్తి చుట్టుపక్కల నీరు కనిపించేది కాదు. ఇప్పుడు ఎక్కడ చూసినా నీరు కనిపిస్తుంటే ఆనందంగా ఉంది. ఒకప్పుడు ఇక్కడి జనం దిగాలుగా ఉండేవారు. ఇప్పడు హషారుగా ఉన్నారు. నీరు అందడంతోనే మీలో ధైర్యం వచ్చింది. అందుకు హంద్రినీవానే కారణం. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి కుప్పం వరకూ హంద్రినీవా 770 కిలోమీటర్లు పొడవుంది. ఇది ఆసియాలోనే పొడవైనది.
ప్రాజెక్టు పూర్తయితే ఫేజ్-1 కింద కర్నూలు జిల్లాలో 77,094, నంద్యాల జిల్లాలో 2,906, అనంతపురం జిల్లాలో 1,18,000 ఎకరాలు... మొత్తం 1,98,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఫేజ్-2 కింద అనంతపురం జిల్లాలో 33,617, సత్యసాయి జిల్లాలో 1,93,383, కడప జిల్లాలో 37,500, చిత్తూరు జిల్లాలో 1,40,000 ఎకరాలు కలిపి మొత్తం 4,04,500 ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఈ నీటితో హార్టికల్చర్ పంటలు వేసుకుంటే రైతాంగం ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
ఇజ్రాయిల్ దేశంలో అప్పట్లోనే మైక్రో ఇరిగేషన్ తో పంటలు పండించేవారు. ఈ విధానానికి దేశంలో మనమే మొదటిగా శ్రీకారం చుట్టాం. గత ఐదేళ్లలో డ్రిప్, మైక్రో ఇరిగేషన్ పథకాలు ఇవ్వలేదు. దేశంలోనే 90 శాతం డ్రిప్ ఇరిగేషన్‌కు సబ్సిడీ ఇచ్చేది ఏపీ ప్రభుత్వమే. పోలవరం-బనకచర్ల పూర్తయితే రాష్ట్ర ముఖచిత్రం మారిపోతుంది. 2 వేల టీఎంసీల నీరు గోదావరి నుంచి సముద్రంలోకి పోతోంది. అందులో 300 టీఎంసీ నీరు మనం తెచ్చుకోగలిగితే రాష్ట్రమంతా సస్యశ్యామలం అవుతుంది. ప్రతి ఎకరాకు నీరు అందుతుంది. రైతులు బంగారం పడిస్తారు. ప్రాజెక్టు కోసం రూ. 81 వేల కోట్లు కావాలి. సంకల్పం ఉంటే అదే దారి చూపుతుంది. పోలవరం నుంచి బనకచర్ల వరకూ నీరు తెస్తే నా జీవితం సార్ధకమవుతుంది " అంటూ చంద్రబాబు నాయుడు ఎమోషనల్ అయ్యారు.





















