Nagababu on AP Roads: రోడ్లు ఎలా ఉన్నాయో, ఏపీ పరిస్థితి కూడా అలాగే ఉంది: ప్రభుత్వంపై నాగబాబు సెటైర్
వైసీపీ ప్రభుత్వం పోలీసుల సహకారంతో తమను ఇబ్బంది పెట్టినంత మాత్రాన తమ కార్యక్రమాలను జనసేన ఆపదని నాగబాబు స్పష్టం చేశారు.
Janasena Leader Nagababu: అనంతపురం నగరంలో జనసేన పార్టీ పీఏసీ సభ్యుడు, టాలీవుడ్ నటుడు నాగబాబు పర్యటించారు. నగరంలోని చెరువు కట్టపై ఉన్న రోడ్డును జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సోదరుడైన నాగబాబు పార్టీ కార్యకర్తలతో కలిసి పరిశీలించారు. ఇక్కడ రోడ్లు ఎలా ఉన్నాయో, ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కూడా అలాగే ఉందని నాగబాబు ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వం పోలీసుల సహకారంతో తమను ఇబ్బంది పెట్టినంత మాత్రాన తమ కార్యక్రమాలను జనసేన ఆపదని స్పష్టం చేశారు.
సీఎం జగన్ ఎలాగూ రోడ్లు వేయరని, జనసేనికులు రోడ్లు వేయాలని భావించారు. అయితే జనసేన శ్రేణులు రోడ్లు వేయడం మొదలుపెట్టగానే వైసీపీ ప్రభుత్వం ఆ మంచి పనిని కూడా ఏదో ఓ కారణం చెప్పి అడ్డుకుందని మండిపడ్డారు. ప్రజాస్వామ్య దేశంలో ఇల్లీగల్, చట్ట వ్యతిరేక పనులు తప్ప ప్రజలకు ఉపయోగపడే పనులు ఎవరైనా, ఎప్పుడైనా చేయొచ్చు అన్నారు. కానీ ప్రభుత్వం చేయడం లేదని తాము మంచి పనులు మొదలుపెట్టినా ఏపీ ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టించడం నిజం కాదా అని నాగబాబు ప్రశ్నించారు.
అనంతపురంలో కలెక్టరేట్ నుంచి చెరువుకట్ట మీదుగా బుక్కరాయ సముద్రం వెళ్ళే దారి అధ్వాన్నంగా ఉన్న నేపథ్యంలో జనసేన జిల్లా అధ్యక్షులు శ్రీ టీ.సీ. వరుణ్ నేతృత్వంలో శ్రీ నాగబాబు గారు స్వయంగా పాల్గొని గుంతలు పూడుస్తారని తెలిసి అప్పటికప్పుడు రోడ్డు మరమ్మతులు ప్రారంభించారు. pic.twitter.com/lF0tv4DVAu
— JanaSena Party (@JanaSenaParty) January 22, 2023
ఎన్నికల ప్రచారం కోసం రూపొందించిన వారాహి వాహనంతో ఎక్కడి నుంచి తన యాత్రను ప్రారంభిస్తారో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. టీడీపీతో పొత్తు పెట్టుకుని అనంతపురం అర్బన్ లో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే భుజాలపై ఎక్కించుకొని గెలిపిస్తానని టీడీపీ మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి చేసిన కామెంట్లపై మీడియా ప్రశ్నించగా.. ఎన్నికల పొత్తులపై మాట్లాడేందుకు ఇది తగిన సమయం కాదన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు సభలు, సమావేశాలు జరగకుండా ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 1 పై రాష్ట్ర హైకోర్టు మొట్టికాయలు వేసిందని గుర్తుచేశారు.
అనంతపురంలో కలెక్టరేట్ నుంచి చెరువుకట్ట మీదుగా బుక్కరాయ సముద్రం వెళ్ళే దారి అధ్వాన్నంగా ఉందని జనసేన జిల్లా అధ్యక్షుడు టీ.సీ. వరుణ్ నేతృత్వంలో నాగబాబు స్వయంగా పాల్గొని గుంతలు పూడుస్తారని తెలిసి అప్పటికప్పుడు స్థానిక అధికారులు రోడ్డు మరమ్మతులు ప్రారంభించారు. అయితే రెండున్నరేళ్లగా గుంతలు కూడా పూడ్చని అధికార పార్టీ నాగబాబు వస్తారని తెలిసి అప్పటికప్పుడు రోడ్డు మరమ్మతులు చేపట్టడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు నాగబాబు ఎట్టకేలకు ఆ ప్రాంతాన్ని సందర్శించి మరమ్మతు పనులను పర్యవేక్షించారు.
అనంతపురంలో జరుగుతున్న జనసేన పార్టీ కార్యకర్తల సమావేశంలో జన సైనికులు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. జనసేన నేత నాగబాబు సమక్షంలో స్థానిక సమస్యలను, ప్రభుత్వ విధానాల గురించి తమ అభిప్రాయాలను స్థానిక ప్రజలు వ్యక్తం చేశారు.