Adoni MLA: టీడీపీ శ్రేణులపై ఆదోని ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు, ఉరేసుకోవాలంటూ మండిపాటు
Adoni MLA: టీడీపీ శ్రేణులపై ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. ఉరేసుకోవాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Adoni MLA: చంద్రబాబు విడుదల కావాలంటూ తెలుగు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. చంద్రబాబుది అక్రమ అరెస్టు అని, ఆయనను వెంటనే విడుదల చేయాలంటూ ఆందోళనలు నిర్వహిస్తున్నారు. గుండు గీయించుకుంటూ, పశువులకు వినతి పత్రాలు ఇస్తూ, ఉరితాళ్లు మెడకు బిగించుకుని నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో టీడీపీ శ్రేణులపై ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మండిపడ్డారు.
'చంద్రబాబు విడుదల కావాలని టీడీపీ నాయకులు, కార్యకర్తలు గుండు గీయించుకుంటున్నారు, పశువులకు వినతిపత్రాలు ఇస్తున్నారు, ఉరితాళ్లు మెడకు బిగించుకుని ఫోజులు ఇస్తున్నారు అదేదో నిజంగా ఉరేసుకుంటే సరిపోతుంది కదా' ్ని కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆదోనిలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్యే.. టీడీపీ శ్రేణులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబు జైలు నుంచి బయటకు రావాలంటే కనీసం రెండు, మూడు నెలలు పడుతుందని, వీరి దీక్షలను ప్రజలు ఎవరూ పట్టించుకోవడం లేదని, తాము కూడా గుర్తించడం లేదని అన్నారు. ఆదోనిలో బూటు కాలితో తన్నే పోలీసు అధికారులెవరూ లేరని, కేవలం సానుభూతి కోసం ఆ పార్టీ నాయకుడు భాస్కర్ రెడ్డి చెప్పుకుంటున్నారని చెప్పారు. పశువులకు ముఖ్యమంత్రి, మంత్రుల ఫోటోలు కట్టి.. అనుమతి లేకుండా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తే.. ప్రభుత్వం ఊరుకుంటుందా అని సాయి ప్రసాద్ రెడ్డి ప్రశ్నించారు. తాము సైతం పోలీసుల అనుమతి తీసుకునే ర్యాలీలు, ఇతర కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
రేపు విజయవాడకు నారా లోకేశ్
బుధవారం (అక్టోబర్ 4) ఉదయం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విజయవాడకు రానున్నారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సీఐడీ విచారణకు నారా లోకేశ్ హాజరు కానున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సీఆర్‌పీసీ 41ఏ కింద ఢిల్లీలో నారా లోకేశ్ కు సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఢిల్లీలో రాష్ట్రపతి, న్యాయవాదులు, రాజకీయ నాయకులు, మీడియా ప్రతినిధుల దృష్టికి టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు అంశాన్ని నారా లోకేశ్ తీసుకెళ్లారు.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పేరును సీఐడీ సెప్టెంబర్ 26న చేర్చింది. లోకేశ్ పేరును ఏ - 14గా సీఐడీ చేర్చింది. ఈ కేసులో ఇప్పటికే చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణపై ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్‌ను దక్షిణం వైపున మార్చి లబ్ధి పొందారని సీఐడీ ఆరోపిస్తోంది. హెరిటేజ్ ఆస్తులు పెంచుకోవడం కోసం ఈ అలైన్‌మెంట్ మార్చారని ఆరోపిస్తున్నారు.
నేడే సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణ
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ నేడు(అక్టోబరు 3) విచారణకు రానుంది. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో స్కిల్ డెవలప్‌మెంట్ వ్యవహారంలో అవినీతి జరిగిందని సీఐడీ కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో మాజీ సీఎం చంద్రబాబును కూడా నిందితుడిగా పేర్కొని అరెస్టు కూడా చేశారు. అయితే, తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ చంద్రబాబు తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ ను గత నెల మూడో వారంలో దాఖలు చేశారు. ఇది నేడు (అక్టోబరు 3) సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అనిరుద్ధా బోస్, జస్టిస్ బేలా ఎం. త్రివేది ధర్మాసనం ముందుకు రానుందని ‘లైవ్ లా’ ట్వీట్ చేసింది.