Kurnool News : రోజంతా మేత పెట్టలేదు, కర్నూలు మున్సిపల్ ఆఫీసులో గాడిదలతో నిరసన
Kurnool News : కర్నూలు మున్సిపల్ కార్యాలయంలో గాడిదలతో రజకులు నిరసనకు దిగారు. ట్రాఫిక్ కు ఇబ్బంది కలుగుతోందని 20 గాడిదలను అధికారులు బంధించారు. దీనిపై రజకులు నిరసనకు దిగారు.
Kurnool News : కర్నూలు నగరంలో గాడిదల బెడద ఎక్కువగా ఉందంటూ కర్నూలు మున్సిపల్ అధికారులు గురువారం 20 గాడిదలను లారీలో బంధించి సాయంత్రం విడిచిపెట్టారు.ఈ ఘటన వివాదానికి దారి తీసింది. తీసుకెళ్లిన గాడిదల్లో రెండు జీవాలు మరణించడంతో రజక సంఘం ఆధ్వర్యంలో కర్నూల్ మున్సిపల్ ఆఫీస్ లో రజక సంఘం నాయకులు గాడిదలతో నిరసనకు దిగారు. తీసుకెళ్లిన గాడిదలకు కనీసం మంచినీళ్లు కూడా పెట్టకుండా హింసించారని, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ రజకులు ధర్నా నిర్వహించారు. రజక వృత్తికి ఉపయోగపడే గాడిదలను రోజంతా బంధించి గాయపరిచిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కర్నూల్ మున్సిపల్ కార్యాలయాన్ని ఏపీ రజక వృత్తిదారుల సంఘం ముట్టడించింది.
నాలుగు వేల కుటుంబాలు
రజకులకు ఎంతగానే ఉపయోగపడే గాడిదలను మున్సిపల్ అధికారులు ఒక రోజు మొత్తం బంధించి మేత లేకుండా లారీలోనే ఉంచడం చాలా బాధాకరమని రజక సంఘం నాయకులు అన్నారు. మూగజీవాలను మేత లేకుండా బంధించిన అధికారులపై చర్య తీసుకోవాలని, గాయపడిన గాడిదలకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కర్నూలు నగరంలో రజక వృత్తిదారులు సుమారు నాలుగువేల కుటుంబాలు ఉన్నాయి. వీరిలో 70 శాతం మంది ఈ వృత్తిపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. కర్నూలు నగరంలో రజక వృత్తి చేసుకోవడానికి సరైన ధోబిగాట్లు లేక హంద్రీ నదిలో, తుంగభద్ర నదిలో బట్టలు శుభ్రం చేస్తున్నారు. బట్టలను తీసుకెళ్లడం కోసం గాడిదలను ఉపయోగిస్తారు. బట్టలను తీసుకొని హంద్రీ, తుంగభద్ర నదులకు వెళ్తుంటారు రజకులు. అయితే కర్నూల్ మున్సిపల్ అధికారులు గాడిదల వల్ల ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతుందని వృత్తిదారులకి సమాచారం ఇవ్వకుండా గురువారం రోజున గాడిదలను లారీలో ఎక్కించి ఉదయం నుంచి సాయంత్రం వరకు మేత లేకుండా లారీలోనే బంధించి ఉంచారని రజకులు ఆరోపిస్తున్నారు. నగరంలో మనుషులకు తీవ్ర ఇబ్బందులు గురి చేసేటువంటి అనేక జీవాలు కుక్కలు, పందులు వందల సంఖ్యలు ఉన్నాయని, కానీ వీటి జోలికి పోకుండా గాడిదల జోలికే పోవడం మున్సిపల్ అధికారులు రజక వృత్తిదారులపై ప్రతాపం చూపించడం సిగ్గుచేటని ఆరోపిస్తున్నారు.
ధోబీ ఘాట్లు నిర్మించాలి
మున్సిపల్ కమిషనర్ ఇప్పటికైనా ఆలోచించి గాడిదలను కట్టి వేయడానికి స్థలం చూపించి షెడ్డు నిర్మించాలని రజక సంఘం నాయకులు కోరారు. కర్నూలు నగరంలో 2009 వరదల నిధులతో మున్సిపల్ అధికారులు ధోబిగాట్లు నిర్మించారు. కానీ ప్రస్తుతం ఒక్క ధోబీ ఘాట్ కూడా అందుబాటులేదని, వాటికి మరమత్తులు చేయించి వాడకంలోకి తీసుకురావాలని కోరారు. రోజంతా మేత లేకుండా గాడిదలను బంధించి గాయపరిచిన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. గాయపడిన గాడిదలకు పరిహారం చెల్లించాలన్నారు. రజకుల ధర్నా అనంతరం మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ రామలింగేశ్వరకు నాయకులు వినతి పత్రం అందించారు. ఈ సమస్యని పై అధికారుల దృష్టికి తీసుకెళ్తానని కమిషనర్ హామీ ఇచ్చారు.
Also Read : Rajahmundry News : స్పందనలో వెరైటీ ఫిర్యాదు, నాలుగు గంటలు శ్రమించి పట్టుకున్న సిబ్బంది!
Also Read : Secunderabad News : సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో బాలుడి కిడ్నాప్, రెండు గంటల్లో ఛేదించిన పోలీసులు!