Nagayalanka Ysrcp Clashes : వైసీపీలో రచ్చకెక్కిన వర్గవిభేదాలు, నాగాయలంకలో ఎంపీ, ఎమ్మెల్యే అనుచరుల మధ్య ఫైట్
Nagayalanka Ysrcp Clashes : నాగాయలంకలో వైసీపీ నేతల మధ్య వర్గ విభేదాలు తలెత్తాయి. ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే రమేష్ బాబు వర్గీయులు పరస్పర దాడులకు దిగారు.
Nagayalanka Ysrcp Clashes : కృష్ణా జిల్లా నాగాయలంకలో ఉద్రికత్త నెలకొంది. వైసీపీ శ్రేణుల మధ్య వర్గ విభేదాలు రచ్చకెక్కాయి. నాగాయలంకలో నాబార్డు ఛైర్మన్ పర్యటనలో పాల్గొనేందుకు ఎంపీ బాలశౌరి తన అనచరులతో వచ్చారు. ఎంపీ బాలశౌరి అనుచరులపై అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు అనుచరులు చెప్పులతో దాడి చేశారు. అనంతరం ఇరువర్గాలు పరస్పరం దాడి చేసుకున్నారు. పోలీసులు వారిని వారించినా వివాదం సద్దుమణగలేదు. ఈ గొడవను చిత్రీకరిస్తున్న ఓ జర్నలిస్టు ఫోన్‌ను వైసీపీ నేతలు లాక్కుని పగలగొట్టారు.
ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ
నాగాయలంక మండలం రేమాలవారిపాలెం పంచాయతీలోని మార్కెట్ యార్డులో నాబార్డు ఛైర్మన్ కె.వి.షాజీ ఆధ్వర్యంలో మత్స్య, డ్వాక్రా సంఘాల సభ్యులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రమేష్‌బాబు, ఎంపీ బాలశౌరి అనుచరుల మధ్య వివాదం తలెత్తింది. దీంతో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఒకరిని ఒకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు. ఒకదశలో ఎమ్మెల్యే రమేష్‌బాబుపై ఎంపీ అనుచరులు దాడి చేయడానికి ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది. ఎమ్మెల్యేపై దాడిని అడ్డుకునేందుకు ఎమ్మెల్యే అనుచరులు తిరిగి దాడి చేశారు. ఈ ఘటనను వీడియో తీస్తున్న ఓ మీడియో ప్రతినిధి కెమెరాను ఎమ్మెల్యే వర్గీయులు లాక్కొని ధ్వంసం చేశారు.
ఫ్లెక్సీల వివాదం
ఇటీవల సీఎం జగన్ అవనిగడ్డ పర్యటనకు వచ్చిన సమయంలో ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే రమేష్ బాబు వర్గీయుల మధ్య ఫ్లెక్సీల వివాదం తలెత్తింది. ఈ విషయంపై మరోసారి ఇరువర్గాలు నాగాయలంకలో పరస్పర దాడులకు దిగాయి. ఈ ఘటనపై ఎమ్మెల్యే రమేష్‌బాబు స్పందిస్తూ ఎంపీ బాలశౌరికి తనకు ఎలాంటి విభేదాలు లేవన్నారు. ఎంపీ బాలశౌరి వెంట వచ్చిన గరికిపాటి శివ కారణంగానే గొడవ జరిగిందన్నారు. తన అనుచరులకు చెప్పి తోపులాటను ఆపేశామన్నారు.
విలేకరుల నిరసన
ఈ ఘర్షణలో ఎమ్మెల్యే వర్గీయులు తమపై దాడి చేశారని విలేకరులు ఆరోపిస్తున్నారు. నాగాయలంకలో ప్రభుత్వ కార్యక్రమాన్ని కవర్ చేయడానికి స్థానిక విలేకరులు వెళ్లారు. ఎమ్మెల్యే, ఎంపీల మనుషులు గ్రూపులుగా ఏర్పడి తగాదా పడుతుండటంతో మీడియా ప్రతినిధులు వీడియో తీసేందుకు ప్రయత్నించారు. ఎమ్మెల్యే వర్గీయులు విలేకరుల ఫోన్ లాక్కుని పగులగొట్టారు. దీంతో విలేకరులు నిరసన వ్యక్తం చేశారు.