Konaseema News : ఇసుకమేటలు వారి జీవనోపాధికి అడ్డంకులు, చమురు సంస్థలపై సమరానికి సిద్ధమైన మత్స్యకారులు
Konaseema News : కోనసీమ మత్య్సకారులు చమురు సంస్థల తీరుపై ఆందోళనకు సిద్ధమైంది. చమురు సంస్థలు డ్రెడ్జింగ్ చేసి వేసిన ఇసుకమేటలతో పది గ్రామాల మత్స్యకారులు వేటలేక జీవనోపాధి కోల్పోయామని ఆవేదన చెందుతున్నారు.
Konaseema News : చమురు సంస్థలపై సమరానికి కోనసీమ మత్య్సకారులు సిద్ధమయ్యారు. చమురు వెలికితీతలో భాగంగా భైరవపాలెం సముద్రతీర ప్రాంతం నుంచి గుజరాత్ కు సముద్రంలో డ్రెడ్జింగ్ ద్వారా పైప్ లైన్ నిర్మించాయి చమురు సంస్థలు. ఈ పైప్ లైన్ నిర్మాణానికి భైరవపాలెం గాడేరుమొగను డ్రెడ్జింగ్ ద్వారా ఇసుకమేటలతో ONGC చమురు సంస్థలు మూసివేశాయి. గాడేరుమొగను ఇసుక మేటలతో మూసి వేయడంతో ఐ.పోలవరం మండలం భైరవపాలెం, తీర్థాలమొండి, యానాంలోని సావిత్రినగర్, గిరియంపేటతోపాటు పది గ్రామాల మత్స్యకారులు వేటలేక జీవనోపాధి కోల్పోయారు. 2013లో గుజరాత్ చమురు సంస్థలు చమురు వెలికితీతలో భాగంగా సముద్రంలో డ్రెడ్జింగ్ చేసి గుజరాత్ కు పైప్ లైన్ వేశాయి.
ఆందోళనకు సిద్ధమైన మత్స్యకారులు
అప్పట్లో అవగాహన లేక డ్రెడ్జింగ్ పనులను అడ్డుకోలేకపోయామని మత్స్యకారులు అంటున్నారు. ప్రస్తుతం వేటకు అంతరాయం ఏర్పడడంతో ఇసుక మేటలు తొలిగించాలని పలుసార్లు మత్స్యకారులు చమురు సంస్థలకు మొర పెట్టుకున్నా చమురు సంస్థలు పట్టించుకోవడంలేదు. గత ఏడాది నుంచి గాడేరుమొగ ఇసుక మేటలతో పూర్తిగా మూసుకుపోవడంతో వేటాడిన మత్స్యసంపదను కాకినాడ పోర్టులో అమ్ముకుందామన్నా అక్కడ మత్య్సకారులు అడ్డుకోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అని మత్య్సకారులు అంటున్నారు. చమురు సంస్థలు గాడేరుమొగ వద్ద ఉన్న ఇసుక మేటలను తొలగించాలని మత్స్యకారులు ఆందోళనకు సిద్ధమయ్యారు. జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులకు చమురు సంస్థలు పరిహారం చెల్లించాలని గోదావరిలో ONGC పైప్ లైన్ పనులను మత్స్యకారులు అడ్డుకున్నారు.
చేపల వేట నిషేధం
ఏప్రిల్ 15 నుంచి జూన్ 22 వరకూ సముద్రంలో చేపల వేట నిషేధం అమల్లో ఉంటుంది. చేపల సంతాన ఉత్పత్తి జరిగే కాలం కాబట్టి వేట నిషేధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. సాధారణంగా చేపలు గుడ్లు పెట్టే సీజన్ కావడంతో 61 రోజుల పాటు మర, మోటారు బోట్లతో వేటకు వెళ్లకూడదని తెలిపింది. మత్స్యసంపద వృద్ధికి వేట నిషేధం చాలా అవసరం. అందుకే ప్రతి ఏడాది ప్రభుత్వం ఈ సీజన్ వేట నిషేధం అమలు చేస్తుంది. వేట నిషేధ కాలంలో మత్స్యకారులు ఉపాధి కోల్పోతారు.
మత్స్యకారులకు ఆర్థిక సాయం
విశాఖ జిల్లాతో పాటు విజయనగరం, శ్రీకాకుళం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో సముద్ర తీర ప్రాంతం ఉంది. వందల కిలోమీటర్ల పొడవునా ఉన్న సముద్ర తీరంలో దాదాపు యాభై మండలాల్లో 400 పైగా మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాల్లో మెకనైజ్డ్ బోట్స్, సంప్రదాయ తెప్పలు ఎక్కువగా ఉంటాయి. ఈ సీజన్ సముద్రంలో చేపలు గుడ్లుపెట్టి తమ సంతతిని వృద్ధి చేసుకుంటాయి కాబట్టి వేట విరామం ఇస్తారు. ఈ సమయంలో మత్స్యకారులను ఆదుకోవడానికి వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకం కింద ఒక్కో కుటుంబానికి రూ. 10 వేలు ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తుంది.