Bhogi Fire Accident : సంక్రాంతి సంబరాల్లో అపశ్రుతి, భోగిమంటలు ఎగిసిపడి ముగ్గురు విద్యార్థులకు తీవ్ర గాయాలు
Bhogi Fire Accident : కోనసీమ జిల్లాలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో సంక్రాంతి సంబరాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. భోగిమంట వేస్తున్నప్పుడు ప్రమాదం జరిగి ముగ్గురు విద్యార్థులు గాయపడ్డారు.
Bhogi Fire Accident : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లి గ్రామంలోని ప్రైవేటు స్కూల్‌లో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. భోగిమంటలు ఎగిసిపడిన ఘటనలో ముగ్గురు విద్యార్థులు గాయాలపాలయ్యారు. గాయపడిన చిన్నారులను అమలాపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువచ్చి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో పోతుల వనీషా, మధుర కీర్తి, శామ్యూల్ స్టీఫెన్ అనే ముగ్గురు విద్యార్థులకు గాయాలు అయ్యాయి. గొల్లవిల్లి గ్రామంలో ప్రైవేటు స్కూల్‌లో బుధవారం మధ్యాహ్నం నుంచి సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భోగి మంటను వేసి మంట చుట్టూ చలికాగుతోన్న క్రమంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. అయితే మంట ఆరిపోయిన క్రమంలో చిన్నారులు పెట్రోల్ తెచ్చి పోస్తుండగా ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయని ఈ కారణంతోనే సమీపంలో ఉన్న ముగ్గురు చిన్నారుల దుస్తులు అంటుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో విద్యార్థులకు గాయాలయ్యాయి. వారిని వెంటనే అమలాపురంలోని ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ప్రస్తుతం విద్యార్థులు పరిస్థితి బాగానే ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి.
విద్యార్థులను పరామర్శించిన కలెక్టర్, మంత్రి విశ్వరూప్
గొల్లవిల్లి ప్రైవేటు పాఠశాలలో భోగి మంటలు ఎగిసిపడి గాయాలపాలైన విద్యార్థులను జిల్లా కలెక్టర్ హిమన్ష్ శుక్లా, మంత్రి పినిపే విశ్వరూప్, ఎంపీ చింతా అనురాధ పరామర్శించి చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ప్రమాద కారణాలను అడిగి తెలుసుకుని దర్యాప్తునకు ఆదేశించారు. పాఠశాలల్లో సంక్రాంతి సంబరాలు నిర్వహించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆటలు, ఇతర సాంస్కృతిక సంబరాలు జరుపుకోవాలని కానీ ఇలా ప్రమాదకర పరిస్థితులు తలెత్తే విధంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించవద్దని, వీటిని విద్యాశాఖ నియంత్రణ ఉండాలని మంత్రి అధికారులకు సూచించారు. పాఠశాలల్లో సంక్రాంతి సంబరాలు నిర్వహించే క్రమంలో ఉపాధ్యాయులు పర్యవేక్షణ ఉండాలన్నారు. ప్రమాదకరమైన ఆటలు, ఇతర కార్యక్రమాలకు దూరంగా ఉండాలన్నారు.
స్కూల్ పై చర్యలు తీసుకోవాలి- పి.డి.ఎస్.యు
ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లి ప్రైవేట్ స్కూల్ లో భోగిమంట వేస్తున్న సందర్భంలో జరిగిన ప్రమాద సంఘటనపై సమగ్ర విచారణ జరిపి స్కూల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పి.డి.ఎస్.యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేవు తిరుపతిరావు డిమాండ్ చేశారు. పాఠశాలలో సంక్రాంతి సంబరాలు జరిపిన యాజమాన్యం పర్యవేక్షణ లేకుండా నిర్లక్ష్యంగా ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపించారు. భోగిమంట అంటించడానికి పెట్రోల్ తెచ్చారని అంటించిన తర్వాత పెట్రోల్ బాటిల్ ఒక రూమ్ లో పెట్టగా ఈ లోపు భోగిమంట ఆరిపోవడంతో ఆ పెట్రోల్ బాటిల్ విద్యార్థులు తీసుకువచ్చి భోగి మంట మీద వేయడంతో పెట్రోల్ విద్యార్థుల మీద పడగానే ప్రమాదం సంభవించిందన్నారు. పెట్రోలు తెచ్చిన సందర్భంలో స్కూలు యాజమాన్యం ఉపాధ్యాయులు నిర్లక్ష్యంగా ఉన్నారని అందువల్లే ఈ ప్రమాదం జరిగిందని అన్నారు. గాయాలు పాలైన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు ప్రభుత్వం అండగా ఉండాలని కోరారు.