Tadipatri Politics: జేసీ ఇంటికి వెళ్లి క్షమాపణ చెబుతానన్న కేతిరెడ్డి పెద్దారెడ్డి - ఓటమిని అంగీకరించినట్లేనా ?
Kethireddy Pedda Reddy జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెళ్లి క్షమాపణ చెబుతానని కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రకటించారు. జేసీ ప్రభాకర్ భార్య ఉమక్కను తాము తిట్టలేదన్నారు.

Kethireddy Pedda Reddy Ready to apologize: ఏపీ రాజకీయాలు మొత్తం ఒక ఎత్తు అయితే.. తాడిపత్రి రాజకీయాలు మరో ఎత్తు అన్నట్లుగా ఉంటుంది. తాడిపత్రిలో ఓడిపోయిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలో అడుగు పెట్టలేకపోతున్నారు. ఆయనను అడుగు పెట్టనిచ్చేది లేదని మున్సిపల్ చైర్మన్, ప్రస్తుత ఎమ్మెల్యే తండ్రి జేసీ ప్రభాకర్ రెడ్డి సవాల్ చేస్తున్నారు. కోర్టు అనుమతి ఉన్నా తనను వెళ్లనివ్వడం లేదని ఓ రోజు ఎవరికీ చెప్పకుండా పెద్దిరెడ్డి తాడిపత్రిలోని ఇంటికి వచ్చారు. విషయం తెలిసిన పోలీసులు ఆయనను బలవంతంగా తాడిపత్రి నుంచి బయటకు పంపేశారు.
ఇటీవల తాడిపత్రిలో వైసీపీ సమావేశం నిర్వహిస్తే.. కేతిరెడ్డి పెద్దారెడ్డి కోడలు వచ్చి మాట్లాడి వెళ్లారు. దీనిపైనా జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తన ఇంటిపై దాడి చేసి.. తమ ఇంట్లోని ఆడవాళ్లను అసభ్యంగా దూషించారని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. ఈ ఆరోపణలపై తాజాగా కేతిరెడ్డి పెద్దారెడ్డి స్పందించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి భార్య ఉమను.. ఉమక్కగా భివర్ణించారు. ఉమక్కను తాను తిట్టలేదని.. తిట్టారని ఉమక్క చెబితే తాను జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెళ్లి క్షమాపణ చెబుతానని ప్రకటించారు. తాను జెసి ఇంట్లో మహిళలను ఎప్పుడూ తిట్టలేదని వివరణ ఇచ్చారు.
అదే సమయంలో జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఆరోపణలు చేశారు. జెసి ప్రభాకర్ రెడ్డి కి న్యాయం చేయాలంటే చంద్రబాబు, లోకేష్ వల్లే జరుగుతుందన్నారు. జెసి ప్రభాకర్ రెడ్డి కి వయసు పెరిగే కొద్ది ఆలోచన శక్తి తగ్గుతోందని విమర్శించారు. ఏఎస్పీ ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తా అన్న జేసీ ఎందుకు ధర్నా చేయలేదని ప్రశ్నించారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఓ సారి .. జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లోకి చొరబడ్డారు. జేసీ ప్రభాకర్ రెడ్డి లేని సమయంలో అనుచరులతో కలిసి వచ్చిన ఆయన ఇంట్లోకి వెళ్లిపోయారు. ఇంట్లోని ఓ కుర్చీలో కాసేపు కూర్చుని వెళ్లిపోయారు. ఈ విషయం తెలిసిన వెంటనే అనంతపురంలో ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులతో కలిసి వచ్చారు. అప్పటికి కేతిరెడ్డి వెళ్లిపోవడంతో ఆయన కూర్చున్న కుర్చీని తెచ్చి తగలబెట్టేశారు.
ఆ తర్వాత కూడా ఆ ఉద్రిక్తతలు సాగుతూనే ఉన్నాయి. ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున ఘర్షణలు జరిగాయి. చివరికి ప్రభుత్వం మారడంతో పెద్దారెడ్డికి గడ్డు పరిస్థితి ఎదురయింది. ఆయన తాడిపత్రిలో అడుగు పెట్టలేకపోతున్నారు. కేతిరెడ్డి స్వగ్రామం తాడిపత్రి నియోజకవర్గంలో ఉండదు. శింగనమల నియోజకవర్గంలో ఉంటుంది. తాడిపత్రిలో ఆయన ఓ ఇల్లు కట్టుకున్నారు.కానీ అది మున్సిపల్ స్థలంలో ఉండటంతో కూల్చివేత ముప్పు పొంచి ఉంది. పెద్దారెడ్డి తాడిపత్రిలోకి అడుగు పెట్టలేకపోతూండటంతో.. పార్టీ కార్యక్రమాలు జరగడం లేదు. దీంతో వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంచార్జ్ ను మార్చాలన్న ఆలోచన చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అందుకే జేసీ ప్రభాకర్ రెడ్డికి క్షమాపణలు చెబుతానన్న సంకేతాలను కేతిరెడ్డి పంపుతున్నారని భావిస్తున్నారు.





















