Kadambari Jethwani: ఈ రాత్రి హైదరాబాద్‌కు జిత్వానీ, స్టేట్మెంట్ రికార్డు చేయనున్న ఏపీ పోలీసులు
Vijayawada Police :ముంబై హీరోయిన్ కాదంబరి జెత్వానీని ఈ రోజు రాత్రికి ముంబై నుంచి హైదరాబాద్‌కు రానున్నారు. రాత్రి 8.30 గంటలకు ముంబైలో బయలుదేరి రాత్రి 9.30 గంటలకు హైదరాబాద్ కు చేరుకుంటారు.
Kadambari Jethwani: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ముంబై హీరోయిన్ జెత్వానీపై వేధింపుల కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. తనను 45 రోజుల పాటు బంధించి బట్టల్లేకుండా ఫొటోలు తీసి పోలీసులు, వైసీపీ నేతలు హింసించారని వాపోయింది. పలువురు తనకు న్యూడ్ కాల్స్ చేశారని, ఒంటరి యువతినైనా తనను చిత్రహింసలకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేసింది. తల్లిదండ్రులను చూసుకునే బాధ్యత తనదేనని, తమకు ఎవరూ లేరని బోరున విలపించింది. ఏపీతో పాటు దేశ వ్యాప్తంగా రక్షణ కల్పించాలని, తనను వేధించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ క్రమంలో ఓ కీలక అప్ డేట్ వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్ కు జిత్వానీ
ముంబై హీరోయిన్ కాదంబరి జెత్వానీని ఈ రోజు రాత్రికి ముంబై నుంచి హైదరాబాద్‌కు రానున్నారు. రాత్రి 8.30 గంటలకు ముంబైలో బయలుదేరి రాత్రి 9.30 గంటలకు హైదరాబాద్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి ఏపీ పోలీసుల రక్షణతో ఆమెను విజయవాడకు తీసుకుని వెళ్తారు. వైసీపీ నేతల చిత్రహింసల వ్యవహారానికి సంబంధించి కాదంబరి జెత్వానీ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయాలని విజయవాడ పోలీసులు భావిస్తున్నారు. అందుకే ఆమెను రాష్ట్రానికి తీసుకొస్తున్నారు. ఈరోజు రాత్రికి హైదరాబాద్‌కు తీసుకుని వచ్చి అక్కడి నుంచి నేరుగా జెత్వానీతో మాట్లాడిన అనంతరం విజయవాడకు తరలించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. జెత్వానీ తరఫు న్యాయవాదులు, ఆమె కుటుంబ సభ్యులతో విజయవాడ నగర పోలీసు కమీషనర్ మాట్లాడుతున్నారు. దర్యాప్తు అధికారిగా ఉన్న డాక్టర్ స్రవంతి రాయ్‌తో కూడా తాజాగా జెత్వానీ ఫోన్‌లో మాట్లాడారు. కేసు వివరాలను, సాక్ష్యాలను, అప్పట్లో చేసిన చిత్ర హింసలకు సంబంధించిన వివరాలను తమకు వివరించాలని డాక్టర్ స్రవంతి రాయ్ కోరారు.
అసలు విషయం ఏంటంటే..
వైసీపీ ప్రభుత్వ హయాంలో ముంబైకి చెందిన కాదంబరి జెత్వానిపై వైసీపీ నేతలు, కొందరు ఐపీఎస్‌లు వేధింపులకు పాల్పడ్డారనే వార్త కలకలం రేపుతోంది. ముంబైకి చెందిన కాదంబరి జిత్వానీని ప్రేమ పేరుతో లొంగదీసుకున్న కృష్ణా జిల్లాకు చెందిన వైసీపీ నేత ఒకరు.. పెళ్లి చేసుకోకుండా మోసగించినట్లు సమాచారం. అనంతరం అధికార బలంతో బాధితురాలిపైనా, ఆమె తల్లిదండ్రులపైనా అక్రమ కేసు పెట్టించి జైలుకు పంపారు. ఆ తర్వాత వారిని బెదిరించి పెళ్లి మాట ఎత్తకుండా బలవంతంగా సంతకం చేపించుకుని పంపించివేశారు. ఈ కేసులో వేళ్లన్నీ ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, విజయవాడ మాజీ సీపీ కాంతిరాణా టాటా, డీసీపీ విశాల్ గున్ని వైపే చూపిస్తున్నాయి.
సీపీ రాజశేఖర్ బాబు కీలకవ్యాఖ్యలు
హీరోయిన్ జెత్వానీకి వైసీపీ టార్చర్ వ్యవహారంపై విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కాదంబరి జిత్వానీ కేసులో ఐపీఎస్ అధికారుల పాత్ర ఉందంటూ కథనాలు వస్తున్నాయని, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసు వివరాలు పరిశీలిస్తున్నామని తెలిపారు. డీజీపీ ఈ కేసు వివరాలపై ఆరా తీశారని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా స్రవంతి రాయ్ అనే అధికారిని విచారణ కోసం నియమించామన్నారు. బాధితురాలితో మాట్లాడి పూర్తి వివరాలు తీసుకుంటామన్నారు. చీటింగ్ కేసులో నటితో పాటు కుటుంబం మొత్తాన్ని ఎందుకు అరెస్టు చేశారో ఆరా తీస్తామని స్పష్టం చేశారు.. ఆ రోజు ఎవరెవరి పాత్ర ఎంతవరకు ఉందో దర్యాప్తులో తేలుతుందన్నారు. నాలుగైదు రోజుల్లో ఈ విచారణ పూర్తవుతుందని పేర్కొన్నారు. మొత్తం ఈ కేసులో అన్ని కోణాల్లో సాంకేతికతతో ఆధారాలు సేకరిస్తామన్నారు. నివేదిక రూపంలో డీజీపీకి అందచేస్తామంటూ తెలిపారు. ఐపీఎస్‌ల పాత్ర ఉన్నట్లు తేలితే డీజీపీ చర్యలు తీసుకుంటారని సీపీ రాజశేఖర్ బాబు వెల్లడించారు.