Tiger Attack Fact Check : పెద్దపులి మనుషులపై దాడి చేసిందా? వైరల్ అవుతున్న ఫొటోల్లో నిజమెంత?
Tiger Attack Fact Check : కాకినాడ జిల్లా వాసుల్ని రెండు విషయాలు భయపెడుతున్నాయి. ఒకటి పెద్ద పులి, మరొకటి ఫేక్ న్యూస్. తాజాగా పులి మనుషులపై దాడి చేసిందని ఫొటోలు వైరల్ అవుతున్నాయి. దీనిపై ఏబీపీ దేశం ఫాక్ట్ చెక్ చేసింది.
Tiger Attack Fact Check : కాకినాడ జిల్లాలో పులిపై పుకార్లు మళ్లీ షికారు కొడుతున్నాయి. అసలే పులి సంచారంతో బిక్కు బిక్కుమంటూ గడుపుతున్న ప్రజలను తాజాగా మరో పుకారు మరింత భయపెడుతోంది. పెద్ద పులి మనుషులపై దాడి చేసిందని, ఇద్దరు చనిపోయారని సోషల్ మీడియాలో ఫొటోలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ ఫొటోల్లో నిజమేంతో ఏబీపీ దేశం ఫాక్ట్ చెక్ చేసింది.
అసలేం జరిగింది?
రక్తమోడుతున్న క్షతగాత్రుల ఫొటోలు కాకినాడ జిల్లాలో సోమవారం ఉదయం నుంచి చక్కర్లు కొడుతున్నాయి. చూడ్డానికే అతి భయంకరంగా ఉన్న ఈ ఫొటోలుతో ఒక మెసేజ్ కూడా మరింత భయాన్ని సృష్టిస్తోంది. రౌతులపూడిలో కొన్ని రోజులుగా పాగా వేసిన పెద్దపులి తాజాగా మనుషులపై దాడి చేసి గాయపరిచిందని ఈ మెసేజ్ సారాంశం. దీంతో కాకినాడ జిల్లా ప్రజల్లో ఒకటే వణుకు మొదలయ్యింది. పులి సంచారిస్తున్న గ్రామాల్లో ప్రజలంతా హడలెత్తిపోతున్నారు. ఇంతకీ ఇంతవరకు పశువులపై మాత్రమే దాడిచేసిన పెద్దపులి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చేస్తున్నట్లుగా నిజంగా మనుష్యులపై దాడి చేసిందా అంటే ఏమాత్రం నిజంకాదని తేలింది. రౌతులపూడి మండలంలో లచ్చిరెడ్డిపాలెంలో రెండు రోజులుగా సంచరిస్తున్న బెంగాల్ టైగర్ పాదముద్రలను అక్కడ పొలాల్లోని అరటి తోటల్లో అటవీశాఖ అధికారులు గుర్తించారు. నిన్నంతా అక్కడ వర్షం కురవడంతో పులి ఉనికిని గుర్తించేందుకు అటవీశాఖ అధికారులకు ఇబ్బందికరంగా మారింది. అయితే లచ్చిరెడ్డిపాలెం సమీప ప్రాంతాల్లోనే పులి ఉందని అధికారులు స్థానికులను ఒంటరిగా పొలాలకు వెళ్లవద్దని హెచ్చరించారు. పశువులను జాగ్రత్త చేసుకోవాలని సూచించారు. ఈ రోజు కూడా పులి జాడ అధికారులకు తెలియరాలేదు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలు ఎక్కడివి?
పులి జాడ తెలియక నిన్నటి నుంచి తీవ్రంగా అధికారులు గాలిస్తుంటే కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ పోస్టులతో ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. ఇంతకీ ఆ ఫొటోలు ఎక్కడివంటే ఇటీవల శ్రీకాకుళం జిల్లాలో ఎలుగు బంటి దాడికి సంబంధించిన ఫొటోలు అని ఏబీపీ ఫాక్ట్ చెక్ లో తేలింది. ఇటీవల శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలంలోని పలు గ్రామాల్లో ఎలుగుబంటి సంచరించింది. ఈ ఎలుగుబంటి దాడిలో ఇద్దరు చనిపోగా, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారి ఫొటోలే ఇప్పుడు పులి దాడి ఫొటోలుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఫేక్ న్యూస్ వైరల్
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలు పులి దాడిలో గాయపడ్డవారు కాదని, ఇంతవరకు పులి పశువులపై దాడి చేసింది తప్ప మనుషులపై ఎటువంటి దాడులు చేయలేదని జిల్లా అటవీశాఖ అధికారులు వెల్లడించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోల్లో వాస్తవం లేదని, ఇలా ప్రజలను భయాందోళనలు సృష్టిస్తున్నవారిపై అవసరమైతే కేసులు పెడతామని హెచ్చరించారు. ఇలాంటి ఫేక్ న్యూస్ నమ్మొద్దని సూచించారు.