(Source: ECI/ABP News/ABP Majha)
YSRCP MLC For TDP Leader : వైఎస్ఆర్‌సీపీలో చేరిన కైకలూరు టీడీపీ ఇంచార్జ్ - వెంటనే ఎమ్మెల్సీ ఆఫర్ ఇచ్చిన సీఎం జగన్ !
వైఎస్ఆర్‌సీపీలో చేరిన కైకలూరు టీడీపీ ఇంచార్జ్ వెంకటరమణ. ఎమ్మెల్సీ సీటును సీఎం జగన్ ఖరారు చేశారు.
YSRCP MLC For TDP Leader : రాజకీయాల్లో ఏ పార్టీ తరపున పని చేస్తే ఆ పార్టీ తరపునే అవకాశాలు రావాలన్న నిబంధనేమీ లేదు. ఏ పార్టీపైన పోరాడారో ఆ పార్టీనే పిలిచి అవకాశం ఇచ్చే చాన్స్ ఉంది. ఇది రాజకీయాల్లో సహజమే. ఇలాంటి అవకాశం తాజాగా తెలుగుదేశం పార్టీ తరపున కైకలూరు నియోజకవర్గానికి ఇంచార్జ్ గా వ్యవహరిస్తున్న జయమంగళ వెంకటరమణకు లభించింది. ఆయన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్‌సీపీలో చేరారు. 2009లో కైకలూరు నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందిన వెంకట రమణ, ప్రస్తుతం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్‌గా కొనసాగుతున్నారు. బుధవారమే టీడీపీ సభ్యత్వానికి, కైకలూరు టీడీపీ ఇంచార్జ్ పదవికి రాజీనామా చేశారు.
జయమంగళ వెంకట రమణతో పాటు ము టీడీపీ రైతు విభాగం నాయకుడు సయ్యపరాజు గుర్రాజు కూడా వైఎస్ఆర్‌సీపీలో చేరారు. పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు సమక్షంలో ఈ చేరికలు జరిగాయి. జయ మంగళ వెంకటరమణకు.. సీఎం జగన్ ఎమ్మెల్సీ స్థానం ఆఫర్ ఇచ్చారు. ప్రస్తుతం పదమూడు ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదల అయింది. వీటిలో ఐదు స్థానాలు గ్రాడ్యూయేట్, టీచర్ నియోజకవర్గాలకు జరుగుతున్నాయి. వీటికి అభ్యర్థులను సీఎం జగన్ ఇటీవలే ఎమ్మెల్యేల సమావేశంలో ప్రకటించారు.
ఇంకా స్థానిక సంస్థల కోటాలో జరగాల్సిన ఎనిమిది ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది. ఈ ఎనిమిదింటిలో ఒక స్థానాన్ని జయ మంగళ వెంకటరమణకు సీఎం జగన్ కేటాయించినట్లుగా తెలుస్తోంది. స్థానిక సంస్థల కోటాలో 23న నామినేషన్ వేయనున్నట్లుగా జయమంగళ వెంకటరమణ అనుచరులు చెబుతున్నారు. అయితే ఇంత కాలం టీడీపీ కోసం పని చేసి ఇప్పుడు వైసీపీలో చేరగానే ఆయనకు ఎమ్మెల్సీ అవకాశం కల్పిస్తున్నారని.. మరి పార్టీ కోసం పని చేసిన వారికి ఎందుకు ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న అసంతృప్తి ఆ పార్టీలో కనిపించే అవకాశం ఉంది. దీన్ని సర్దుబాుట చేసేందుకు వైఎస్ఆర్‌సీపీ సీనియర్ నేతలు .. ఆశావహులతో చర్చలు జరుపుతున్నారు.
గత ఎన్నికలకు ముందు సీఎం జగన్ పలువురు పార్టీ నేతలకు ఎమ్మెల్సీ ఆఫర్లు ఇచ్చారు. టిక్కెట్లు ఇవ్వలేకపోయిన వారికి.. అలాగే ఎన్నికల సమయంలో పార్టీలో చేరిన వారికి ఈ ఆఫర్లు ఇచ్చారు. ఎస్వీ మోహన్ రెడ్డి, మర్రి రాజశేఖర్, బుట్టా రేణుక సహా ఇలాంటి నేతలు చాలా మంది తమకు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఎన్ని సార్లు ఎమ్మెల్సీ స్థానాలుకు భర్తీ చేసే అవకాశం వచ్చినా.. ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లకు అవకాశం కల్పిస్తూండటంతో వీరికి నిరాశ తప్పడం లేదు.