Justice NV Ramana: నీతిమంతులు లేకపోతే, నీతిలేని వారే రాజ్యమేలుతారు - పార్టీలపై ఎన్వీ రమణ సంచలనం
రాజకీయ పార్టీల నిర్వహణను ప్రైవేటు సంస్థలకు అప్పగించడాన్ని కూడా ఎన్వీ రమణ తప్పుబట్టారు.
సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ప్రస్తుత రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ప్రమాణాలు బాగా పడిపోతున్నాయని అసహనం వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో జరిగిన 23వ తానా మహాసభల్లో జస్టిస్ ఎన్వీ రమణ పాల్గొని ప్రసంగించారు. రాజకీయాల్లో వికృతాలు ఉంటున్నాయని, సోషల్ మీడియాలో మహిళలను అసభ్యకరంగా చిత్రీకరిస్తున్నారని ఎన్వీ రమణ అన్నారు. రాజకీయ పార్టీల నిర్వహణను ప్రైవేటు సంస్థలకు అప్పగించడాన్ని కూడా ఎన్వీ రమణ తప్పుబట్టారు. ప్రజలతో సంబంధం లేకుండా ఉన్నవారు పార్టీలను ఎలా నడుపుతారంటూ ఎన్వీ రమణ ప్రశ్నించారు. అన్ని అభూత కల్పనలతో అభాసుపాలు చేస్తున్నారని ఎన్వీ రమణ చెప్పారు.
ఎన్నికల్లో దుష్ప్రచారమే రాజకీయ పార్టీలకు వ్యూహంగా మారిందని రమణ అన్నారు. అసలు మేనిఫెస్టోల గురించి పార్టీ నాయకులు మాట్లాడే అవకాశమే లేకుండా పోతోందని అన్నారు. సోషల్ మీడియాను విచ్చలవిడిగా వాడుకుంటూ ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారని అన్నారు. ప్రలోభాలు పెట్టుకుంటూ వివిధ అంశాలకు ప్రాధాన్యం పెంచి ప్రజల నుంచి ఓట్లు దండుకుంటున్నారని అన్నారు. రాజకీయాల్లోకి నీతి మంతులు రాకపోతే, నీతి లేని వారే రాజ్యమేలుతారని అభిప్రాయపడ్డారు. వారు చేయడం వల్ల కలిగే నష్టం పూడ్చడానికి అనేక దశాబ్దాలు పడుతుందని అన్నారు. విద్యార్థులను రాజకీయాలకు దూరం చేయడం వల్లే అథోగతి పాలవుతున్నామని, కాలేజీ స్థాయి నుంచే విద్యార్థులను రాజకీయాల్లోకి వచ్చేలా ప్రోత్సహించాలని సూచించారు.
ఇతర అంశాలపైన కూడా ఎన్వీ రమణ మాట్లాడారు. మానసిక స్థిమితం లేని వారే జాత్యాహంకారపు, కుల అహంకారపు ఆలోచనలు చేస్తారని అన్నారు. చెడును వారే వ్యాప్తిలోకి తెస్తారని మాట్లాడారు. సైకోలే విచ్ఛిన్నాన్ని, విధ్వంసాన్ని కోరుకుంటారని, కాలచక్రాన్ని వెనక్కి తిప్పాలనుకుంటారని ఆక్షేపించారు. వారికి నేను.. నా కుటుంబం అనే ధోరణి ఉంటుందని, కానీ చేసేదంతా సమాజం కోసమే అని నమ్మబలుకుతారని మాట్లాడారు. ప్రజలు కూడా పెద్ద చదువులు చదువుకోని, జీవితానుభవం కలిగి ఉన్నవారు కూడా ఇలాంటి ప్రచారాన్ని నమ్మి నాశనానికి ఊతం ఇస్తే భవిష్యత్తు తరాలు మనల్ని క్షమించబోవని జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇచ్చేదాకా పోరాడాలని అన్నారు. అప్పటి వరకూ తెలుగువారు విశ్రమించొద్దని పిలుపు ఇచ్చారు.