Chandrababu : అంగళ్లు కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో తీర్పు రిజర్వ్ !
అంగళ్లు ఘర్షణ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో తీర్పు రిజర్వ్ అయింది.
Chandrababu : చంద్రబాబునాయుడు చిత్తూరు జిల్లా పర్యటన సందర్భంగా అంగళ్లులో జరిగిన ఘర్షణల్లో చంద్రబాబుపై హత్యాయత్నం కేసు నమోదయింది. ఈ కేసులో బెయిల్ కోసం చంద్రబాబు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ పూర్తయింది. తర్పును రిజర్వ్ చేశారు. అంగళ్ల కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్ కోసం పిటీషన్ దరఖాస్తు చేసుకున్నారు. రెండు వారాలుగా వాయిదా పడుతూ వస్తున్న కేసులో ఎట్టకేలకు వాదనలు పూర్తయ్యాయి.
చిత్తూరు జిల్లా అంగళ్లులో చంద్రబాబు పర్యటన సందర్భంగా పెద్దయెత్తున ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘర్షణలో పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై చంద్రబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే అనేక మంది టీడీపీ నేతలు అరెస్ట్ అయి జైలుకు వెళ్లారు. పుంగనూరు నియోజకవర్గంలోని అంగళ్లు కేసులో 79 మంది టిడిపి నేతలకు ఎపి హైకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. టిడిపి ఎంఎల్‌సి రామ్ గోపాల్ రెడ్డిని తదుపరి విచారణ వరకు అరెస్ట్ చేయవద్దని ఆదేశించింది. బెయిల్ వచ్చిన వారు ప్రతి మంగళవారం నాడు పోలీస్ స్టేషన్‌కు హాజరు కావాలని ఆదేశించింది. ఇదే కేసుల్లో మరో 30 మంది టిడిపి నేతలు ముందస్తు బెయిల్ కోసం ఎపి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే తదుపరి ఆదేశాలు వచ్చే వరకు వీరిని అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. పుంగనూరు అంగళ్లు కేసులో అరెస్టైన టిడిపి నేతలు, కార్యకర్తలను చిత్తూరు, మదనపల్లె, కడప జైలులో ఉన్నారు. హైకోర్టు వీరికి బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుండి వీరంతా విడుదల అయ్యారు.
ఆగస్టులో సాగునీటి ప్రాజెక్టులను ప్రభుత్వంనిర్లక్ష్యం చేసిందని ప్రాజెక్టుల టూర్‌కు చంద్రబాబు వెళ్లారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన సందర్భంగా అంగళ్లు, పుంగనూరులో అల్లర్లు జరిగాయి. టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. తంబళ్లపల్లి నియోజకవర్గంలోని అంగళ్లులో జరిగిన అల్లర్లకు సంబంధించి చంద్రబాబుపై ముదివేడు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఏ1గా చంద్రబాబు, ఏ2గా దేవినేని ఉమాలను చేర్చారు. టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టారంటూ వీరిపై కేసులు పెట్టారు. ఐపీసీ 120 బీ, 147, 148, 153, 307, 115, 109, 323, 324, 506 ఆర్/డబ్ల్యూ, 149 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వైసీపీ వాళ్లు అల్లర్లు చేస్తే చంద్రబాబుపై కేసులు పెట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నాయి. కాగా, పుంగనూరులో ఇప్పటి వరకు 74 మంది టీడీపీ నేతలు, కార్యకర్తలను అరెస్ట్ చేశారు. అమర్ నాథ్ రెడ్డి, నల్లారి కిశోర్ కుమార్ రెడ్డిలతో పాటు మరి కొందరిపై కేసులు నమోదు చేశారు.
వీరిలో దేవినేని ఉమ సహా పలువురికి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఇలా మంజూరు చేసిన తీర్పును సవాల్ చేస్తూ.. ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆ పిటిషన్ పై విచారణ జరగాల్సి ఉంది.