Jagan Bail CBI Court : "తీర్పు" సెప్టెంబర్ 15కి వాయిదా !
జగన్, విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలన్న రఘురమకృష్ణరాజు పిటిషన్లపై తీర్పును సీబీఐ కోర్టు న్యాయమూర్తి సెప్టెంబర్ 15న ప్రకటించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ షరుతులు ఉల్లంఘిస్తున్నారని.. వారి బెయిళ్లను రద్దు చేయాలని ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ సెప్టెంబర్ 15వ తేదీకి వాయిదా పడింది. అదే రోజు తీర్పును వెల్లడిస్తామని సీబీఐ కోర్టు న్యాయమూర్తి తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై గతంలోనే వాదనలు పూర్తయ్యాయి. తీర్పు రిజర్వ్ చేశారు. ఆగస్టు 25న తీర్పు వెల్లడిస్తామని గతంలో సీబీఐ కోర్టు తెలిపింది. అందుకే ఈ రోజు ఎక్కువ మంది ఎలాంటి తీర్పు వస్తుందోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సీబీఐ కోర్టు ప్రారంభమైన తర్వాత ముదంుగా విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ జరిగింది. విచారణ రెండు రోజుల కిందటే జరగాల్సి ఉన్నా.. ఈ రోజుకి వాయిదా పడింది. ఇరు వైపుల న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. వాదన తర్వాత సీబీఐ కోర్టు వచ్చే నెల 15వ తేదీకి వాయిదా వేసింది. ఆ రోజున ఇద్దరి బెయిల్ రద్దు పిటిషన్లపై తీర్పు వెల్లడిస్తామని తెలిపింది.
జగన్, విజయసాయి ఇద్దరూ బెయిల్ షరతులు ఉల్లంఘిస్తున్నారని వేర్వేరుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్లు దాఖలు చేశారు. సీఎం జగన్ బెయిల్ షరతులు ఉల్లంఘిస్తున్నారని సాక్షులకు సహ నిందితులకు అధికారం ఉపయోగించి లబ్ది చేకూరుస్తున్నారని.. పదవులు ఇస్తున్నారని రఘురామకృష్ణరాజు బెయిల్ రద్దు పిటిషన్‌లో పేర్కొన్నారు. తమ పార్టీ పరువు పోకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే బాధ్యాతాయుత ఎంపీగా.. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన ఎంపీగా తాను పిటిషన్ వేస్తున్నట్లుగా రఘురామకృష్ణరాజు చెప్పారు. సాక్షులను ప్రభావితం చేయకూడదనేది మొట్టమొదటగా ఎవరికైనా బెయిల్ ఇచ్చేటప్పుడు కోర్టులు పెట్టే షరతు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కూడా అదే షరతు ప్రధానంగా ఉంది. కానీ ఆయన తన కేసుల్లో సాక్షులుగా ఉన్న వారందరికీ ఏదో విధంగా ప్రయోజనం కల్పిస్తూనే ఉన్నారని రఘురామకృష్ణరాజు పిటిషన్‌లో పేర్కొన్నారు. సహనిందితులుగా ఉన్న వారికి పదవులు ఇతర ప్రయోజనాలు కల్పించారన్నారు. అలాగే రఘురామకృష్ణరాజు తాను వేసిన పిటిషన్‌లో ఇతర కీలకమైన అంశాలను కూడా వివరించారు. ముఖ్యమంత్రి హోదాలో ఆయన వివిధ కారణాలు చెబుతూ కోర్టుకు హాజరు కాకుండా డుమ్మా కొడుతున్నారని విచారణ ప్రక్రియకు ఆటంకం కలిగిస్తున్నారని వాదించారు. అధికారాన్ని ఉపయోగించి అందరి నోళ్లు నొక్కేలా వ్యవహరిస్తున్నారని తప్పుడు కేసులు పెడుతున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆయన పిటిషన్ వేసిన తర్వాత రఘురామకృష్ణరాజుపై ప్రభుత్వం రాజద్రోహం కేసులు పెట్టి అరెస్ట్ చేసింది. ఈ విషయాన్ని కూడా సీబీఐ కోర్టు దృష్టికి ఆయన తరపు న్యాయవాదులు తీసుకెళ్లారు.
జగన్ బెయిల్ రద్దు పిటిషన్ వాదనలు పూర్తయిన తర్వాత విజయిసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ రఘురామకృష్ణరాజు పిటిషన్ వేశారు. ఎంపీగా కేంద్ర హోం, ఆర్థిక మంత్రిత్వశాఖ కార్యాలయాల్లో అధికారులను తరచుగా విజయసాయిరెడ్డి కలుస్తున్నారని.. తనకు కేంద్ర మంత్రులతో సన్నిహిత సంబంధాలున్నాయని సాక్షుల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా భయం కలిగిస్తున్నారని పిటిషన్‌లో రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. గతంలో సీబీఐ డైరక్టర్‌గా ఫలానా అధికారిని నియమిస్తున్నారని.. అయనను నియమించవద్దని కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు ఎంపీ హోదాలో విజయసాయి లేఖ రాశారని ఇది దర్యాప్తును ప్రభావితం చేయడమేనన్నారు. విజయనగరం మాన్సాస్ ట్రస్ట్‌కు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఇచ్చిన నాలుగు జీవోలు చట్టవిరుద్ధమని హైకోర్టు కొట్టివేసిన సందర్భంలో అశోక్‌గజపతిరాజు దొడ్డిదారిన కోర్టు ఉత్తర్వులు తెచ్చుకున్నారని ఆరోపించారని.. న్యాయస్థానాలకు ఉద్దేశాలు ఆపాదించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
అటు సీఎం జగన్, ఇటు విజయసాయిరెడ్డి కూడా రఘురామకృష్ణరాజు వ్యక్తిగత స్వార్థం కోసం ప్రచారం కోసం పిటిషన్లు వేశారని న్యాయస్థానంలో వాదించారు. ఆయనపై పలు కేసులు ఉన్నాయన్నారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును వచ్చే నెల 15వ తేదీన ప్రకటించనుంది.