Jogi Ramesh : నన్ను 2,3 నెలలు జైల్లో పెడతారు - మాజీ మంత్రి జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు
YSRCP : మాజీ మంత్రి జోగి రమేష్‌కు అరెస్టు భయం వెంటాడుతోంది. తనను అరెస్టు చేసి రెండు, మూడు నెలల పాటు జైల్లో పెడతారని ఆయన అంటున్నారు.
Jogi Ramesh accused putting him in jail for two to three months : కృష్ణా జిల్లా వైఎస్ఆర్‌సీపీ కీలక నేత జోగి రమేష్ తనను రెండు, మూడు నెలల పాటు జైల్లో పెడతారని కీలక వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. అగ్రిగోల్డ్ స్థలాలను అమ్ముకున్నామని తప్పుడు కేసులు పెట్టే ఆలోచనలో ఉన్నారని ఆరోపించారు. ఇప్పటికే సీఐడీ సీజ్ చేసిన అగ్రిగోల్డ్ భూములు కొని అమ్మినట్లు జోగి రమేష్‌పై ఆరోపణలు ఉన్నాయి. మొత్తం లావాదేవీలపై రంగంలోకి దిగారు సీఐడీ అధికారులు. క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక సిద్ధం చేసిన సీఐడీ అధికారులు... నివేదికను ఏపీ డీజీపీకి అందించారు. డీజీపీ ఆదేశాల కోసం పోలీసులు ఎదురు చూస్తున్నారు.
సీఐడీ సీజ్ చేసిన భూమిని అమ్మలేరన్న జోగి రమేష్
అయితే తనపై వస్తున్న ఆరోపణలు అన్నీ అవాస్తవమని సీఐడీ సీజ్ చేసిన అగ్రిగోల్డ్ భూములు ఎలా అమ్ముతారని జోగి రమేష్ ప్రశ్నించారు. సీజ్ చేసిన భూమి నెంబర్ పై అమ్మకాలు జరగవన్నారు. లోకేష్ రెడ్ బుక్ అంటూ ఎలా అయినా కేసులు పెట్టి అరెస్ట్ చేయాలనీ చూస్తున్నారని మహా అయితే అరెస్ట్ చేసి 2,3 నెలలు జైల్లో పెడతారు అంతే కదా అంటూ మాజీ మంత్రి జోగి రమేష్ వ్యాఖ్యానించారు. ఈ భూ వివాదంపై ఇప్పటికే సీఐడీ అధికారులు లోతుగా వివరాలు సేకరిస్తున్నారు. అగ్రిగోల్డ్ భూమిని జోగి రమేష్ కుటుంబసభ్యులకు.. ఆ తర్వాత వారు అమ్మిన వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేసిన సబ్ రిజిస్ట్రార్ పైనా కేసులు నమోదు చేసే అవకాశం ఈ వ్యవహారంలో మొత్తం డాక్యుమెంట్లను సీఐడీ అధికారులు వెలికి తీశారు. కేసులు నమోదు చేయడమే మిగిలి ఉందని చెబుతున్నారు.
చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నం
మరో వైపు ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్లిన ఘటనపైనా ఆయనపై కేసు నమోదు అయింది. 2021 సెప్టెంబర్‌లో జోగి రమేష్ ఆధ్వర్యంలో వైసీపీ నేతలు చంద్రబాబు ఇంటిపై దాడి చేశారు. కోడెల శివప్రసాద్ వర్ధంతి నాడు అయ్యన్న పాత్రుడు జగన్మోహన్ రెడ్డిని కించ పరిచారని ఆయనతో చంద్రబాబే వ్యాఖ్యలు చేశారని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ జోగి రమేష్ అనుచరులతో చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్లారు. ఆ సమయంలో టీడీపీ నేతలు కూడా రావడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అక్కడకు వచ్చిన బుద్దా వెంకన్న కు స్వల్ప గాయాలయ్యాయి.
మహా అయితే రెండు, మూడు నెలలు జైల్లో పెడతారన్న జోగి రమేష్
అప్పట్లో జోగి రమేష్ అధికార పార్టీ నేత కావడంతో పోలీసులు కేసులు నమోదు చేయలేదు. ఇప్పుడు పార్టీ మారడంతో ఈ కేసులో కొత్తగా పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ కేసులో ఆయన పేరు ఉండటంతో ముందస్తు బెయిల్ కోసం జోగి రమేష్ హైకోర్టును ఆశ్రయించారు. అరెస్టు చేసే అవకాశం ఉందన్న ఉద్దేశంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై ఇంకా విచారణ జరగాల్సి ఉంది.