(Source: ECI/ABP News/ABP Majha)
Nadendla Manohar: పశువుల కొనుగోలు పేరిట రూ.2 వేల కోట్లకు పైగా భారీ స్కామ్? - ప్రభుత్వంపై నాదెండ్ల సంచలన ఆరోపణలు
Nadendla Manohar: ఏపీలో పశువుల కొనుగోలు పేరిట రూ.2 వేల కోట్లకు పైగా భారీ స్కామ్ జరిగిందని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. సీఎం జగన్ దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో పశువుల కొనుగోలు పేరిట భారీ స్కామ్ జరిగిందని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సంచలన ఆరోపణలు చేశారు. పాలవెల్లువ పథకం పాపాల వెల్లువలా మారిందని విమర్శించారు. గుంటూరు జిల్లా తెనాలి జనసేన కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. లక్షల సంఖ్యలో గేదెలు కొనుగోలు చేసినట్లు లెక్కల్లో చూపారని, కానీ, క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే 8 వేల పశువులే ఉన్నాయని తెలిపారు. పశువుల కొనుగోలులోనే రూ.2 వేల కోట్లకు పైగా భారీ కుంభకోణం జరిగిందని మండిపడ్డారు. బీహార్ లో పశు దాణా కుంభకోణం జరిగినట్లు ఏపీలోనూ అలాంటి స్కామ్ జరిగిందని, దీనిపై సీఎం జగన్, మంత్రులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
రూ.2,887 కోట్ల అవినీతి
'వైసీపీ ప్రభుత్వం క్షేత్ర స్థాయిలో విరుద్ధంగా వ్యవహరిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో స్వయం సహాయక సంఘాల్లో ఉన్న మహిళల ద్వారా మినీ డెయిరీలు ఏర్పాటు చేయించి పాల ఉత్పత్తిని పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు 5.65 లక్షల మందికి మహిళలను గుర్తించారు. 4,90,374 పాడి పశువులను చేయూత పథకంలో భాగంగా కొనుగోలు చేసేందుకు అనుమతిస్తూ, నవంబర్ 25, 2020లో కేబినెట్ తీర్మానించింది. తద్వారా 20 లక్షల లీటర్ల పాలు సేకరించాలని నిర్ణయించింది. అయితే, సెప్టెంబర్ 25, 2023లో శాసన సభలో స్వల్పకాలిక చర్చలో 2,08,790 పాడి పశువులు కొనుగోలు చేశామని మహిళా సంక్షేమ శాఖ మంత్రి చెప్పారు. ఆ మరుసటి రోజే పాల వెల్లువ పథకం కింద 3.94 లక్షల పశువులు కొనుగోలు చేశామన్నారు. ఒక్క రోజులోనే 1,85,210 పాడి పశువులు ఎలా పెరిగాయో సీఎంగానీ, సంబంధిత మంత్రులు సమాధానం చెప్పాలి.' అని జనసేన ఓ ప్రకటన విడుదల చేసింది.
సమగ్ర విచారణకు డిమాండ్
అధికారుల పరిశీలనలో క్షేత్ర స్థాయిలో 8 వేల పశువులే ఉన్నాయని, ఓ గేదెను కొనుగోలు చేసి ఆ గేదెనే అనేక మంది కోసం కొనుగోలు చేసినట్లు లెక్కల్లో చూపించారని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. పశువులు కొనడానికి రూ.32 కోట్లు కేటాయించినట్లు ఆ శాఖ మంత్రి అసెంబ్లీలోనే చెప్పారని గుర్తు చేశారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం మన రాష్ట్రంలో ఓ పాడి పశువు కొనుగోలుకు రూ.75 వేలు ఖర్చవుతుందని, అదే ఇతర రాష్ట్రాల్లో ప్రయాణ ఖర్చులు కలిపి రూ.83 వేలు అవుతుందని అంచనా ఉన్నట్లు చెప్పారు. అయితే, 2.08 లక్షల పశువులు కొనుగోలు చేశామని ఒక మంత్రి, 3.94 లక్షల పశువులు కొనుగోలు చేశామని మరో మంత్రి చెప్పారని, వీటికి రూ.వేల కోట్లు వెచ్చించారని ఆరోపించారు. 3.86 లక్షల పశువులు కొనుగోలు చేసినట్లు చూపించి ఆ నిధులను దోచేశారని, దాదాపు రూ.2,887 కోట్ల అవినీతి జరిగిందని, దీనిపై సమగ్ర విచారణ జరగాలని నాదెండ్ల డిమాండ్ చేశారు.
బీహార్ స్కామ్ కంటే పెద్దది
ఈ స్కామ్ బీహార్ లో దాణా కుంభకోణం కంటే పెద్దదని, మంత్రులు చెప్పిన లక్షల పాడి పశువులు నిజంగా ఇచ్చి ఉంటే మహిళలు ఆర్థికంగా బాగుండే వారని నాదెండ్ల అభిప్రాయపడ్డారు. పాడి పశువుల స్కాంలో సొమ్ము ఎక్కడికి వెళ్లిందో సీఎం విచారణ చేయించాలని, తప్పును సరిదిద్ది రూ.వేల కోట్ల ప్రజా ధనాన్ని వెనక్కి తీసుకు రావాలని డిమాండ్ చేశారు.
Also Read: వైసీపీ పాలనపై ఎంపీ రఘురామ పిటిషన్ - అవినీతిపై విచారణ కోరుతూ హైకోర్టులో వ్యాజ్యం