Janasena corporator Murthy Yadav : సీఎస్ జవహర్ రెడ్డి బినామీలు వీరే - జనసేన కార్పొరేటర్ మరో సంచలన ప్రకటన
Andhra News : సీఎస్ జవహర్ రెడ్డి బినామీలని కొందర పేర్లను జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ప్రకటించారు. అసైన్డ్ భూములు క్రమబద్దీకరించుకునే జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
CS Jawahar Reddy : రాష్ర్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఉత్తరాంధ్రా జిల్లాలలో 596 జీ వో ను సాకుగా చేసుకొని బినామీల ద్వారా వందల ఎకరాల భూములను కొట్టేశారనే ఆరోపణలను రుజువు చేసేందుకు సిద్ధమని జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ప్రకటించారు.
సీఎస్ ఇచ్చే లీగల్ నోటీసులకు భయపడేదే లేదని జనసేన స్పష్టం చేశారు. గురువారం విశాఖలో విలేకరులతో మాట్లాడారు. అన్నవరం సమీపంలోని ఏ 1 హోటల్ అధినేత చోడ్రాజు సత్య కృష్ణంరాజు , విశాఖ కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి పేరిచర్ల శ్రీనివాసరాజు లు జవహర్ రెడ్డికి బినామీలుగా వ్యవహరించారని అన్నారు. సూర్రెడ్డి త్రిలోక్ జవహర్ రెడ్డి వ్యవహరాలకు బ్రోకర్ అని మూర్తి యాదవ్ ప్రకటించారు.
వందల కోట్ల లావాదేవీలు, వందల ఎకరాల వ్యవహారాలు చోడ్రాజు సత్య కృష్ణంరాజతో జవహర్ రెడ్డి చేయడం వల్లే గత నెల 17 వ తేదీన మరణిస్తే జవహర్ రెడ్డి ఆఘమేఘాల మీద అన్నవరం వచ్చారని చెప్పారు. జవహర్ రెడ్డి చనిపోయిన రోజు కుటుంబం మీద ఎటువంటి సానుభూతి చూపకపోగా, లావాదేవీలకు సంబంధించిన సెటిల్ మెంట్ల కోసం తీవ్ర వత్తిడి తీసుకువస్తున్నారని ఆరోపించారు.జవహర్ రెడ్డి వేధింపుల నుంచి రాజు కుటుంబానికి రక్షణ కల్పించాల్సలిన అవసరం ఉందని మూర్తి యాదవ్ స్పష్టం చేసారు.
విశాఖ లోని చారిత్రాత్మక ఎర్రమట్టిదిబ్బల ప్రాంతానికి డీ పట్టాలు ఇచ్చి వాటిని కాజేసిన వ్యక్తి కూడా జవహర్ రెడ్డేనన్నారు. విశాఖలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే పేరిచర్ల శ్రీనివాసర రాజు ద్వారా ఎర్రమట్టిదిబ్బలు ఉన్న నిడిగట్టు, నేరెళ్లవలస లలో వంద ఎకరాల డీ పట్టాలను అమాయక దళితులనుంచి బలవంతంగా అగ్రిమెంట్లు చేయించుకొన్నారని చెప్పారు. విశాఖ ఆంధ్రా విశ్వవిద్యాలయంలో పనిచేసిన మంత్రి మేరుగు నాగర్జున కు ఇందులో కొన్ని భూములకు అగ్రిమెంట్లు వుండడంతో రెండు పార్టీలు దళితుల పొట్టగొట్టి సెటిల్ చేసుకొన్నారని ఆరోపించారు. ఈ భూముల విలువే వందల కోట్ల రూపాయలని చెప్పారు.
కాపులుప్పాడ సర్వే నెంబర్.16, 39 ల్లోని 45 ఎకరాల్లో కృష్ణంరాజు, శ్రీనివాసరాజు లు వేసిన లే ఔట్, కొమ్మాది చైతన్య కళాశాల సమీపంలో రెండు ఎకరాల భూమి, ఎండాడలో పది వేల గజాల భూమిని జవహర్ రెడ్డి తన బినామీలతో కొనిపించారన్నారు. భోగాపురం విమానాశ్రయం చుట్టూ,ఆనందపురం, భీమలి,పద్మనాభం,పూసపాటిరేగ మాడలాలలో వందల ఎకరాలు డీ పట్టా భూములను జవహర్ రెడ్డి కొట్టేశారని స్పష్టం చేశారు. దమ్ముంటే ఈ సీ లు , సర్టిఫైడ్ కాపీల సైట్ తెరవాలని సవాల్ చేశారు. జవహర్ రెడ్డి వేల కోట్ల భూ దందా బయటపెట్టగానే రాష్ర్ట స్టాంపులు , రిజిస్ర్టేషన్ల శాఖ డాక్యుమెంట్లు అందుబాటులో వుండే ‘ఐ జీ ఆర్ ఎస్ ’ సైట్ ను మూసేసిందని ఆరోపించారు.
లీగల్ గా ఫైట్ చేస్తానని పదే పదే ప్రకటనలు చేసే జవహర్ రెడ్డి నిజాయితీ పరుడే అయితే, దమ్మూ ధైర్యం వుంటే రాష్ర్ట పరిపాలనా విభాగం అధిపతి హోదాలో ముందు ఈసీ , సర్టిఫైడ్ కాపీలు కనిపించే వెబ్సైట్ ను ఓపెన్ చేయించాలని మూర్తి యాదవ్ సవాల్ విసిరారు. జవహర్ రెడ్డి తన భాగోతం బటయపడకుండా వుండేందుకు భయంతో ఈ సైట్ ను మూసేయించారని ఆరోపించారు
రాజ్యంగ స్పూర్తికి , 1977 చట్టానికి విరుద్ధంగా దళితుల చేతుల్లోని భూములను డబ్బు ఉన్న వారికి బదలాయించే జీ వో 596 ను వెంటనే రద్దు చేయాలని మూర్తి యాదవ్ డిమాండు చేశారు. దళితుల సంక్షేమం ద్రుష్ట్యా ఈ జీ వో క్రింద జరిగిన లావాదేవీలను అబయన్స్ లో పెట్టాని కోరారు. అసులు దళితులు, బీసీల జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు ప్రభుత్వం కేటాయించిన భూమిని వ్యవసాయ అవసరాలకే వాడాలని, అందుకు విరుద్ధంగా జవహర్ రెడ్డి నేతృత్వంలోని అధికారులు రియల్ ఎస్టేట్ కు భూములు బదిలీ అవుతుంటే చూస్తూ ఎలా ఉన్నారని ప్రశ్నించారు. వెంటనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి జవహర్ రెడ్డిని తప్పలించాలని ,ఎన్నికల సంఘం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని అన్నారు.