YCP Attack: దాడులకు భయపడేది లేదు ...నేనే స్వయంగా రోడ్లపైకి వస్తా.. జనసేన అధినేత పవన్ కల్యాణ్
కార్యకర్తలపై దాడులు చేస్తే తానే స్వయంగా రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఆమదాలవలసలో జనసేన కార్యకర్తలపై జరిగిన దాడిని ఆయన ఖండించారు. వారితో ఫోన్ లో మాట్లాడారు.
వైసీపీ ప్రభుతంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో రహదారుల పరిస్థితులపై జనసేన పోరాటం చేస్తుంది. ట్విట్టర్ లో #JSPForAP_Roads యాష్ టాగ్ తో రోడ్ల గుంతల ఫొటోలు పెట్టి జనసేన కార్యకర్తలు నిరసన తెలిపారు. రాష్ట్రంలోని రహదారుల అధ్వాన పరిస్థితిపై నిరసన తెలుపుతున్న జనసేన కార్యకర్తలు, నేతలు, మహిళలపై దాడులు చేయడం హేయమైన చర్యని పవన్ కల్యాణ్ అన్నారు. పోలీసుల సమక్షంలో వైసీపీ నేతలు దాడులకు తెగబడుతుంటే ఆవేదన కలిగిస్తుందన్నారు. అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గంలో రోడ్ల దుస్థితిపై జనసేన పార్టీ నాయకుడు పేడాడ రామ్మోహనరావు ప్లెక్సీ ఏర్పాటుచేశారు.
రోడ్ల అధ్వాన్న స్థితిని తెలియచేస్తే దాడులు చేస్తారా? - JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/hw1RPHD6yU
— JanaSena Party (@JanaSenaParty) September 5, 2021
వైసీపీ నేతల దాడి
ఈ ఫ్లెక్సీపై తమ్మినేని సీతారాం ఫొటో ఉండడంపై పోలీసుల సమక్షంలో దాదాపు 25 మందికి పైగా అధికార పార్టీకి చెందిన వ్యక్తులు దాడికి తెగబడ్డారని పవన్ విమర్శించారు. ఈ దాడిలో రామ్మోహన్‌రావుతోపాటు ఏడుగురు జనసేన కార్యకర్తలు గాయపడ్డారని వెల్లడించారు. దాడి చేసిన వారిపై కేసులు పెట్టకుండా, ప్రజాసమస్యలపై నిరసన తెలిపిన తమ నాయకులు, కార్యకర్తలపై కేసులు పెట్టారని పవన్ ఆరోపించారు. గాయాలపాలైన వారిని కనీసం ఆసుపత్రికి కూడా తీసుకెళ్లడానికి పోలీసులు నిరాకరించారన్నారు. పోలీసుల తీరుకు నిరసనగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి జిల్లా ఎస్పీ కార్యాలయం ముందు నిరసన తెలిపారని, దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేసేలా చేశారన్నారు.
ఫోన్ లో పరామర్శ
ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలపై దాడి చేస్తే సమస్య ఇంకా పెద్దది అవుతుంది తప్ప పరిష్కారం కాదని పవన్ అన్నారు. తమ కార్యకర్తలపై దాడి జరిగితే తానే స్వయంగా రోడ్ల పైకి వస్తానని హెచ్చరించారు. ఆ పరిస్థితి తీసుకురావొద్దని పోలీసు ఉన్నతాధికారులను అభ్యర్థిస్తున్నానని అన్నారు. ఏకపక్షంగా అధికార పార్టీ నేతల మాటలు విని, జనసేన కార్యకర్తలను వేధిస్తే పోలీసులు వారి వృత్తికి ద్రోహం చేసినవాళ్లవుతారన్నారని చెప్పారు. పోలీసుల సాయంతో కేసులుపెట్టి, దాడులు చేస్తే భయపడే వ్యక్తుల కాదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. వైసీపీ నేతల దాడిలో గాయపడిన జనసేన నేతలను పవన్ కల్యాణ్ ఫోన్ చేసి పరామర్శించారు. పార్టీ ప్రధాన కార్యదర్శులు పాలవలస యశస్వీ, టి.శివశంకర్‌తో మాట్లాడారు.
Also Read: Pawan Kalyan: కిన్నెర కళాకారుడు మెుగులయ్యకు ఆర్థిక సాయం అందజేసిన పవన్.. ఫొటోలు చూశారా?