Pawan Kalyan: ఫ్యాన్స్ ముసుగులో అరాచకాలు, నన్ను బ్లేడ్లతో కట్ చేస్తున్నారు- పవన్ కళ్యాణ్ ఆరోపణలు
AP Elections 2024: కొందరు బ్లేడ్ బ్యాచ్ గాళ్లు ఫ్యాన్స్ ముసుగులో వచ్చి తనను, సెక్యూరిటీ వాళ్లను బ్లేడ్లతో కట్ చేస్తున్నారని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆరోపించారు.
పిఠాపురం: తన అభిమానులు, జనసేన ఫ్యాన్స్ ముసుగులో దుర్మార్గాలు జరుగుతున్నాయని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను రోజూ వందల మంది కలుస్తున్నారని, అందులో కొందరు తనను, సెక్యూరిటీ వాళ్లను బ్లేడ్లతో కట్ చేస్తున్నారని పవన్ కళ్యాణ్ సంచలన ఆరోపణలు చేశారు. తనను కలవడానికి వస్తున్న వారిలో రోజూ 200 మందికి తాను ఫొటోలు ఇస్తున్నానని చెప్పారు. కానీ కొందరు బ్లేడ్ బ్యాచ్ వాళ్లు, ఫ్యాన్స్ ముసుగులో వచ్చి తనను, సెక్యూరిటీ వాళ్లను చిన్నగా కట్ చేస్తున్నారని పిఠాపురంలో జనసేన నేతలతో మాట్లాడుతూ షాకింగ్ విషయాలు వెల్లడించారు. ప్రత్యర్థి పార్టీ పన్నాగాలు తెలుసు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలని, ఈ విషయాన్ని కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ కు చెబుతామని అనుకుంటున్నా, మరిచిపోతున్నానని పవన్ తెలిపారు.
పిఠాపురాన్ని స్వస్థలం చేసుకుంటా
పిఠాపురాన్ని నా స్వస్థలం చేసుకోవడానికి వచ్చాను. మన జనాభా 2 లక్షలకు పైచిలుకు ఉన్నారు. నియోజకవర్గ ప్రజలు అందరితో ఫొటో దిగాలని ఉంది. ఇది ఒక్క రోజులో పని కాదు. సన్న బ్లేడ్లతో నన్ను, సెక్యూరిటీ వాళ్లను సైతం కోస్తున్నారు. ఈ కుట్రలపై జన సైనికులు చాలా అప్రమత్తంగా ఉండాలి. మీ వద్దకు రావాలని ఉన్నా,నేను రాలేకపోతున్నాను. నా వద్దకు వచ్చేందుకు ఛాన్స్ ఇస్తే.. కొందరు చిన్న బ్లేడ్లు తెచ్చి నన్ను కట్ చేస్తున్నారు. ప్రజలతో మమేకం కావాలని తాను చూస్తుంటే రాజకీయ కుట్రలకు పాల్పడుతున్నారు. సాధ్యమైనంత వరకు నియంత్రణ పాటిస్తూ ముందుకువెళదాం. ఇక్కడే ఉండిపోవడానికి, నా సొంతిల్లు చేసుకునేందుకు పిఠాపురం వచ్చాను.. - పవన్ కళ్యాణ్
ఆ అభిమాని కోసం దేవుడ్ని ప్రార్థించాను
భగవంతున్ని నా కోసం ఎక్కువగా ఏం కోరుకోలేదు. ఓసారి నా సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. మనకు ఏం కావాలన్నా భగవంతున్ని ప్రార్థిస్తుంటాం. కానీ అప్పుడు కూడా నాకోసం కోరుకోలేదు. తన సినిమాలు వరుస ఫ్లాప్ అవుతున్నాయని, అన్నా ఒక్క హిట్ ఇవ్వన్నా అని మహబూబ్ నగర్ నుంచి ఓ అభిమాని వచ్చాడు. ముఖం చూపించుకోలేకపోతున్నాం అన్న, ఈసారి హిట్ కొట్టాలని అడగగా.. అతడి కోసమైనా నా సినిమా సక్సెస్ కావాలని దేవుడ్ని కోరుకున్నాను. భీమవరంలో ఓడిపోయినప్పుడు అన్నా మీరు ఒకసారి గెలవాలని జనసైనికులు అడిగారు. అందుకోసం తాను పిఠాపురం నుంచి నెగ్గాలని మరోసారి దేవున్ని ప్రార్థించాను. - పవన్ కళ్యాణ్
కాకినాడ ఎంపీ సీటు నుంచి వైసీపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ పోటీ చేస్తున్నారు, ఆయన కేవలం ఎన్నికల సమయంలో వచ్చి ఫలితాలు రాగానే వెళ్లిపోతారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అదే జనసేన అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ విషయానికొస్తే అతడు స్థానికంగా ఉంటూ ప్రజల సమస్యలు తీర్చే వ్యక్తి అన్నారు. దాదాపు రూ.10 లక్షలతో 2017లో టీ టైమ్ వ్యాపారం ప్రారంభించి, విజయవంతం అయ్యారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చి, ఇంజినీరింగ్ చేసిన ఉదయ్ టీ బిజినెస్ ప్రారంభించి ఎంతో మందికి ఉపాధి కల్పించారని చెప్పుకొచ్చారు. చిన్నగా ప్రారంభించిన ఈ టీ బిజినెస్ దేశమంతటా 4 వేల ఔట్ లెట్లకు పెరిగిందన్నారు. చిన్న ఐడియాతో ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన మేకిన్ ఇండియా, సెల్ఫ్ బిజినెస్ మ్యాన్ గా మారాడు. ఫ్రాంచైజీలో వేరే వ్యక్తులకు ఛాన్స్ ఇచ్చి, తనలాగ సొంతంగా ఎదగాలని తాపత్రయ పడిన ఉదయ్ శ్రీనివాస్.. బెస్ట్ సీఈవో, బెస్ట్ ఎంటర్ ప్రెన్యూర్, ఆత్మనిర్భర్ భారత్.. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు కైవసం చేసుకున్నారని కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్ధిపై ప్రశంసల వర్షం కురిపించారు.