Janasena Godavari : గోదావరి జిల్లాల జనసేనలో తగ్గని అలజడి - పార్టీని ధిక్కరిస్తున్న వారి బుజ్జగింపులకూ ఆసక్తి చూపని జనసేనాని !
Janasena : పొత్తుల్లో సీటు రాలేదంటూ జనసేన నేతలు అలజడి సృష్టిస్తూనే ఉన్నారు. అయితే వారిని బుజ్జగించేందుకు పవన్ కల్యాణ్ కూడా ఆసక్తి చూపించడం లేదు.
Janasena Godavari : టీడీపీ – జనసేన ఇటీవల ఉమ్మడిగా ప్రకటించిన అసెంబ్లీ స్థానాల సీట్ల వ్యవహారం ప్రస్తుతం ఆ పార్టీలకు తలనొప్పిగా మారింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తొలి జాబితాలో రెండు జనసేన, 9 టీడీపీ స్థానాలను ప్రకటించగా ఆయా స్థానాల్లో టికెట్లు దక్కని పలువురు ఆశావాహులు అసంతృప్తితో రగిలిపోతున్నారు. జగ్గంపేట, పి.గన్నవరం, పెద్దాపురం, రాజమహేంద్రవరం రూరల్ వంటి బలంగా ఉన్న నియోజకవర్గాల్లో జనసేనకు టికెట్లు దక్కకపోవడంతో తీవ్రస్థాయిలో అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
జగ్గం పేట జనసేన నేత నిరాహారదీక్ష
జగ్గంపేట సీటును టీడీపీకి కేటాయించారు. జ్యోతుల నెహ్రూకి టికెట్ కేటాయించడంతో తీవ్ర మనస్థాపానికి గురైన జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ పాఠంశెట్టి సూర్యచంద్ర గత రెండు రోజులుగా గోకవరం మండలం అచ్యుతాపురంలో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు. 48 గంటల్లోగా అధిష్టానం నుంచి ఏదో ఒకటి చెప్పకపోతే తన భవిష్యత్తు కర్తవ్యాన్ని కార్యకర్తలతో ఆలోచించి ప్రకటిస్తానని ఈ సందర్భంగా ఆయన హెచ్చరిస్తున్నారు. గత రెండు రోజులుగా ఆయన దీక్ష చేస్తున్నారు. వైసీపీ నేతలు కార్యకర్తలు వచ్చి పరామర్శిస్తున్నారు. పొత్తులో భాగంగా టిక్కెట్ దక్కించుకున్న జ్యోతుల నెహ్రూ ఇప్పటివరకు ఆయన్ను కలవలేదు. సూర్యచంద్ర వైసీపీలో చేరిపోతారనే ప్రచారం జరుగుతోంది.
పలు నియోజకవర్గాల్లో అసంతృప్తి
పెద్దాపురంలోనూ అసంతృప్తి జ్వాలలు కొనసాగుతున్నాయి. మూడోసారి కూడా పెద్దాపురంలో చిన్న రాజప్పకే టికెట్ దక్కడంతో ఆ సీటుపై ఆశలు పెంచుకున్న జనసేన ఇన్‌ఛార్జ్ తుమ్మల రామస్వామి రెండు రోజుల క్రితం జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో తన అసహనాన్ని వ్యక్తం చేశారు. చినరాజప్ప జన సైనికులు అందరికీ భరోసా ఇస్తేనే జనసేనలో కొనసాగుతానన్నారు. పీఆర్పీ పి నుంచి, ఆ తర్వాత జనసేన ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజక వర్గ కార్యకర్తలకు అధినేత పవన్ కళ్యాణ్ వచ్చి భరోసా ఇవ్వాలని లేకుంటే త్వరలో తన కార్యాచరణ ప్రకటిస్తానని తుమ్మల బాబు ఈ సందర్భంగా హెచ్చరించారు.
టీడీపీలోనూ అసంతృప్తి
కాకినాడ రూరల్‌లో జనసేన ఇన్‌ఛార్జ్ పంతం నానాజీకి టిక్కెట్ దక్కడంతో టీడీపీ సీనియర్ నేత మాజీ ఎంఎల్‌ఎ పిల్లి అనంత లక్ష్మి ఇంటి వద్ద హైడ్రామా నడిచింది. మాజీ ఎంఎల్‌ఎ భర్త పిల్లి సత్తిబాబుకు టికెట్ ఇవ్వాలంటూ టిడిపి కార్యకర్త ఒకరు ఒంటిపై డీజిల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనూ టిక్కెట్ల రగడ కొనసాగుతోంది. కొత్తపేటలో పార్టీ బలంగా ఉన్నా టికెట్ కేటాయించకపోవడం సరికాదంటూ జనసేన కేడర్ ప్రకటిస్తున్న అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముమ్మిడివరంలో పితాని బాలకృష్ణకు టికెట్ దక్కకపోవడంతో ఆదివారం మంగళగిరి పార్టీ కార్యాలయానికి వెళ్లి పార్టీ పెద్దలతో చర్చించారు. సానుకూ లమైన నిర్ణయం ప్రకటిం చకపోతే భవిష్యత్తు కార్యా చరణ తామే ప్రకటి స్తామంటూ ఈ సందర్భంగా హెచ్చ రించినట్లు సమాచారం