Pawan Kalyan to Delhi : ఢిల్లీకి పవన్ కల్యాణ్ - నేడో , రేపో ఏపీ పొత్తులపై అధికారిక ప్రకటన
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ బీజేపీ అగ్రనేతలతో భేటీకి ఢిల్లీకి వెళ్తున్నారు. టీడీపీ, జనసేన కూటమిలో బీజేపీ చేరే అంశంపై ప్రధానంగా చర్చించనున్నరు.
Jana Sena chief Pawan Kalyan is going to Delhi to meet top BJP leaders : జనసేన అధినేత పవన్ కల్యాణ‌్ ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. బీజేపీ అగ్రనేతలతో ఆయన సమావేశం కానున్నారు. పొత్తులు, ఏపీలో రాజకీయ పరిణామాలపై ఆయన చర్చించనున్నారు. ప్రధాని మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో ఆయన సమావేశమయ్యే అవకాశాలున్నాయి. అంతకు ముందు ఉదయం పవన్ కల్యాణ్ భీమవరంలో పర్యటించారు. ఆయన టీడీపీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మిని భీమవరంలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ తాను వచ్చే ఎన్నికల్లో భీమవరం నుంచి పోటీ చేస్తున్నట్లు చెప్పినట్లు తెలిసింది. దీంతో పవన్ పోటీపై క్లారిటీ వచ్చినట్లయింది. తాను భీమవరం నుంచి పోటీ చేయాలని, తనకు మద్దతివ్వాలని కోరినట్లు తెలుస్తోంది.
జనసేన నుంచి పోటీ చేసేందుకు ఆశావహుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటికే పలు నియోజకవర్గాలకు ఆయన సమన్వయకర్తలను నియమించారు. ఈ నెల 22 తర్వాత ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఆయన ఖరారు చేయనున్నారు. టీ టీడీపీ, జనసేన పొత్తులో బీజేపీ కూడా కలిసేలా పరిస్థితిలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు హస్తినకు వెళ్లారు. కేంద్రహోంమంత్రి అమిత్ షాతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసి చర్చించారు. తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా బీజేపీ అధిష్టానాన్ని కలవనున్నారు. వచ్చే ఎన్నికల్లో పొత్తు, సీట్ల వ్యవహారంపై చర్చించనున్నారు. ఇందుకోసం పవన్ కల్యాణ్ ఈ 22న ఢిల్లీ వెళ్లనున్నారు. పొత్తులో భాగంగా జనసేనకు ఎన్ని సీట్లు దక్కుతాయనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గా మారింది. పవన్ ఢిల్లీ పర్యటన తర్వాత జనసేన సీట్లపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని పలువురు జనసేన నాయకులు అంటున్నారు.
సంక్రాంతి తర్వాతే తెలుగు దేశం, జనసేన అభ్యర్థుల జాబితా విడుదల కావాల్సి ఉంది. అయితే బీజేపీ ఈ కూటమిలో చేరే విషయమై ఇంకా అధికారికంగా స్పష్టత రాని కారణంగానే ఈ కూటమి అభ్యర్థుల జాబితా ఇంకా విడుదల కాలేదనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు. పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన తర్వాత ఈ విషయమై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉండొచ్చనే చర్చ కూడ ప్రారంభమైంది. పొత్తుల కారణంగా సీట్లు త్యాగం చేయాల్సిన పరిస్థితి అనివార్యంగా మారిందని తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు ఇటీవల టెలికాన్ఫరెన్స్ లో చెప్పారు. మరో వైపు ఇతర పార్టీల నుండి చేరికల కారణంగా సీట్లను కూడ వదులుకోవాల్సిన పరిస్థితి నెలకొందని చంద్రబాబు పార్టీ నేతలకు తేల్చి చెప్పారు. పవన్ కల్యాణ్ కూడా అదే చెబుతున్నారు. పార్టీ నేతలు త్యాగాలకు సిద్ధం కావాలన్నారు.