(Source: ECI/ABP News/ABP Majha)
AP Minister IT Notices : ఆ స్థలాలన్నీ బినామీల పేర్లతో మంత్రి జయరాం కొన్నారా ? - డబ్బులెక్కడివో చెప్పాలని ఐటీ నోటీసులు !
కర్నూలు మంత్రి జయరాం భార్యకు ఐటీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇట్టీనా కంపెనీ భూముల కొనుగోలు వ్యవహారంలో ఈ నోటీసులు ఇచ్చారు.
AP Minister IT Notices : ఆంధ్రప్రదేశ్ మంత్రి గుమ్మనూరు జయరాం భార్య రేణుకకు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. బినామీ యాక్టు కింద నోటీసులు జారీ అయ్యాయి. కర్నూలు జిల్లా అస్పరిలో కొనుగోలు చేసిన 30.83 ఎకరాల భూమి కొనుగోలు లావాదేవీలపై ఐటీ నోటీసులు పంపింది. రూ. 52.42 లక్షల విలువైన భూ కొనుగోళ్లకు సంబంధించిన లెక్కలు చూపడం లేదని నోటీసులో పేర్కొన్నారు. మొత్తం 180 ఎకరాల భూమిలో రేణుక పేరు మీద 30.83 ఎకరాలు ఉన్నాయి. మిగిలిన భూమి కూడా మంత్రి గుమ్మనూరు జయరాం బంధువుల పేరు మీదే రిజిస్టర్ అయింది. ఒకే రోజున మంత్రి భార్య, బంధువులు, సన్నిహితుల పేర్లతో 180 ఎకరాల భూమి రిజిస్టర్ చేసినట్టు ఐటీ అధికారులు నోటీసులో పేర్కొన్నారు. మంత్రి భార్య రేణుక సహా 180 ఎకరాలు కొనుగోళ్లు చేసింది మంత్రి బినామీలేననే ఐటీ శాఖ నోటీసుల్లో స్పష్టం చేసింది. 180 ఎకరాలను సీజ్ చేస్తున్నట్టు తెలిపారు. 90 రోజుల్లోగా భూ కొనుగోళ్ల లావాదేవీలకు సంబంధించిన ఆదాయ వివరాలను అందించాలని ఐటీ విభాగం స్పష్టం చేసింది.
ఇట్టీనా కంపెనీ భూములను కొన్న మంత్రి జయరాం కుటుంబీకులు
మంత్రి జయరాం నియోజకవర్గంలో ఇట్టినా అనే కంపెనీకి 450ఎకరాల భూమి ఉంది. ఆ కంపెనీలో కొంతకాలం డైరెక్టర్‌గా ఉండి.. 2009లోనే వైదొలగిన మంజునాథ్ అనే వ్యక్తి సాయంతో .. మంత్రి జయరాం కుటుంబీకులు భూములు కొనుగోలు చేశారు. రిజిస్ట్రేషన్లు కూడా పూర్తయిన తర్వాత ఇట్టీనా కంపెనీ యజమానులు.. మోసం జరిగిందని గుర్తించి కర్ణాటకలోని కోరమంగళం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మంత్రి సతీమణి రేణుక తో పాటు మరో నలుగురి పేర్లను అందులో కేసులో నిందితులుగా చేర్చారు. తప్పుడు పత్రాలు సృష్టించి మంత్రి తమ భూమి కాజేశారని వారు చెప్పడంతో పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
నగదు రూపంలో డబ్బులు చెల్లించారని టీడీపీ తీవ్ర ఆరోపణలు
ఈ భూముల కొనుగోలు వ్యవహారంలో మంత్రి జయరాం పై తెలుగుదేశం పార్టీ తీవ్ర ఆరోపణలుచేసింది. ఇట్టీనా ప్లాంటేషన్స్‌కు చెందినే భూమిని కొనుగోలు చేసి రూ.1.60కోట్లు నగదు రూపంలో చెల్లించారని.. అంత డబ్బు ఆయనకు ఎక్కడి నుంచి వచ్చిందని తెలుగుదేశం పార్టీ ఆరోపించారు. ఐటీ చట్టం నిబంధనల ప్రకారం రూ.2 లక్షలకు మించిన ఏ లావాదేవీ కూడా నగదు రూపంలో చేయడానికి వీల్లేదని.. బ్యాంకు ద్వారానే చెల్లింపులు జరపాలని కానీ జయరాం మాత్రం నగదు చెల్లింపులు చేశారన్నారు. రూ.1.60కోట్లు నగదు రూపంలో చెల్లించి మంత్రి ఈ భూమిని కొనుగోలు చేసినట్లు కొనుగోలు దస్తావేజుల్లోనే రాశారని.. అందులో మంత్రి భార్య రూ.53 లక్షలు నగదుగా చెల్లించినట్లు రిజిస్ట్రార్ కార్యాలయ అధికారులు నమోదు చేశారని డాక్యుమెంట్లు బయట పెట్టారు.
ఎన్నికల అఫిడవిట్ ప్రకారం జయరాం కుటంబం ఆదాయం రూ. 19 వేలు !
2019 ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు జయరాం వెల్లడించిన వివరాల ప్రకారం ఆయనకు నెలకు వచ్చే ఆదాయం రూ.12వేలు. అంత తక్కువ ఆదాయం ఉన్న వ్యక్తి కోటిన్నరకు పైగా చెల్లించి ఇంత భూమిని ఎలా కొనగలిగారని టీడీపీ నేతలు ప్రశ్నించారు. ఆయనకు ఎన్నికల ముందు 8.5ఎకరాల భూమి మాత్రమే ఉంది. మంత్రి కాగానే వందల ఎకరాలు కొనుగోలు చేశారని టీడీపీ ఆరోపిస్తోంది. ఇప్పుడు అవన్నీ బీనామీ స్థలాలని చెప్పి ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది.