Breaking News Live: ఏపీలో 24 మంది మంత్రులు రాజీనామా, 11న కొత్త కేబినెట్ ప్రమాణ స్వీకారం
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
LIVE
Background
ఎండ వేడితో ఉక్కిరి బిక్కిరి అవుతున్న ఆంధ్రప్రదేశ్‌లో కాస్త చల్లని వాతావరణం కలిగే అవకాశం ఉంది. మరో 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తర కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. కానీ, నేడు మాత్రం వాతావరణం పొడిగానే ఉండనున్నట్లు అంచనా వేసింది. నేడు ఉత్తర కోస్తాంధ్ర సహా, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. మరోవైపు ఎండల తీవ్రత నేపథ్యంలో కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్, మరికొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది. మత్స్యకారులకు కూడా ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు.
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో.. (Temperature in Andhra Pradesh)
ఏపీలోని ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో వాతావరణంలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం.. భానుడి ప్రతాపంతో రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రత 40 డిగ్రీలను తాకింది. విశాఖలో 36 డిగ్రీలు, తిరుపతిలో 38.4, కర్నూలులో 39 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. నందిగామలో 36.8 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదు కాగా, కావలిలో 36 డిగ్రీలు, నెల్లూరులోనూ 35.5 డిగ్రీలు, విశాఖలో 35.2 డిగ్రీలు, జంగమేశ్వరపురంలో 36.2 డిగ్రీల మేర ఉష్ణోగ్రలు ఉన్నాయి.
‘‘బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే పరిస్ధితులు కనిపిస్తున్నాయి. మరో 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది మెల్లగా అభివృద్ధి చెంది వాయుగుండంగా మారనుంది. దీని గమ్యం శ్రీలంకకు చాలా దగ్గరగా వెళ్లటం. దీని వల్ల మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ఎటువంటి ప్రభావం ఉండదు. గుజరాత్ పై ఉండే ఒక అధికపీడన ప్రాంతం ఈ అల్పపీడనాన్ని కిందకు నెట్టనుంది. దీని వల్ల మనకు వర్షాలు తక్కువగా ఉంటాయి. కానీ ఎక్కడా పంట నష్టం ఉండదు, అలాగే నగరాల్లో వరదలు వచ్చే విధంగా వర్షాలుండవు. ఈ వాయుగుండం శ్రీలంకను తాకిన తర్వాత మన ఆంధ్ర రాష్ట్రం కోస్తా భాగాల్లో, విశాఖ ఏజెన్సీ, మారేడుమిల్లి ప్రాంతంలో అక్కడక్కడ కొన్ని వర్షాలుంటాయి. మిగిలిన ఎక్కడ అంత వర్షాలుండవు.’’ అని ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ తెలిపారు.
తెలంగాణలో వాతావరణం ఇలా (Telangana Weather)
తెలంగాణలో చాలా వరకూ పొడి వాతావరణమే నెలకొంటుందని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. గడిచిన 24 గంటల్లో అత్యధిక ఉష్ణోగ్రత ఆదిలాబాద్ జిల్లాలో 41.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని వెల్లడించింది. తర్వాత నిజామాబాద్‌లో 40.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆ తర్వాత మెదక్, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లో అధిక ఉఖష్ణోగ్రత నమోదైంది.
అల్లూరి జిల్లాలో పోలీస్ ఇన్ ఫార్మర్ గా మారాడని వ్యక్తిని హత్య చేసిన మావోలు
అల్లూరి జిల్లా పెదబయలు మండలంలోని మారుమూల బొంగజంగి గ్రామంలో నిన్న రాత్రి సాయుధులైన మావోయిస్ట్ లు కొర్ర లక్ష్మణ్ అనే వ్యక్తిని హతమార్చారు. చనిపోయిన వ్యక్తి గతంలో మావోయిస్ట్ సానుభూతి పరుడుగా ఉండేవాడనీ తరువాత బయటకు వచ్చి పోలీస్ ఇన్ ఫార్మర్ గా మారాడని ఆరోపిస్తూ బుధవారం సాయుధులైన పదిమంది మావోయిస్ట్ లు అతడిని హత్య చేసినట్లు తెలుస్తోంది. ఊరిలోకి వచ్చిన మావోయిస్టులు లక్ష్మణ్ ను తీసుకు వెళ్లి హతమార్చినట్టు సమాచారం. ఈ ఘటనపై పోలీస్ లు ఇంకా స్పందించలేదు.
ఏపీలో 24 మంది మంత్రులు రాజీనామా, 11న కొత్త కేబినెట్ ప్రమాణ స్వీకారం
ఏపీలో 24 మంది మంత్రులు రాజీనామా చేశారు. మంత్రులు రాజీనామా పత్రాలను ముఖ్యమంత్రికి సమర్పించారు. ఈ నెల 11న కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం ఉంటుందని సీఎం తెలిపారని మంత్రి కొడాలి నాని అన్నారు. మంత్రులందరూ రాజీనామా లేఖలు సమర్పించామన్నారు. కొంత మంది మంత్రులు తనతో పాటు కంటెన్యూ అవుతారని సీఎం చెప్పారు. ఇతరులకు పార్టీ బాధ్యతులు అప్పగిస్తామన్నారు.
Vikarabad: నిరసనల్లో పాల్గొన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో యాసంగిలో పండించిన వరి పంటను కొనాలని డిమాండ్ చేస్తూ వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో చేపట్టిన మహా ధర్నాలో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అధ్యక్షతన జరుగుతున్న మహా ధర్నాలో జడ్పీ చైర్ పర్సన్ సునీత రెడ్డి, ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, పట్నం నరేందర్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి, జడ్పీ వైస్ ఛైర్మన్ విజయ్ కుమార్, జిల్లాలోని ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్, మార్కెట్, సొసైటీల చైర్మన్లు, పార్టీ అధ్యక్షులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, రైతు బంధు నేతలు,పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు.
తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నేతల అరెస్టులు
* పెరిగిన కరెంట్ ఛార్జీలు, గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరల పెంపునకు నిరసనగా విద్యుత్ సౌధ, సివిల్ సప్లై కార్యాలయ ముట్టడికి పిలుపునిచ్చిన టీ కాంగ్రెస్
* ఉదయం నుండి రేవంత్ రెడ్డి ఇంటి చుట్టూ పోలీసుల మొహరింపు.
* మరికాసేపటిలో ముట్టడి కార్యక్రమానికి బయలుదేరనున్న రేవంత్ రెడ్డి
* టీఆర్ఎస్ బూటకపు ధర్నాలకు పోలీసులు అనుమతించారని, ప్రజల తరపున కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తుంటే హౌస్ అరెస్ట్ చేయడం తగదంటూ కాంగ్రెస్ లీడర్ల ఆగ్రహం
- ఎట్టి పరిస్థితుల్లో ముట్టడిని విజయవంతం చేస్తామన్న రేవంత్ రెడ్డి
Govt Hospital: ప్రభుత్వ ఆస్పత్రిలో కరెంటు లేక రోగుల అవస్థలు
ఏలూరు జిల్లా చింతలపూడి సామాజిక ఆరోగ్యకేంద్రంలో కరెంటు లేక రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వేళాపాళా లేని విద్యుత్ అంతరాయంవల్ల రోగులు, చంటిబిడ్డలు, తల్లులు విలవిలలాడుతున్నారు. ఆసుపత్రిలో ఉండలేక బయటకు వచ్చి కూర్చుంటున్నారు. వచ్చిన వారిపై దోమలు విరుచుకు పడుతున్నాయి. బయటకు రాలేనివారు లోపలే మగ్గిపోతున్నారు. తెల్లవార్లు విసురుకుంటు కూర్చుంటున్నామని రోగులు, చంటిబిడ్డల తల్లులు వాపోతున్నారు. ఆసుపత్రికి విద్యుత్ ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రసూతి వార్డులో కరెంట్ లేదని నర్సులని నిలదీస్తున్నారు.