CID Raids In Narayana NSPIRA : అమరావతిలో అసైన్డ్ భూముల కొనుగోలు, మాజీ మంత్రి నారాయణ సంస్థలో ఏపీ సీఐడీ సోదాలు!
CID Raids In Narayana NSPIRA : మాజీ మంత్రి నారాయణకు చెందిన ఎన్ఎస్పీఐఆర్ఏ సంస్థలో ఏపీ సీఐడీ సోదాలు చేపట్టింది. అమరావతిలో చట్టవిరుద్ధంగా అసైన్డ్ భూములు కొనుగోలు చేశారన్న ఆరోపణలతో ఈ సోదాలు చేపట్టారు.
CID Raids In Narayana NSPIRA :మాజీ మంత్రి నారాయణకు చెందిన సంస్థలో ఏపీ సీఐడీ సోదాలు నిర్వహించారు. హైదరాబాద్ మాదాపూర్ లోని మాజీ మంత్రి నారాయణకి చెందిన NSPIRA సంస్థలో తనిఖీలు చేశారు. నారాయణ సంస్థల నుండి రామకృష్ణ హౌసింగ్ సంస్థలోకి నిధులు మళ్లించారని సీఐడీ ఆరోపిస్తుంది. ఈ డబ్బుతో నారాయణ బినామీల పేర్లపై అమరావతిలో చట్ట విరుద్దంగా అసైన్డ్ భూముల కొనుగోలు చేశారని సీఐడీ అధికారులు ఆరోపిస్తున్నారు.
అసైన్డ్ భూముల కొనుగోలు
మాజీ మంత్రి నారాయణ, అప్పటి మంత్రులు, వారి బినామీలు రాజధాని ప్రాంతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీల నుంచి అసైన్డ్ భూములను లాక్కొన్నారని సీఐడీ అధికారులు అభియోగిస్తున్నారు. ల్యాండ్ పూలింగ్ పథకం కింద ఎలాంటి ప్యాకేజీ ఇవ్వకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీల నుంచి తక్కువ ధరలకు భూములు కొనుగోలు చేశారని తెలిపింది. టీడీపీ ప్రభుత్వంలో ఉన్న కొందరు మంత్రులు అధికారులపై ఒత్తిడి తెచ్చి మందడం, వెలగపూడి, రాయపూడి, ఉద్దండరాయునిపాలెం గ్రామాల్లోని అసైన్డ్ భూములకు ల్యాండ్ పూలింగ్ పథకం ద్వారా పొందేందుకు 2016లో ఎం.ఎస్.నెం.41 జీఓ జారీ చేశారని వెల్లడించింది ఏపీ సీఐడీ.
నారాయణ సంస్థ నుంచి నిధులు
'కొమ్మారెడ్డి బ్రహ్మానంద రెడ్డి, కేపీవీ అంజనీకుమార్, గుమ్మడి సురేష్, కొల్లి శివరాం, మంత్రుల కుటుంబ సభ్యులు పథకం ప్రకారం అప్పటి మంత్రుల బినామీలుగా వ్యవహరించి పేదల అసైన్డ్ భూములను కొనుగోలు చేశారు. నిషేధిత జాబితాలోని భూములపై రిజిస్ట్రేషన్లు, జీపీఏలు అనుమతించాలంటూ మంగళగిరి సబ్ రిజిస్ట్రార్, అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ స్కాంలో పొంగూరు నారాయణ ప్రధాన లబ్ధిదారులుగా ఉన్నారు. మాజీ మంత్రి నారాయణ స్థాపించిన నారాయణ ఎడ్యుకేషన్ సొసైటీ, నారాయణ లెర్నింగ్ ప్రైవేట్ లిమిటెడ్, రామ నారాయణ ట్రస్ట్ ల నుంచి జూన్, 2014 నుండి డబ్బును రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌కి తరలించారు. రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ అంజనీ కుమార్ తన ఉద్యోగుల ఖాతాలోకి డబ్బును బదిలీ చేశారు. వారు అమరావతి రాజధాని నగరంలోని అసైన్డ్ భూముల రైతులకు చెల్లింపులు చేశారు. భూములకు సంబంధించిన ఒరిజినల్ పత్రాలను రైతుల నుంచి తీసుకొని వాటిని మాజీ మంత్రి నారాయణ సమీప బంధువులకు విక్రయించేందుకు ఒప్పందాలు చేసుకున్నారు. ఇప్పటి వరకు 150 ఎకరాలకు పైగా లావాదేవీలను గుర్తించారు.తాము మోసపోయామని గుర్తించిన అసైన్డ్ భూముల రైతులు ల్యాండ్ పూలింగ్ పథకం కింద తమ హక్కులు, హక్కుల రక్షణ, పునరుద్ధరణ కోసం అధికారులను ఆశ్రయిస్తున్నారు. ' అని ఏపీ సీఐడీ ఓ ప్రకటన జారీ చేసింది.
NSPIRAలో సీఐడీ తనిఖీలు
హైదరాబాద్ మాదాపూర్ లోని NSPIRA మేనేజ్‌మెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్లుగా పి.నారాయణ కుమార్తె, అల్లుడు ఉన్నారు. NSPIRA సంస్థ నారాయణ గ్రూప్ లోని అన్ని పాఠశాలలు, కళాశాలల నిర్వహణ, మ్యాన్ పవర్, మౌలిక సదుపాయాలు మొదలైన వాటి కోసం చెల్లింపులు చేస్తుంది. నారాయణ గ్రూప్‌లోని అన్ని పాఠశాలలు కళాశాలల అవసరాలు, ఈ లావాదేవీలపై కమిషన్‌లను పొందుతుంది. నారాయణ గ్రూప్‌కు అనుసంధానించబడిన సంస్థల ఆర్థిక కార్యకలాపాలన్నీ మాదాపూర్ NSPIRA ప్రాంగణంలోనే జరుగుతున్నాయి. మంగళవారం ఏపీ సీఐడీ అధికారులు NSPIRA మేనేజ్‌మెంట్ సర్వీసెస్ కార్యాలయంలో సోదాలు ప్రారంభించారు. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయని, అమరావతి ప్రాంతంలో జరిగిన భూముల అక్రమ, బినామీ కొనుగోళ్లకు సంబంధించిన నిధుల సమకూర్పుపై కీలక సమాచారం లభించినట్లు తెలుస్తోంది.