Kadiyapulanka Flowers: శ్రావణ శుక్రవారం వేళ ఆకాశానికి పూల ధరలు, అధిక ఉత్పత్తి ఉన్న చోటే ఇలా! మిగతాచోట్ల చుక్కలే
Kadiyapulanka Flowers: తూర్పుగోదావరి జిల్లాలోని కడియపు లంక పూల మార్కెట్ శ్రావణ శోభ సంతరించుకుంది. పూల దుకాణాలు కళకళలాడుతున్నాయి. ఈ మాసంలో పూజలు ఎక్కువగా చేస్తుండంతో పూలకు డిమాండ్ ఏర్పడింది.
Kadiyapulanka Flowers: ఆషాఢ మాసం ముగిసి శ్రావణ మాసం వచ్చేసింది. మహిళలకు ఎంతో ఇష్టమయిన పవిత్ర మాసం ఇది. ఏ ఇంట చూసినా పండుగ వాతావరణమే కనబడుతుంది. పూజలు, వ్రతాలకు ఈ శ్రావణ మాసంలోనే ఎక్కువ జరుగుతాయి. కొత్తగా పెళ్లయిన వారు పుట్టింట్లో వివిధ రకాల పూజలు చేస్తారు. ఆషాఢంలో అత్తారింటికి దూరంగా ఉండి, శ్రావణ శుక్రవారం పూజలు చేసి అత్తారింటికి వెళతారు. అలాంటి మాసం వచ్చిందంటే నెలంతా ఇంట్లో పండుగ వాతావరణం ఉంటుంది.
తూర్పుగోదావరి జిల్లాలోని కడియపు లంక పూల మార్కెట్ శ్రావణ శోభ సంతరించుకుంది. పూల దుకాణాలు కళకళలాడుతున్నాయి. ఈ మాసంలో పూజలు ఎక్కువగా చేస్తుండంతో పూలకు డిమాండ్ ఏర్పడింది. ఆషాడం, అధిక శ్రావణ మాసాలతో పూల రైతులు, వ్యాపారులు అమ్మకాలు లేక నిరుత్సాహంతో ఉండేవారు. కళకళలాడే పూల మార్కెట్ వెలవెలబోయేవి. శ్రావణమాసం రావడంతో వివాహాది శుభకార్యాలు, పూజలు, వ్రతాలు అధికమయ్యాయి. ఈ క్రమంలో పూల అమ్మకాలు జోరు అందుకున్నాయి. ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం సందర్భంగా బుధవారం నుంచి తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక అంతరాష్ట్ర పూల మార్కెట్లో పెద్ద ఎత్తున అమ్మకాలు జరుగుతున్నాయి.
శుక్రవారం జరిగే వరలక్ష్మి వ్రతం సందర్భంగా బుధ, గురువారాల్లో ఈ మార్కెట్‌కు దూరప్రాంతాల నుంచి పూల కొనుగోలుదారులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో పూల ధరలు ఆకాశాన్నంటాయి. డిమాండ్ పెరగడం, ఇక్కడ పూల దిగుబడులు లేకపోవడంతో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి టన్నుల కొలది బంతి, చామంతి, గులాబీ వంటి పూలను దిగుమతి చేసుకుంటున్నారు. గురువారం ఉభయగోదావరి జిల్లాలతో పాటు విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, ఒడిశా నుంచి రాష్ట్రంలోని రాయగడ, తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా నుంచి కొనుగోలుదారులు తరలివచ్చి కావలసిన పూలను కొనుగోలు చేసి తీసుకెళ్లారు.
బుధవారం సైతం ఈ తరహాలోనే అమ్మకాలు జరిగాయి. శ్రావణ శుక్రవారం, పెళ్లిళ్లు సీజన్ స్టార్ట్ కావడంతో పూలకు భారీగా డిమాండ్ ఏర్పడింది. ఇతర రాష్ట్రాల నుంచి పూల దిగుమతులు చేసుకోవడం ద్వారా ధరలు కూడా విపరీతంగా పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. ఇటీవల వచ్చిన వరదలకు లంక గ్రామాల్లో పూల తోటలు పాడైపోయాయి. ఫలితంగా పూల దిగుబడి తగ్గిపోయి డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా రేట్లు పెరిగిపోయాయి. కడియపు లంక చుట్టుపక్కల గ్రామాలలో 600కు పైగా నర్సరీలు దేశంలోనే ప్రసిద్ధి గాంచాయి. ఇక్కడి పూల మార్కెట్ నుండి తూర్పు,పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటుగా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు పూల సరఫరా జరుగుతుంది. ఈ మార్కెట్లో హోల్‌సేల్ దుకాణాలు వంద వరకూ వుంటాయి.
మామూలుగా కడియం మండలంతో పాటు కోనసీమ జిల్లాలో ఆలమూరు, ఆత్రేయపురం మండలాల్లో ఈ పూల సాగు అధికంగా ఉంటుంది. ఈ మూడు మండలాల్లోనే సుమారు 2,500 నుంచి 3,000 ఎకరాల్లో వివిధ రకాల పూలను సాగు చేస్తున్నారు. ప్రస్తుతం లిల్లీ, మల్లి, జాజులు, కనకాంబరాలు, దేశవాళీ గులాబీలు మాత్రమే ఈ ప్రాంతాల్లో దిగుబడులు ఉన్నాయి. మిగిలిన పువ్వులు ఇతర రాష్ట్రాలు నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. కడియపులంక మార్కెట్ కేంద్రంగానే కొనుగోలు అమ్మకాలు జరుగుతుంటాయి.
కడియపు లంక పూల మార్కెట్‌లో ధరలు
- కిలో చామంతి రూ.500 నుంచి 600
- పసుపు బంతి రూ.100 నుంచి 200
- ఆరంజ్ బంతి 100 నుంచి 150
- లిల్లీ రూ.300 నుంచి 350
- మల్లి రూ.1000 నుంచి 1300
- జాజులు రూ.700 నుంచి 1000
- కాగడాలు రూ.700 నుంచి 750
- స్టార్ గులాబీ రూ.400 నుంచి 600
- కనకాంబరాల బారు రూ.350 నుంచి 400