Raghurama : రఘురామ కేసులో మెడికల్ రికార్డులు సమర్పించండి - ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం !
ఎంపీ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో మెడికల్ రిపోర్టులు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.
Raghurama : వైసీపీ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్‌పై ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. 2021 మే 15, 16 తేదీల్లో రఘురామకృష్ణ రాజు కస్టోడియల్ టార్చర్‌పై గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని నివేదికలను కోర్టుకు సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ నివేదికలను భద్రపరిచి సీల్డ్ కవర్‌లో కోర్టుకు ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ నివేదికల కోసం ఎంపీ రఘురామ వెకేషన్ కోర్టు ముందు పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్‌కు సంబంధించి హైకోర్టులో విచారణ జరిగింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు మెడికల్ బోర్డు రిపోర్ట్ ఉందని ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ కౌంటర్ దాఖలు చేశారు. అయితే ఈ కౌంటర్‌పై హైకోర్టు, పిటీషనర్ తరపు న్యాయవాది తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సీఐడీ కోర్టు న్యాయమూర్తి ఆదేశాల మేరకు రఘురామకృష్ణ రాజు కస్టోడియల్ టార్చర్‌పై గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. కార్డియాలజీ, జనరల్ మెడిసిన్, రేడీయాలజీ నివేదికలు ఉన్నాయా లేవా అని ధర్మాసనం ప్రశ్నించింది. నివేదికలు ఉన్నాయని ప్రభుత్వ తరపు న్యాయవాది చెప్పారు. నివేదికలు భధ్ర పరచాలని, ఎట్టిపరిస్థితుల్లో కోర్టుకు సమర్పించాలని హైకోర్టు ధర్మాసనం మరోసారి స్పష్టం చేస్తూ తదుపరి విచారణను వచ్చే వారినికి వాయిదా వేసింది.
గతంలోనే కాల్ డేటాను భద్రపరచాలని హైకోర్టు ఆదేశం
గతంలోనే ఆయన తన కస్టోడియల్ టార్చర్‌పై సీబీఐ విచారణ జరపాలని కోరుతూ ఏపీ హైకోర్టులో ఎంపీ రఘురామకృష్ణంరాజు పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ పై విచారణ ఇంకా పూర్తి కాలేదు. అయితే రఘురామను అదుపులోకి తీసుకున్న సమయంలో కాల్ డేటా ను స్వాధీనం చేసుకొని భద్ర పరచాలని, కాల్ డేటాను వెంటనే సేకరించాలని సీబీఐ కు ఏపీ హైకోర్టు ఆదేశించింది. టెలికం నిబంధనల ప్రకారం రెండు సంవత్సరాలు మాత్రమే కాల్ డేటా ఉంచుతారని రఘురామ తరఫు న్యాయవాది నౌమీన్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేసులో కాల్ డేటా కీలకమని కాల్ డేటాను సేకరించి భద్రపరచాలని సీబీఐని న్యాయస్థానం ఆదేశిస్తూ.. కేసు తదుపరి విచారణను వేసవి సెలవుల అనంతరానికి వాయిదా వేసింది.
పుట్టిన రోజు నాడే రాజద్రోహం కేసులో రఘురామ అరెస్ట్
రెండేళ్ల క్రితం పుట్టిన రోజు నాడు హైదరాబాద్ లోని తన ఇంట్లో రఘురామ ఉన్నసమయంలో సీఐడీ పోలీసులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా రాజద్రోహం కేసులో అరెస్ట్ చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని రాజద్రోహం కేసు పెట్టారు. ఆయనను అరెస్ట్ చేసిన రోజున కస్టడీలో చిత్రహింసలు పెట్టారన్న ఆరోపణలు వచ్చాయి. మొదట గుంటూరు ఆస్పత్రిలో పరీక్షలు చేయించారు. తర్వాత ఆర్మీ ఆస్పత్రిలో పరీక్షలు చేయించారు. గుంటూరు ఆస్పత్రిలో పరీక్షల రిపోర్టులు గాయాలు కాలేదని వచ్చాయి. ఆర్మీ ఆస్పత్రిలో మాత్రం గాయాలయ్యాయని రిపోర్టులు వచ్చాయి. దీంతో ఆయనను కస్టడీలో కొట్టారని రుజువైనట్లయింది.