Rains: మరికొద్ది గంటల్లో తుపానుగా మారనున్న తీవ్ర వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలకు అలర్ట్
Andhra News: తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
Heavy Rains In AP Due To Windstorm: తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఏపీలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఆదివారం మధ్యాహ్నం తమిళనాడులోని కారైకాల్ వద్ద తీరం దాటుతుందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ వాయుగుండం గంటకు 8 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ శుక్రవారం అదే ప్రాంతంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ అధికారి కర్ణసాగర్ తెలిపారు. పెంగల్ తుపాను ప్రస్తుతానికి పుదుచ్చేరికి 270 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి 300 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని పేర్కొన్నారు.
తుపాను వాయువ్య దిశగా పయనించి శనివారం మధ్యాహ్నం ఉత్తర తమిళనాడు - పుదుచ్చేరి దగ్గర, కారైకాల్ - మహాబలిపురం తీరాల మధ్య, పుదుచ్చేరికి సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 90 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
తుపాను ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని శుక్ర, శనివారాల్లో అక్కడక్కడ కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. మిగిలిన చోట్ల ఆదివారం వరకూ విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా తిరుపతి, నెల్లూరు, అన్నమయ్య, సత్యసాయి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మిగతా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంటున్నారు.
తెలంగాణలోనూ వర్షాలు
అటు, తెలంగాణలోనూ కొన్ని ప్రాంతాల్లో శనివారం నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ వానలు కురుస్తాయని స్పష్టం చేసింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదివారం.. కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, పెద్దపల్లి, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్ధిపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది.