(Source: ECI/ABP News/ABP Majha)
ACB Court Case : అక్టోబర్ నాలుగో తేదీకి ఏసీబీ కోర్టులో విచారణలు వాయిదా - కస్టడీ, బెయిల్ పిటిషన్లూ అప్పుడే !
చంద్రబాబు పిటిషన్లపై ఏసీబీ కోర్టులో విచారణలు వచ్చే నెల నాలుగో తేదీన జరగనున్నాయి. పీటీ వారెంట్ పిటిషన్లపైనా అదే రోజు విచారణ జరగనుంది.
ACB Court Case : చంద్రబాబు బెయిల్, సీఐడీ కస్టడీ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో బుధవారం విచారణ జరిగింది. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రమోద్ దూబే, సీఐడీ తరఫున స్పెషల్ పీపీ వివేకానంద తమ వాదనలు వినిపించారు. స్కిల్ కేసులో బెయిల్ కోరుతూ చంద్రబాబు పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ కేసులో చంద్రబాబును మరో ఐదు రోజులు కస్టడీకి ఇవ్వాలని సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను ఏసీబీ కోర్టు అక్టోబర్ 4కు వాయిదా వేసింది. అంతకు ముందు ఐదో తేదీకి వాయిదా వేస్తామని న్యాయమూర్తి చెప్పారు.అయితే ఇప్పుడే వాదనలు వినాలని ఏఏజీ పొన్నవోలు సధాకర్ రెడ్డి పట్టుబట్టడంతో మళ్లీ వాదనలు విన్నారు. తర్వాత నాలుగో తేదీకి వాయిదా వేశారు. చంద్రబాబుపై పెండింగ్‌లో ఉన్న పీటీ వారెంట్‌లపై కూడా అదే రోజు విచారణ జరుపుతామని ఏసీబీ కోర్టు తెలిపింది.
మరో వైపు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో హైకోర్టులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై హైకోర్టులో బుధవారం వాదనలు కొనసాగాయి. నిన్న చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వర్చువల్‌గా వాదనలు వినిపించగా.... ఇవాళ సీఐడీ తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు. అమరావతి రాజధానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్‌రోడ్డు అలైన్‌మెంట్‌లో అక్రమాలు జరిగాయని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గత ఏడాది ఏప్రిల్ 27న ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా సీఐడీ కేసు నమోదుచేసింది. ఈ కేసులో చంద్రబాబును ఏ1గా పేర్కొంది. ఈ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని చంద్రబాబు పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 29కు వాయిదా వేసింది. ఇదే కేసులో ఏ14గా ఉన్న నారా లోకేశ్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు.
అంతకు ముందు సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై విచారమ జరిగింది. ద్విసభ్య ధర్మానసంలో న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌వీఎన్ భట్టి నాట్ బిఫోర్ మి అనడంతో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ను సిద్ధార్థ లూథ్రా సీజేఐ ముందు మెన్షన్ చేశారు. తక్షణమే లిస్టింగ్ చేయాలని కోరారు. చంద్రబాబు బెయిల్ కోరుకుంటున్నారా? అని సీజేఐ ప్రశ్నించారు. తాము బెయిల్ కోరుకోవడం లేదని లూథ్రా తెలిపారు. త్వరగా లిస్ట్ చేయాలన్నది తమ మొదటి అభ్యర్థన అని.. మధ్యంతర ఉపశమనం కలిగించాలని రెండో అభ్యర్థన అని లూథ్రా అన్నారు. 17ఏ అనేది కేసు మూలాల నుంచి చర్చించాల్సిన అంశం అని అన్నారు. ఎఫ్‌ఐఆర్ ప్రకారం చంద్రబాబును కస్టడీలో పెట్టేందుకు అవకాశం లేని కేసు ఇదని చెప్పారు. ట్రయల్ కోర్టు జడ్జిని సంయమనం పాటించాలని చెప్పలేమని అన్నారు. జెడ్ కేటగిరీ, ఎన్‌ఎస్‌జీ సెక్యూరిటీ ఉన్న వ్యక్తిని ఇలా ట్రీట్ చేస్తారా? అని అన్నారు. ఇది పూర్తిగా వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన విషయమని సిద్ధార్థ్ లూథ్రా అన్నారు. చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్‌ను మంగళవారం వింటామని సుప్రీంకోర్టు తెలిపింది.