Chandrababu case : రాజకీయ ర్యాలీల్లో పాల్గొనేందుకు లైన్ క్లియర్ - చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ వాయిదా
Chandrababu case : చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. రాజకీయ ర్యాలీల్లో పాల్గొనకుండా ఆంక్షలు విధించాలన్న సీఐడీ లాయర్ల విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
Chandrababu case : స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ కేసులో ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఏపీసీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ డిసెంబర్ 11వ తేదీకి వాయిదా పడింది. జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ సతీష్ కుమార్ మిశ్రా ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చిన వెంటనే ఈ అంశపై ఇతర బెంచ్ ముందు ఉన్న క్వాష్ పిటిషన్ పై తీర్పు రావాల్సి ఉన్నందున పిటిషన్ పై విచారణ వాయిదా వేస్తామని ధర్మాసనం తెలిపింది. ఈ సమయంలో సీఐడీ తరపు లాయర్లు హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అభ్యంతరాలు ఉన్నాయని వాదనలు వినిపిస్తామన్నారు. ఈ అంశంపై చంద్రబాబుకు నోటీసులు జారీ చేస్తామన్న సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. ఎనిమిదో తేదీ లోపు కౌంటర్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది.
అదే సమయంలో చంద్రబాబు బెయిల్ షరతుల అంశాన్ని సీఐడీ తరపు న్యాయవాదులు ప్రస్తావించారు. ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన సమయంలో పెట్టిన షరతులు పెట్టాలని కోరారు. అయితే స్కిల్ కేసు అంశంపై ఇరు వర్గాలు బహిరంగ ప్రకటనలు చేయవద్దని స్పష్టం చేసింది. అదే సమయంలో నవంబర్ మూడో తేదీన హైకోర్టు పెట్టిన బెయిల్ షరతుల్లో రాజకీయ ర్యాలీలు, సభల్లో పాల్గొనకూడదన్న అంశం మినహా మిగిలిన షరతులు వర్తిస్తాయని తెలిపారు. ఎనిమిదో తేదీ లోపు చంద్రబాబును కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించిన సుప్రీంకోర్టు.. తదుపరి విచారణను పదకొండో తేదీకి వాయిదా వేసింది.. ఇరు పక్షాలూ స్కిల్ డెవలప్ మెంట్ కేసు గురించి బహిరంగంగా వ్యాఖ్యానాలు చేయరాదని సుప్రీంకోర్టు సూచించింది.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజమహేంద్రవరం జైలులో 52 రోజులపాటు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అనంతరం చంద్రబాబు నాయుడు అరోగ్య కారణాలతో మధ్యంతర బెయిల్‌పై విడుదలయ్యారు. తర్వాత చంద్రబాబుక రెగ్యులర్ బెయిల్ మంజూరు అయ్యింది. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఒక్క సాక్ష్యం చూపించలేకపోయారని హైకోర్టు స్పష్టం చేసింది. చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేసింది. హైకోర్టు తీర్పును రద్దు చేయాలని కోరుతూ స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. చంద్రబాబుకు బెయిల్ మంజూరులోతమ వాదనలు హైకోర్టు ఏమాత్రం పరిగణనలోకి తీసుకోలేదని పిటిషన్‌లో సీఐడీ పేర్కొంది. హైకోర్టు తన పరిధి దాటి తీర్పులో ఏపీ ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేసిందని సీఐడీ పిటిషన్‌లో ఆరోపించింది.
2021 డిసెంబర్ 9న స్కిల్ కేసు నమోదు చేశారు. 2023 సెప్టెంబర్ 9న చంద్రబాబును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో చంద్రబాబును A37గా సీఐడీ చేర్చింది. 17ఏ వర్తింపుపై చంద్రబాబు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ అత్యంత కీలకంగా మారింది. ఆ పిటిషన్ పై వచ్చే తీర్పును బట్టే చంద్రబాబుపై కేసుల అంశం తేలే అవకాశం ఉంది. 30వ తేదీలోపు వస్తుందని అనుకుంటున్నారు. కానీ స్పష్టత లేదు.