Guntur News : వృద్ధురాలి భూమి కొట్టేసిన అధికార పార్టీ నేతలు, పోలీసుల చుట్టూ తిరుగుతున్న బామ్మ!
Guntur News : గుంటూరు జిల్లా తెనాలికి చెందిన అధికార పార్టీ నేత తన భూమి కబ్జా చేశాడని ఓ వృద్ధురాలు పోలీసు స్టేషన్ చుట్టూ తిరుగుతోంది. స్పందనలో ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని ఆరోపిస్తుంది.
Guntur News : గుంటూరు జిల్లా తాడేపల్లి మహానాడులో అధికార పార్టీ నాయకులు బాలసాని, అనిల్ తన స్థలాన్ని కబ్జా చేశారని వృద్ధురాలు వెంకట సుబ్బమ్మ కన్నీటి పర్యంతం అయ్యారు. తెనాలికి చెందిన వృద్ధురాలు ఇక్కడ కొంత భూమిని కొన్నారు. ఇటీవల తన స్థలంలో ఇల్లు కట్టు కొనేందుకు రాగా ఆ స్థలాన్ని ఆక్రమించి అధికార పార్టీ నాయకుని అనుచరులు దౌర్జన్యానికి దిగారని ఆవేదన వ్యక్తం చేసింది. స్థలంలోకి అడుగు పెడితే చంపేస్తామని బెదిరించారని కన్నీటి పర్యంతం అయింది. భూ కబ్జాకు పాల్పడిన నాయకుడికి అధికార పార్టీ నేతల అండదండలు ఉన్నాయని ఆరోపించింది వృద్దురాలు. తన స్థలాన్నీ ఆక్రమించి భూకబ్జాకు పాల్పడిన నాయకుడు, అతని అనుచరులపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ, తాడేపల్లి పోలీసులను ఆశ్రయించానని ఆమె తెలిపారు. ఇంత వరకు తనకు న్యాయం జరగలేదని వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా ఇదే తరహాలో భూకబ్జాకు పార్టీ నాయకుడు, అతని అనుచరగణం పాల్పడుతూ, బెదిరిస్తున్నారని స్థానికులు సహితం ఆరోపిస్తున్నారు.
"నేను 23 గజాలు కొనుకున్నాను. స్థలం వద్దకు వెళ్లి చూస్తే బాలసాని, అనిల్ అది తమ స్థలమని నన్ను బెదిరించారు. స్పందనలో ఫిర్యాదు చేశాను, సీఐ, ఎస్పీలకు కూడా చెప్పుకున్నాను. కానీ ఎవరూ పట్టించుకోవడంలేదు. వైసీపీ పార్టీ నేతలని ఎవరూ పట్టించుకోవడంలేదు. స్థలం చుట్టూ కంచె వేశాను. నా భూమిని ఆక్రమించుకుని నన్ను బెదిరిస్తున్నారు. స్థలం మాదేనని వాధిస్తున్నారు. చాలా రోజులుగా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నాను. ఎవరూ పట్టించుకోవడంలేదు. నాకు న్యాయం చేయండి" బాధితురాలు వెంకట సుబ్బమ్మ.
కొండను మింగేసిన అధికార పార్టీ నేత : టీడీపీ ఆరోపణలు
శ్రీకాకుళం జిల్లా మందస మండలం బహాడపల్లి పంచాయతీ, నల్ల బొడ్లూరు గ్రామం సమీపంలో ఉన్న 9 ఎకరాలు కంకర కొండను ఎటువంటి అనుమతులు లేకుండా అధికార పార్టీకి చెందిన స్థానిక నాయకులు అక్రమ తవ్వకాలు జరిపి అమ్ముకున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష ఆరోపించారు. గత సంవత్సరం మందస మండల తహసీల్దార్ బి.పాపారావు, మైన్స్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఆ కొండపై ఉద్దానం మంచినీటి పథకానికి సంబంధించిన తాగునీటి ట్యాంకు ఉంది. గత సంవత్సర కాలంగా స్థానిక అధికారులకు సమాచారం అడిగిన ఇవ్వని కారణంగా ఆర్టీఐ ద్వారా సమాచారం తీసుకుని ప్రజలకు తెలియజేస్తామని గౌతు శిరీష అన్నారు. ఈ సమయంలో స్థానికులు పెద్ద ఎత్తున అక్కడ ఉన్న టీడీపీ నాయకులకు, కార్యకర్తలను అడ్డుకున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.