Guntur News : తొక్కిసలాట మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల పరిహారం, ఉయ్యూరు ఫౌండేషన్ ప్రకటన
Guntur News : గుంటూరు తొక్కిసలాటపై ఉయ్యూరు ఫౌండేషన్ నిర్వాహకులు స్పందించారు. ఈ దుర్ఘటన పూర్తి బాధ్యత వహిస్తున్నామన్నారు. బాధిత కుటుంబాలకు రూ.20 లక్షల ఆర్థిక సాయం అందిస్తామన్నారు.
Guntur News : నూతన సంవత్సర సందర్భంగా పేదప్రజలకు సాయం చేయాలనే ఉద్దేశంతో గుంటూరులో ఉయ్యూరు ఫౌండేషన్ జనతా వస్త్రాలు, నిత్యావసరాల పంపిణీ చేయాలని తలపెట్టింది. అయితే ఈ కార్యక్రమంలో విషాద ఘటన చోటుచేసుకుంది. తొక్కిసలాట జరిగి ముగ్గురు మృతిచెందారు. పలువురు గాయపడ్డారు. గత ఏడాది కాలంగా గుంటూరులో రెండు, హిందూపూర్ లో ఒకటి అన్న క్యాంటీన్ ను ఉయ్యూరు ఫౌండేషన్ నిర్వహిస్తుంది. అదే క్రమంలో పేద ప్రజల కోసం ఏదైనా చేయాలనే ఉద్దేశంతో నిత్యావసరాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. తమ సంస్థ ఆహ్వానాన్ని మన్నించి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వచ్చి పేదలకు శుభాకాంక్షలు చెప్పి వెళ్లిపోయారన్నారు.
బాధితులకు ఆర్థిక సాయం
చంద్రబాబు వెళ్లిపోయిన అనంతరం పేదలకు జనతా వస్త్రాలు, నిత్యావసరాలు పంపిణీ ప్రారంభించామని ఉయ్యూరు ఫౌండేషన్ నిర్వాహకులు తెలిపారు. నిబంధనల మేరకు అన్నిరకాల అనుమతులు తీసుకొని ఎవరికీ అసౌకర్యం కలగని రీతిలో ఏర్పాట్లు చేశామన్నారు. అయితే ముందుగా టోకెన్ లు జారీ చేసిన వారికంటే అదనంగా ప్రజానీకం ఒక్కసారిగా లోపలకు రావటంతో ఈ అపశృతి చోటుచేసుకుందని తెలిపారు. ఈ దుర్ఘటనకు పూర్తి నైతిక బాధ్యత ఉయ్యూరు ఫౌండేషన్ వహిస్తుందన్నారు. ఈ ఘటనలో మరణించిన వారికి ఫౌండేషన్ తరపున సంతాపం తెలియజేస్తూ, ఒక్కొక్కరికి రూ.20 లక్షలు ఆర్థిక సహాయం అందజేస్తామన్నారు. గాయపడిన వారికి కూడా ఫౌండేషన్ అన్నీ విధాల అండగా ఉంటుందన్నారు.
ప్రమాద స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
గుంటూరు తొక్కిసలాట ప్రాంతాన్ని కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు. క్యూలో జనాన్ని ఎక్కువ సేపు నిలబెట్టడంతో సభలో తొక్కిసలాట జరిగిందని జిల్లా ఎస్పీ తెలిపారు. ప్రమాద స్థలిని కలెక్టర్‌తో కలిసి పరిశీలించిన ఎస్పీ అనంతరం మీడియాతో మాట్లాడారు. జనం ఒక్కసారి తోసుకుని వచ్చి బారికేడ్డుపై పడడంతో ప్రమాదం జరిగిందన్నారు. తొక్కిసలాటలో పోలీసులు నిర్లక్ష్యం ఏం లేదన్నారు. సరిపడా బందోబస్తు కల్పించామన్నారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వాహకులకు చెప్పామన్నారు. ఫస్ట్ కౌంటర్ వద్దే తొక్కిసలాట జరిగింది. క్యూలో ఎక్కువసేపు నిలబెట్టడం ఈ ప్రమాదానికి ప్రథమ కారణం అన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించామన్నారు.
విచారణకు ఆదేశం
గుంటూరు తొక్కిసలాట ఘటనపై హోంమంత్రి తానేటి వనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మరణించిన వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు. తొక్కిసలాట ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు హోంమంత్రి వనిత.
సీఎం జగన్ దిగ్భ్రాంతి
గుంటూరులో జరిగిన తొక్కిసలాట దుర్ఘటనపై ముఖ్యమంత్రి జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో పలువురు మరణించడం తనను కలచివేసిందన్నారు. గాయపడ్డవారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. సీఎం జగన్ ఆదేశాలతో కలెక్టర్, ఎస్పీ సంఘటనా స్థలిని పరిశీలించారు. బాధితులకు సహాయచర్యలపై ఆరా తీశారు. ఘటన జరిగిన తీరుపై ఎస్పీ ఆరా తీస్తున్నారు.