Telangana News: ప్రస్తుతానికి తెలంగాణ పార్టీ ప్రక్షాళనే- మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో లేనట్టే!
Telangana News: తెలంగాణ మంత్రి పదవుల కోసం ఎదురు చూస్తున్న వాళ్లు మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు. ప్రస్తుతానికి పార్టీ పదవుల భర్తీ కోసం కసరత్తు జరుగుతోంది.

Telangana News: తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ వాయిదా పడుతూనే ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాదిన్నర అవుతున్నా ఇంత వరకు ఖాళీగా ఉన్న మంత్రిత్వశాఖలను ఫిల్ చేయలేదు. వాటి కోసం ఎంతో మంది ఆశావాహులు ఎదురు చూస్తున్నారు. ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని ప్రచారం నడుస్తోంది. కానీ ఆ ఒక్కటి తప్ప అన్నట్టు ఆయన తిరిగి వస్తున్నారు.
ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీలో అసంతృప్త స్వరాలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను బహిరంగానే వ్యతిరేస్తున్న వారు ఎక్కువవుతున్నారు. అందుకే రెండు రోజుల క్రితం సీఎల్పీ సమావేశమైంది. గీత దాటొద్దని అధిష్ఠానం వారికి సూచనలు చేశారు. లోకల్ బాడీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని పార్టీ బలోపేతానికి కృషి చేయాలని దిశానిర్దేశం చేసింది.
తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ చేపట్టినందుకు రెండు భారీ బహిరంగ సభలు నిర్వహించాలని కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి ముక్య అతిథులుగా రాహుల్ గాంధీ, ఖర్గేను పిలవాలని నిర్ణయించారు. దీనిపై చర్చించేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు మంత్రివర్గ సహచరులు, పార్టీ ముఖ్య నేతలు ఢిల్లీ బాట పట్టారు.
ముఖ్యులంతా ఢిల్లీకి వెళ్లడంతో ఈసారి కచ్చితంగా మంత్రివర్గ విస్తరణ ఉంటుందని అంతా భావించారు. ఆశావాహులు ఎంతో ఆశగా తమ మంత్రి అయ్యే భాగ్యం దక్కుతుందని ఎదురు చూశారు. కానీ అలాంటిదేమీ లేదని రేవంత్ రెడ్డి చెప్పేశారు.
మంత్రివర్గ విస్తరణ బంతి హైమాండ్ కోర్టులో ఉందని రేవంత్ రెడ్డి తేల్చేశారు. ఎవర్ని తీసుకోవాలని, ఎవరితో ప్రమాణం చేయించాలనే విషయాలను అధినాయకత్వమే చూసుకుంటుందని అన్నారు. ఇందులో తన జోక్యం ఉండబోదని క్లారిటీ ఇచ్చేశారు. ఈ వ్యక్తిని తీసుకోవాలని తాను ఎవరి పేరు సిఫార్సు చేయలేదన్నారు. పార్టీ అప్పగించిన పని పూర్తి చేయడమే తన కర్తవ్యమని తెలిపారు.
మంత్రివర్గ విస్తరణ లేకపోయినా పార్టీ పదవులను భర్తీకి మాత్రం గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు తెలుస్తోంది. పీసీసీ చీఫ్‌గా మహేష్‌కుమార్‌ను నియమించిన పూర్తి స్థాయి కార్యవర్గం మాత్రం ఇంత వరకు నియమించలేదు. లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్న వేళ పార్టీలో ఖాళీలను పూర్తి స్థాయిలో భర్తీ చేయాలని చూస్తోంది అధిష్ఠానం.
బీసీల జపం చేస్తున్న కాంగ్రెస్ పార్టీలో కూడా అది స్పష్టంగా కనిపించాలని చూస్తున్నారు. అందుకే ఈసారి పీసీసీ కార్యవర్గంలోకి నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్‌లను తీసుకోవాలని భావిస్తున్నారు. పీసీసీ చీఫ్ బీసీ వ్యక్తి ఉన్నందున మిగతా పోస్టుల్లో ఇతర సామాజిక వర్గానికి చెందిన నేతలను నియమించనున్నారు.





















