Ippatam Politics : ఇప్పటం చుట్టూ ఏపీ రాజకీయాలు, పవన్ ప్రకటించిన ఆర్థిక సాయం వద్దంటూ బ్యానర్లు!
Ippatam Politics : ఏపీలో ఇప్పటం గ్రామం చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. తాజాగా పవన్ ప్రకటించిన ఆర్థిక సాయం వద్దంటూ గ్రామంలో బ్యానర్లు వెలిశాయి.
Ippatam Politics : జనసేనాని పవన్ కల్యాణ్ సభ తరువాత ఫేమస్ అయిన ఇప్పటం గ్రామం చుట్టూ ఏపీ రాజకీయాలు తిరుగుతున్నాయి. దీంతో గ్రామస్తులపై రాజకీయ ఒత్తిడి పెరగడంతో పవన్ ప్రకటించిన ఆర్థిక సాయం వద్దంటూ కొందరు ఏకంగా బ్యానర్లను ప్రదర్శిస్తున్నారు.
ఇప్పటంపై పట్టు కోసం
ఇప్పటం గ్రామంలో రహదారి విస్తరణ పేరిట ఇళ్లు కూల్చివేత వ్యవహారం తరువాత రాజకీయం ఆసక్తిగా మారింది. ఎవరికి వారు తమ ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నారు. దీంతో గ్రామస్తులపై ఒత్తిడి పెరిగిపోయింది. జనసేన అధినేత పవన్ గ్రామంలో పర్యటించి స్థానికంగా నష్టపోయిన బాధితులకు లక్ష రూపాయలు ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. దీంతో పొలిటికల్ హీట్ మరింత పెరిగిపోయింది. ఒక్కసారిగా మారిన రాజకీయంతో అధికార పక్షం దూకుడు మరింతగా పెంచింది. పవన్ ఇస్తానని ప్రకటించిన ఆర్థిక సాయాన్ని నిరాకరిస్తున్నట్లు కొందరు పరోక్షంగా తమ ఇళ్ల ముందు బ్యానర్లను ప్రదర్శించారు. గ్రామంలో రాజకీయం వద్దని సూచించారు. మీ పరిహారం మాకొద్దని బ్యానర్లపై రాశారు. ఇప్పటం గ్రామం వరుసగా వార్తల్లో కి ఎక్కటం, గ్రామంలో రాజకీయ పార్టీలన్నీ పోటా పోటీగా తమ ఆర్భాటాలను ప్రదర్శించుకునే ప్రయత్నం చేయటంతో గ్రామస్తులు వాటిని ఎదుర్కొనేందుకు ఇలాంటి చర్యలు చేపట్టారని అంటున్నారు.
సభ తరువాత 50 లక్షలకు కూడా ఆటంకమే
జనసేన ఆవిర్భావ సభ తరువాత సభాస్థలికి భూమిచ్చిన రైతులకు ధన్యవాదాలు తెలుపుతూ, ఇప్పటం గ్రామానికి 50 లక్షల రూపాయలు విరాళాన్ని అందించారు పవన్ కల్యాణ్. అయితే అవి కూడా గ్రామానికి ఇంకా అందలేదు. పవన్ ఇచ్చే విరాళాన్ని ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలని ఆదేశాలు వచ్చాయని, స్థానిక మున్సిపల్ అధికారులు చెప్పటంతో గ్రామస్తులు అందుకు అంగీకరించలేదు. దీంతో గ్రామంలోని పెద్దలంతా కలసి కమిటీగా ఏర్పడి, పవన్ ఇచ్చే 50 లక్షల రూపాయలతో గ్రామంలో అవసరమైన వాటికి నిధులు ఖర్చు చేసుకోవాలని తీర్మానించారు. అయితే ఇందుకు వైసీపీ నేతలు సహకరించలేదు. దీంతో అది కాస్త ఇప్పటికీ పెండింగ్ లో పడింది. ఇప్పుడు ఇళ్ల తొలగింపుతో నష్టపోయిన బాధితులను పవన్ లక్ష రూపాయలు పరిహారం ప్రకటించారు. అదే సమయంలో బాధితులను గుర్తించి వారికి జనసేన కార్యాలయం నుంచి సమాచారాన్ని అందించారు. దీంతో గ్రామంలో జనసేన నాయకులు పవన్ చిత్రపటానికి పాలతో అభిషేకం చేశారు.
అకస్మాత్తుగా బ్యానర్ల ప్రదర్శన
ఇప్పటికే రాజకీయంగా ఇప్పటం గ్రామం హైలైట్ కావటంతో గ్రామంలో కొందరికి ఇబ్బందిగా మారింది. దీంతో ప్రభుత్వం తమ ఇంటిని కూల్చలేదని, మీ ఎవ్వరి సానుభూతి తమకు అవసరం లేదని, డబ్బులు ఇచ్చి అబద్దాన్ని నిజం చేయాలని ప్రయత్నించవద్దంటూ కొన్ని ఇళ్ల ముందు బ్యానర్లను ప్రదర్శించారు. అయితే దీని వెనక వైసీపీ నేతల ప్రమేయం ఉందనే ప్రచారం కూడా ఉంది. పవన్ ఇస్తానంటున్న ఆర్థిక సహాయాన్ని అడ్డుకునే క్రమంలో రాజకీయంగా పై చేయి సాధించాలనే ఉద్దేశంతోనే ఇలాంటి బ్యానర్లను ఏర్పాటు చేశారని ఆరోపణలు వస్తున్నాయి. మరో వైపు ఇప్పటం గ్రామం కేంద్రంగా జరుగుతున్న రాజకీయం కేవలం, గ్రామానికి మాత్రమే పరిమితం కావటం లేదు. మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న ఇప్పటం గ్రామంపై పట్టుకోసమే రాజకీయంగా జనసేన, వైసీపీ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మరో వైపున టీడీపీ నేత నారా లోకేశ్ మంగళగిరి నియోజకవర్గం నుంచే పోటీకి సిద్ధమవుతున్న వేళ ఏ అవకాశం దక్కినా వదలుకోకుండా రాజకీయ పార్టీలు చక్రం తిప్పుతున్నాయి.