Guntur News : పెదకాకాని మల్లేశ్వరస్వామి ఆలయంలో అపచారం, క్యాంటీన్ లో మాంసాహారం కలకలం!
Guntur News : గుంటూరు జిల్లా పెదకాకాని మల్లేశ్వరస్వామి ఆలయం క్యాంటీన్ మాంసాహారం వండిన ఘటన కలకలం రేపుతోంది. దీంతో అధికారులు రంగంలోకి దిగి క్యాంటీన్ సీజ్ చేశారు.
Guntur News : గుంటూరు జిల్లా పెదకాకాని మల్లేశ్వరస్వామి శివాలయం క్యాంటీన్‌లో మాంసాహారం వండిన ఘటనపై అధికారులు చర్యలు చేపట్టారు. క్యాంటీన్‌ను దేవాదాయశాఖ అధికారులు సీజ్ చేశారు. ఆలయ క్యాంటీన్‌ను సీజ్ చేశామని నిర్వాహకుల లైసెన్స్‌ను రద్దు చేశామని దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ ఈమని చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. ఈ ఘటనపై విమర్శలు వచ్చిన నేపథ్యంలో మీడియాతో ఆయన మాట్లాడారు. మాంసాహారాన్ని బయటే వండినట్లు దానికి సంబంధించిన వాహనం ఆలయ ప్రాంగణంలోకి వచ్చినట్లు నిర్వాహకులు చెప్పారని చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. ఈ ఘటనపై గురువారం నిర్వాహకులకు షోకాజ్ నోటీసు ఇచ్చామన్నారు. దీనిపై ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని తెలిపారు. నిర్వాహకుల వివరణ రాగానే తదుపరి చర్యలు చేపడతామన్నారు.
హిందూ ధార్మిక సంఘాల ఆందోళన
గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయా? అనే అంశంపైనా విచారిస్తామని దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ తెలిపారు. ఇతర మతస్థులు క్యాంటీన్ నిర్వహణ చేస్తున్నట్లు తమకు తెలియదని ఈమని చంద్రశేఖర్‌రెడ్డి చెప్పారు. మరోవైపు ఈ ఘటనపై హిందూ ధార్మిక సంఘాలు ఆందోళనకు దిగాయి. ఈవో కార్యాలయం వద్ద హిందూ సంఘాల నేతలు బైఠాయించి నిరసన తెలిపారు. ఆలయ పవిత్రను దెబ్బతీసే కార్యకలాపాలు సాగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని నిలదీశారు. క్యాంటీన్ టెండర్ల దశ నుంచే అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఆలయ క్యాంటీన్‌లో మాంసాహారం వండిన ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని నేతలు డిమాండ్ చేశారు. ఆలయాన్ని పసుపు నీళ్లతో శుద్ధి చేశారు.
అసలేం జరిగిందంటే?
పెదకాకాని మల్లేశ్వరస్వామి ఆలయానికి నిత్యం వచ్చే భక్తులకు అల్పాహారం, అన్నదానానికి భోజనాన్ని అక్కడి క్యాంటీన్ నుంచే సరఫరా చేస్తారు. అదే క్యాంటీన్‌లో కోడి మాంసం వండటం విమర్శలకు తావిచ్చింది. ఇటీవలే ఓ వ్యక్తి వేలం పాటలో ఈ హోటల్‌ను దక్కించుకున్నారు. ఆయన దగ్గర నుంచి అధికార పార్టీకి చెందిన స్థానిక ఎంపీటీసీ భర్త లీజుకు తీసుకుని హోటల్ నడుపుతున్నారు. భక్తులకు ఆహార పదార్థాలు తయారు చేయడమే కాక బయట వారికి ఆర్డర్లపై క్యాటరింగ్ నిర్వహిస్తున్నారు. గురువారం మధ్యాహ్నం క్యాంటీన్ ముందు రిక్షాపై అన్నం, కూరల పాత్రలతో పాటు మాంసం కూర కూడా కనిపించడంతో భక్తులు గమనించి ఫొటోలు తీశారు. ఈ విషయం చర్చనీయాంశం అయింది. ఈ ఘటనపై విమర్శలు రావడంతో అధికారులు క్యాంటీన్‌ను సీజ్ చేశారు.
Also Read : CM Jagan : చంద్రబాబు, పవన్ నా వెంట్రుక కూడా పీకలేరు : సీఎం జగన్