Gorantla Butchaiah: మంత్రి పదవి ఆశించా, గోరంట్ల బుచ్చయ్య షాకింగ్ కామెంట్స్ - స్పీకర్ పదవి వచ్చేనా?
Gorantla Responded : ఈ సారి చంద్రబాబు కేబినెట్లో మంత్రి పదవి దక్కుతుందని ఆశించినట్లు టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. స్పీకర్ పదవి ఇస్తారా లేదా అన్నది వారి ఇష్టమన్నారు.
Gorantla Responded on Minister Post : ఆయనో టీడీపీ సీనియర్ నేత. రాజకీయ విపక్షాలకు సైతం చుక్కలు చూపించగలిగే సమర్థుడు అతడు. ఆయనే రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన నాయకుల్లో చెప్పుకోదగిన వారు. 1983 నుంచి వరుసగా ఏడు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధిస్తున్న ఆయనకు మంత్రి పదవి ఇప్పటి వరకు తీరని కలగానే మిగిలిపోయింది. 2019 ఎన్నికల్లో జగన్ ప్రభంజనం గురించి తెలిసిందే. ఆ సమయంలో కూడా తట్టుకుని మరీ ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నారు. నాలుగు సార్లు రాజమండ్రి సిటీ నుంచి ప్రస్తుతం రాజమండ్రి రూరల్ నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఉమ్మడి రాష్ట్ర మంత్రి వర్గంలో పౌరసరఫరాల శాఖ మంత్రిగా పని చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేసిన 50 వేలకు పైగా భారీ మెజార్టీతో గెలిచారు. దీంతో గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఈసారి చంద్రబాబు కేబినెట్లో మంత్రి పదవి దక్కడం ఖాయమని అంతా భావించారు.
స్పీకర్ పదవి వచ్చేనా ?
వారు అనుకున్నది జరగలేదు. పార్టీకి నమ్మకమైన నేతగా పేరుగాంచిన గోరంట్ల బుచ్చయ్య చౌదరిని ఈ సారి కూడా పక్కన పెట్టారు. ఆయన తనకు ఇదే చివరి ఎన్నిక అని ఎన్నికల ప్రచారంలో పదే పదే చెబుతూ వచ్చారు. అయినప్పటికి చంద్రబాబు తన మంత్రివర్గంలో గోరంట్లకు చోటు కల్పించలేదు. మంత్రి పదవి దక్కకపోవడంపై తాజాగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 40ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా.. ఏ పదవి లేకున్నా ప్రజాసేవ చేశానంటూ తెలిపారు. పొత్తులతో కలిసి పోటీ చేసినప్పుడు ఎన్నో లెక్కలు ఉంటాయని ఆయన తెలిపారు. కాకపోతే ఈ సారి కచ్చితంగా మంత్రి పదవి వస్తుందని ఆశించానని కానీ.. ఇవ్వడం, ఇవ్వకపోవడం వాళ్ల ఇష్టమన్నారు. మంత్రి పదవి రానందుకు తనకేమీ బాధ లేదన్నారు. మరి అసెంబ్లీ స్పీకర్ పోస్ట్ ఇస్తారా..? మరేదైనా ఇస్తారా..? అన్నది అధిష్టానం ఇష్టమన్నారు. బుచ్చయ్య చౌదరికి ఈసారి స్పీకర్ పదవి దక్కే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది.
ఆయన గెలుపు ఆసాధారణం
ఈ సారి ఎన్నికల్లో గోరంట్ల గెలుపు అసాధారణమైనది. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఆయనకు కులం, స్థాన బలం లేదు. అలాంటి చోట ఆయన గెలిచారు. తూర్పు గోదావరి జిల్లాలో కమ్మ సామాజికవర్గం తక్కువగా ఉంటుంది. అక్కడ కాపు, శెట్టి బలిజ, ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఎక్కువ. అయినా ఆయన అక్కడ ఏడుసార్లుగా గెలుస్తూ వస్తున్నారు. గోరంట్ల ఎన్టీఆర్ మంత్రివర్గంలో పనిచేశారు. ఆ తర్వాత ఆయన గెలిచినా, టీడీపీ అధికారంలోకి వచ్చినా ఆయనకు మంత్రపదవి దక్కలేదు. ఇందుకు ప్రధానమైన కారణం ఆయన సామాజికవర్గమే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ సారి తన సీనియారిటీ, సిన్సియారిటీని దృష్టిలో పెట్టుకుని తనకు అసెంబ్లీ స్పీకర్ పదవి దక్కవచ్చని పలువురు భావిస్తున్నారు.