Ganta Comments : లోకేష్ పాదయాత్ర సెన్సేషనల్ హిట్ అవుతుందన్న గంటా - టీడీపీలోనే ఇక ఫిక్స్ !
లోకేష్ పాదయాత్ర హిట్ అవుతుందని గంటా శ్రీనివాసరావు అభిప్రాయం వ్యక్తం చేశారు. టీడీపీ విజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు.
Ganta Comments : నారా లోకేష్ ప్రారంభిస్తున్న యువగళం పాదయాత్ర సెన్సేషనల్ హిట్ అవుతుందని గంటా శ్రీనివాసరావు జోస్యం చెప్పారు. లోకేష్ పాదయాత్ర ఈ నెల 27 నుంచి ప్రారంభం అవుతుందని.. 400 రోజులు..4 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేయనున్నారని గంటా శ్రీనివాస్ తెలిపారు. 175 నియోజక వర్గాల్లో అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. దేశానికి యువత వెన్నుముక..అలాంటి యువత రాష్ట్రంలో ఎన్నో ఇబ్బందులు పడుతోందని .. అందుకే లోకేష్ పాదయాత్ర చేస్తున్నారని.. ఈ పాదయాత్ర విజయవంతం కావాలని కోరుకుంటున్నామని గంటా శ్రీనివాస్ తెలిపారు. విశాఖ టీడీపీ ఆఫీసులో జరిగిన ఎన్టీఆర్ వర్థంతి కార్యక్రమంలో గంటా శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఎన్టీఆర్ అనే మూడు అక్షరాలు ఇక వైబ్రేషన్ అని.. పార్టీని స్థాపించి 9 నెలలులోనే అధికారంలోకి వచ్చిన ఘనత ఎన్టీఆర్ దన్నారు. తెలుగు నేలపై ఎన్టీఆర్ ది చెరగని సంతకం ..తెలుగువారి ఆత్మ గౌరవాన్ని దేశవ్యాప్తంగా చాటి చెప్పిన మహా వ్యక్తి ఎన్టీఆర్ అని ప్రశంసించారు. నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి...జాతీయ రాజకీయాల్లో ఎన్టీఆర్ కీలక పాత్ర పోషించారన్నారు. పరిపాలన పరంగా ఎన్నో సంస్కరణలు తెచ్చిన ఘనత ఎన్టీఆర్ దేనని.. రాబోయే రోజుల్లో టిడిపి ఘన విజయాలు సాధిస్తుంది ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ వర్థంతి కార్యక్రమంలో విశాఖ జిల్లా టీడీపీ ముఖ్య నేతలందరూ పాల్గొన్నారు.
గంటా శ్రీనివాసరావు చాలా కాలంగా టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అసెంబ్లీ సమావేశాలకూ హాజరు కావడం లేదు. ఈ కారణంగా పలుమార్లు ఆయన పార్టీ మారుతారన్న ప్రచారం జరిగింది. అయితే ఇటీవల టీ డీపీ నేత నారా లోకేష్ తో భేటీ అయ్యారు. ఈ ఇద్దరు సుమారు 40 నిమిషాల పాటు చర్చించుకున్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయిన తర్వాత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. పార్టీ కార్యక్రమాలకు రావాలని అధిష్టానం కోరిన ఆయన హాజరుకాలేదు. పార్టీ సభ్యత్వ విషయంతో పాటూ కమిటీల ఏర్పాటుపై గంటా శ్రద్ధ పెట్టలేదనే విమర్శలు ఉన్నాయి. లోకేష్ తో జరిగిన సమావేశంలో తాను ఎందుకు పార్టీకి దూరంగా ఉండాల్సి వచ్చింది... తదితర అంశాలను కు వివరించినట్లు సమాచారం.
గంటాపై టీడీపీ అధిష్టానం వైఖరి ఎలా ఉంటుంది. ఆయన భవిష్యత్తు కార్యాచరణపై ఏమిటనేది కూడా తేలాల్సి ఉంది. ఈ రోజు సమావేశంలో కొంత స్పష్టత వచ్చిందని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. ఇక నుంచి పార్టీ కార్యక్రమాల్లో గంటా పాల్గొంటారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.2019 ఎన్నికల తర్వాత పార్టీలో గంటా క్రియాశీలకంగా లేరు. అయితే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు. 2019లో భీమిలి నియోజకవర్గాన్ని వీడి విశాఖ నార్త్ నుంచి పోటీ చేసి గెలిచారు. ఎన్నికల ఫలితాలు వెల్లడైన నాటి నుంచి ఆయన టీడీపీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. 2019లో భీమిలి నియోజకవర్గాన్ని వీడి విశాఖ నార్త్ నుంచి పోటీ చేసి గెలిచారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యే పదవికి గంటా రాజీనామా చేశారు.