Ganta Srinivas : అమరావతి రాజధానికే మద్దతు - ఉత్తరాంధ్రకు ఏం చేశారో చెప్పాలన్న గంటా శ్రీనివాస్
Andhra : ఉత్తరాంధ్రకు సీఎం జగన్ ఏం చేశారో చెప్పాలని గంటా శ్రీనివాస్ డిమాండ్ చేశారు. అమరావతే రాజధాని అని కేంద్రం చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నట్లుగా ప్రకటించారు.
Ganta Srinivas On Amaravati : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయడాన్ని తాను స్వాగతిస్తున్నట్లు మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. కేంద్రం అభివృద్ధి చేయదలుచుకున్న రాజధానుల మాస్టర్ ప్లాన్‌లో అమరావతి పేరు ఉండటం శుభపరిణామం అని అన్నారు. ఈ మేరకు మంగళవారం ట్వీట్ చేశారు. అమరావతే ఆంధ్రప్రదేశ్ రాజధాని అని కేంద్రం మరోమారు స్పష్టం చేసిందని.. ఇకనైనా మీ కళ్లు తెరవండి జగన్ మోహన్ రెడ్డి అంటూ ట్వీట్ చేశారు.
హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం కార్యాలయాల మార్పు కుదరదని స్పష్టం చేసినా...న్యాయస్థానం ఆదేశాలను పట్టించుకోకుండా ఉత్తరాంధ్ర అభివృద్ధి పర్యవేక్షణను కారణంగా చూపుతూ క్యాంపు కార్యాలయాల పేరుతో విశాఖకు ప్రభుత్వ కార్యాలయాలను తరలించవలసిన అవసరం ఏమొచ్చింది అని మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు ప్రశ్నించారు. చట్టపరంగా సాధ్యం కాదని తేలడంతో దొడ్డిదారి మార్గాలను ఎంచుకున్నారంటూ తీవ్రంగా మండిపడ్డారు. అమరావతి రైతులను ఇబ్బంది పెడుతూ ఏమి సాధించాలని అనుకుంటున్నారని సీఎం వైఎస్ జగన్‌ను మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు నిలదీశారు.
అమరావతే ఆంధ్రప్రదేశ్ రాజధాని అని కేంద్రం మరోసారి స్పష్టంగా చెప్పింది..
— Ganta Srinivasa Rao (@Ganta_Srinivasa) December 5, 2023
ఇప్పటికైనా మీ కళ్లు తెరవండి జగన్మోహన్ రెడ్డి గారు...?
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతేనని దేశంలోని 28 రాష్ట్రాలకు గానూ 26 రాష్ట్రాల రాజధానులకు ఆమోదించిన మాస్టర్ ప్లాన్ లు ఉన్నాయని.
ఇలా ఆమోదం పొందిన వాటిలో ఏపీ…
విశాఖలో రుషికొండను బోడిగుండుగా మార్చి సర్వనాశనం చేశారు అని మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు ఆరోపించారు. రుషికొండపై దాదాపు 500 కోట్ల రూపాయలు సీఎం కార్యాలయానికి వెచ్చించారని మండిపడ్డారు. మీకు ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం నిజంగా గుర్తుంటే... ఈ నాలుగున్నరేళ్లలో ఉత్తరాంధ్ర అభివృద్ధికి తోడ్పడే భోగాపురం ఎయిర్ పోర్ట్ గురించి కానీ, రైల్వే జోన్ గురించి కానీ, మెట్రో గురించి కానీ, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి కానీ, ఉత్తరాంధ్ర ప్రజలు ఎదుర్కొంటున్న సాగునీరు, తాగునీరు కష్టాలను తీర్చగలిగే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు గురించి కానీ ఎందుకు పాటుపడలేదని నిలదీశారు. ఇప్పుడు ఎన్నికలకు మూడు నెలల ముందు ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం గుర్తుకొచ్చిందా సీఎం జగన్? అని మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు నిలదీశారు.
‘ విశాఖ ప్రజలు అన్ని ప్రాంతాల అభివృద్ధి కోరుకుంటున్నారు కానీ, ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించే రాజధాని కాదు’ అని మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన అమరావతి రైతులను రోడ్డున పడేశారు. తమకు రాజధాని వద్దంటున్న విశాఖ ప్రజల మనోవేదనను అర్థం చేసుకోకుండా అన్నీ ప్రాంతాల వారిని ఇబ్బంది పెడుతూ మీరు సాధించేది ఏంటో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పండి. విశాఖ ప్రజలు చాలా తెలివైన వారు... మీ మాటలను నమ్మే పరిస్థితిలో లేరని స్పష్టం చేశారు. మీరు చేస్తున్న మోసాన్ని విశాఖ వాసులు పసిగట్టేశారని పతనం తప్పదని గంటా శ్రీనివాసరావు ప్రకటించారు.