Family Doctor In AP: ఏపీలో ఆగస్టు 15 నుంచి ‘ఫ్యామిలీ డాక్టర్’ - 1వ తేదీ నుంచి ట్రయల్ రన్
Family Doctor Concept in AP: ఉన్నత ఆదాయ వర్గాల వారిలో కుటుంబానికి ఒక ఫ్యామిలీ డాక్టర్ ఉండటం సహజం. అలా కాకపోయినా ఒక్కో సచివాలయ పరిధిలో ఇద్దరు వైద్యులు ప్రజల ఆరోగ్య పరిస్థితి పర్యవేక్షిస్తుంటారు.
Family Doctor Concept in AP: ఏపీలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ని తెరపైకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఆగస్ట్ 1 నుంచి ట్రయల్ రన్ నిర్వహిస్తారు. అనంతరం ఆగస్ట్ 15 నుంచి దీన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయాలనుకుంటున్నారు అధికారులు. ఈమేరకు సీఎం జగన్ అధికారులకు ఆదేశాలిచ్చారు.
ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఏంటంటే..
ఉన్నత ఆదాయ వర్గాల వారిలో కుటుంబానికి ఒక ఫ్యామిలీ డాక్టర్ ఉండటం సహజం. ఆ కుటుంబంలో ఎవరికి ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా, వెంటనే ఆ వైద్యుడిని సంప్రదిస్తారు. వెంటనే డాక్టర్ వారి ఇంటికి వచ్చి వైద్యం అందిస్తారు. అవసరమైతే వైద్య పరీక్షలకోసం ల్యాబ్ కి తీసుకెళ్తారు. లేదా స్పెషలిస్ట్ వైద్యం అవసరం ఉంటే స్పెషలిస్ట్ డాక్టర్లకు రిఫర్ చేస్తారు, వారి ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటాడు. పేదలకు ఇలాంటి సౌకర్యం కష్టమే. అయితే ప్రభుత్వమే ఇప్పుడీ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ని పేదలకు అందుబాటులోకి తెస్తోంది. అంటే ఇక్కడ ఒక్కో కుటుంబానికి ఒక్కో వైద్యుడు ఉండడు కానీ, ఒక్కో సచివాలయ పరిధిలో ఇద్దరు వైద్యులు నిరంతరం ప్రజల ఆరోగ్య పరిస్థితి పర్యవేక్షిస్తుంటారు. ప్రస్తుతం ప్రతి సచివాలయానికి అనుబంధంగా ఒక్కో డాక్టర్‌ని అదనంగా కేటాయించారు. కొత్తగా వచ్చే 104 వాహనాలతో ఒక డాక్టర్ సచివాలయంలో ఉంటే, మరొక డాక్టర్ గ్రామంలో పర్యటిస్తారు.
104కి కొనసాగింపుగా..
ప్రస్తుతం ప్రతి సచివాలయ పరిధిలోకి 104 వాహనం వారంలో ఒకరోజు వెళ్తుంది. ఆ సచివాలయంలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఓపీ నిర్వహిస్తారు. సాయంత్రం మంచంపై ఉన్నవారికి వైద్య పరీక్షలకోసం ఊరిలోకి వెళ్తారు. 104 వాహనంలోనే వైద్యులు ఉంటారు కాబట్టి ఊరంతా వారే పరీక్షలు నిర్వహించి మందుల స్లిప్ రాసిస్తారు. దీనికోసం ఇప్పుడు 656 మొబైల్ మెడికల్ యూనిట్ MMUలు ఉన్నాయి. వాటికి తోడు ఇప్పుడు 432 కొత్తవాహనాలు కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది.
ఆగస్టు 1 నుంచి ట్రయల్ రన్
ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తో 104 వాహనాల సంఖ్యను పెంచడం, ప్రతి గ్రామానికి వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిని సమీక్షించడం అనే విధానాన్ని ఆగస్ట్ 1 నుంచి ట్రయల్ రన్ రూపంలో అమలులోకి తెస్తారు. ఆగస్ట్ 15నుంచి దీన్ని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవాలని చూస్తున్నారు. సచివాలయాలే ఇందులో కేంద్ర బిందువులు. ప్రతి సచివాలయానికి 104 వాహనాలను నెలలో రెండుసార్లు వెళ్లేలా నిబంధనలు రూపొందించబోతున్నారు. ఇప్పటికే వైఎస్సార్ క్లినిక్ (YSR Clinic)ల పేరుతో పట్టణాల్లో వైద్యాన్ని మరింత అందుబాటులోకి తెచ్చారు. ఇప్పుడు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తో పల్లెల్లో కూడా ప్రభుత్వ వైద్యాన్ని పేదలకు మరింత చేరువ చేయబోతోంది జగన్ సర్కారు.